సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుంటోందని భావిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక రూపంలో అవరోధాలు, ప్రతికూల వాతావరణం ఏర్పడే పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ పటిష్టంగా మారిందని, బీజేపీ అనుకూల వాతావరణం ఉందనే అంచనాలో రాష్ట్ర పార్టీ నేతలు ఉన్నారు. ఈ సమయంలో రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీని ఇరకాటంలో పడేశాయి. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా సెంటిమెంట్ రగిలే అవకాశముందనే ఆందోళన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.
వాస్తవానికి కాంగ్రెస్‌పై ధ్వజమెత్తడంలో భాగంగా ప్రధాని మోదీ .. కాంగ్రెస్ ఏపీని విభజించిన తీరును తప్పుబట్టారని, కానీ ప్రజలు రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని భావించే ప్రమాదం ఏర్పడిందని వారంటున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార టీఆర్‌ఎస్‌ను రాజకీయంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజావ్యతిరేక విధానాలు, నిర్ణయాల పరంగా గట్టిగా ఎండగడుతూ ప్రజల మద్దతును కూడగడుతున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ప్రధాని వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకుని బీజేపీపై ధ్వజమెత్తే అవకాశం ఉందని, ఆపార్టీకి మంచి అస్త్రాన్ని అందించినట్టయ్యిందని అంటున్నారు.
విమర్శల దాడికి సమాధానం ఎలా?
రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య వాడీవేడిగా విమర్శలు, ప్రతి విమర్శల పర్వం నడుస్తోంది. ఢీ అంటే ఢీ అన్నట్టుగా వాతావరణం ఉంది. ముఖ్యంగా ఇటీవలి పరిణామాలతో తాము బాగా పుంజుకున్నామని, ప్రజల్లో మద్దతు పెరుగుతూ పార్టీ మంచి ఊపు మీద ఉందనే అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఈ సమయంలో మోదీ.. ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరుతో తెలంగాణ, ఏపీలు ఇప్పటికీ నష్టపోతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలతో తమకు ఇబ్బందులు తప్పేలా లేవని నేతలు అంటున్నారు. ప్రధాని మోదీని, జాతీయ స్థాయిలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఇతర ముఖ్యనేతలు చేసే విమర్శలకు తగిన సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో పడిపోయామనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఇంతకాలం తెలంగాణ రావడానికి బీజేపీ చేసిన కృషే కారణమని చెబుతూ వచ్చిన తాము ప్రస్తుతం ఆత్మరక్షణలో పడిపోయామని, మోదీ వ్యాఖ్యలను ఎలా సమర్థించగలమని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. 2014లో పార్లమెంట్ ఉభయసభల్లో బీజేపీ నిర్వహించిన పాత్ర, అప్పట్లో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఇతర ముఖ్యనేతలు పార్టీపరంగా పూర్తి మద్దతును ఇవ్వడం వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటూ.. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా తాము గొప్పగా చెప్పుకుంటున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావాన్నే ప్రశ్నిస్తున్న విధంగా మోదీ చేసిన వ్యాఖ్యలతో తమ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టుగా తయారైందని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment