సాక్షి, హైదరాబాద్: అనూహ్యంగా బీజేపీకి టీఆర్‌ఎస్ అండగా నిలబడింది. ఓ ఉప ఎన్నిక విషయమై బీజేపీ బరిలో నిలవాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ పోటీ నుంచి దూరంగా జరిగింది. ఆ ఎన్నికలో పోటీ చేయడం లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఈ పరిణామం హైదరాబాద్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. లింగోజిగూడ డివిజన్కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. ఈ డివిజన్కు ఏప్రిల్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో రమేశ్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తుండడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం ప్రగతి భవన్లో కలిసింది. ఈ సందర్భంగా లింగోజిగూడలో ఏకగ్రీవానికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆకుల రమేశ్ గౌడ్ సతీమణి, కుమారుడు, టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేశ్ గౌడ్ మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వారి అకాల మరణంతో వచ్చిన ఈ ఎన్నికలో పోటీ పెట్టవద్దు అని బీజేపీ చేసిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేయడం విశేషం. ఏకగ్రీవ ఉప ఎన్నికకు సహకరించాలని కేటీఆర్ ఉత్తమ్‌ను కోరినట్లు సమాచారం. మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీజేపీ ప్రతినిధి బృందం, ఆకుల రమేశ్ గౌడ్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకుండా ఏకగ్రీవ ఎన్నికకు కలిసి రావాలని పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి @KTRTRS గారు కోరారు.
— TRS Party (@trspartyonline) April 16, 2021
Comments
Please login to add a commentAdd a comment