lingojiguda
-
శ్రీచైతన్య పాఠశాలలో దారుణం
సాక్షి, హైదరాబాద్(లింగోజిగూడ): 9వ తరగతి విద్యార్థి పట్ల హాస్టల్ వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పాత రోడ్డులోని శ్రీ చైతన్య హాస్టల్లో పని చేస్తున్న కృష్ణ గత వారం రోజులుగా 9వ తరగతి బాలుడుతో పాటు ఇతర విద్యార్థులను రాత్రి సమయంలో పక్కన పడుకుని వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు బాలుడు తన తల్లిదండ్రులకు విషయం తెలియజేయడంతో బుధవారం హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్డెన్ కృష్ణను పాఠశాల యజమాన్యం మంగళవారమే హాస్టల్ నుంచి తొలగించింది. హాస్టల్‌కు అనుమతి లేదని, ఇప్పటికే నివేదిక తయారు చేసి పై అధికారులకు పంపించామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హీర్యానాయక్ తెలిపారు. చదవండి: (Hyderabad: ఇక కీలక ఘట్టమే.. నగరంలో ఆ ఫ్లైఓవర్లన్నీ బంద్) -
సాక్షి కథనానికి స్పందన.. 300 ఏళ్ల నాటి మెట్ల బావి.. మెరిసింది చూడు...
సాక్షి, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గోసాయిమఠం వద్ద ఉన్న 300 ఏళ్లనాటి మెట్లబావి చిత్రాలివి. పిచ్చి మొక్కలు, చెట్లు, చెత్తా చెదారంతో నామరూపాల్లేకుండా పోయిన ఈ బావి (మొదటి చిత్రం) దుస్థితిపై ‘గతమెంతో ఘనచరిత్ర’ శీర్షికన ఫిబ్రవరి 14న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ దీనిపై స్పందించి బావి పునరుద్ధరణ పనులు చేయించడంతో ఎంతో సుందరంగా (రెండో చిత్రం) మారింది. మరమ్మతులకు ముందు, తర్వాత తీసిన ఈ బావి ఫొటోలను అరవింద్‌కుమార్ బుధవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ప్రత్యేకతలు ఎన్నో.. మూడు వందల ఏళ్ల కింద.. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ దిగుడు బావి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీనికి తూర్పున, ఉత్తరంలో మెట్లను ఏర్పాటు చేశారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన ఆర్చీలతో మూడు గదులు నిర్మించారు. ఈ మెట్లబావిని పునరుద్ధరించడంపై మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌లకు పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చాలని కోరారు. చదవండి: రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా!.. ఇకపై ఇట్టే దొరికిపోతారు -
77 అంశాలతో ఎజెండా.. 29న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం
సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. అది ముగియగానే దానికి కొనసాగింపుగా సాధారణ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఎజెండాలో చేర్చిన 77 అంశాల్లో లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి కార్పొరేటర్‌గా ప్రమాణం చేయాల్సి ఉంది. గత డిసెంబర్లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఆడివిజన్ నుంచి గెలిచిన బీజేపీ కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం చేయకముందే మరణించడం తెలిసిందే. ఎజెండాలోని ఇతర అంశాల్లో ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణలు, జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ, థీమ్‌పార్కుల అభివృద్ధి, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం, బస్షెల్టర్లు, సబ్‌వేలు, రహదారుల విస్తరణ, పర్యాటక, వాణిజ్య ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణకు సిబ్బంది నియామకం, న్యాక్ ద్వారా ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్న ఇంజినీర్ల గడువు మరో ఏడాది పొడిగింపు తదితరమైనవి ఉన్నాయి. వాస్తవానికి వీటిపై కొత్తగా చర్చించేదంటూ ఏమీ ఉండదు కానీ, ఈసారి బీజేపీ బలం పెరగడంతో ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. చాలావరకు గతంలో స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన వాటినే జనరల్‌బాడీలో ఆమోదించాల్సి ఉన్నందున, ఎంతో కాలంగా సమావేశం జరగకపోవడంతో పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటినీ ఎజెండాలో చేర్చారు. వర్చువల్‌గానే.. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయకముందు సర్వసభ్య సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం లాక్డౌన్ లేనందున సాధారణ సమావేశానికి అవకాశం ఉంటుందేమోననే అభిప్రాయాలున్నాయి. లాక్డౌన్ తొలగించినా కోవిడ్ నిబంధనల్లో భాగంగా భౌతిక దూరం పాటించాల్సి ఉంది. దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యే సమావేశాన్ని జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో భౌతికదూరంతో నిర్వహించడం సాధ్యం కాదని సంబంధిత అధికారి తెలిపారు. దీంతో వర్చువల్‌గానే సమావేశం జరగనుంది. ప్రమాణం చేయాల్సిన కొత్త కార్పొరేటర్ మాత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. సాఫీగా జరిగేనా..? గత పాలకమండలి మాదిరిగానైతే సర్వసభ్య సమావేశాల్లోనూ చర్చించేదంటూ ఏమీ ఉండేదికాదు. గత పాలకమండలిలో అధికార టీఆర్ఎస్, దాని మిత్రపక్ష ఎంఐఎం మినహా ప్రతిపక్ష బలమంటూ లేకపోవడంతో ఏదనుకుంటే అది.. ఎంత సమయంలో ముగించాలనుకుంటే అంతే సమయంలో ముగించేవారు. ప్రస్తుతం బీజేపీ కార్పొరేటర్లు 45 మందికి పైగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్తో బీజేపీ అన్ని విషయాల్లో ఢీ అంటే ఢీ అని తలపడుతుండటం తెలిసిందే. ప్రస్తుత ఎజెండాలోని అంశాలన్నీ పాత పాలకమండలి స్టాండింగ్కమిటీ ఆమోదించినవే అయినందున వివాదం ఎందుకులే అని మిన్నకుంటుందో.. లేక సాంకేతికంగానైనా సరే కొత్త పాలకమండలి ఆమోదించాల్సి ఉన్నందున వివాదానికి తెర తీస్తుందో సమావేశం రోజున వెల్లడికానుంది. చదవండి: లాక్డౌన్ ఉల్లంఘనులకు ‘తెలంగాణ’ గుడ్‌న్యూస్ -
లింగోజిగూడ డివిజన్: ఉప ఎన్నికల కౌంటింగ్
-
గట్లెట్ల కేటీఆర్‌ను కలుస్తరు.. బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగోజిగూడ కార్పొరేటర్ ఎన్నిక ఏకగ్రీవం విషయమై మాట్లాడేందుకు మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లిన బీజేపీ నేతలపై చర్యలు తప్పేలా లేవు. దీనిని పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంలో నిజనిర్ధారణ చేసి, చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఒక కార్పొరేటర్ స్థానం కోసం హైదరాబాద్ నగర, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు ఎందుకు టీఆర్ఎస్ నేతలను కలవాల్సి వచ్చింది.. ఎవరు చెబితే వెళ్లారు.. మంత్రి కేటీఆర్‌ను ఎందుకు కలిశారు.. ఆ సందర్భంగా బండి సంజయ్‌పై కేటీఆర్ కామెంట్స్ చేసినా ఎందుకు ఉపేక్షించారు.. తదితర అంశాలతోపాటు ఆ వ్యవహారం వెను క ఏం జరిగిందనే విషయాన్ని తేల్చాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంతో సంబంధమున్నవారిపైనా చర్యలు చేపట్టే బాధ్యతను కూడా బండి సంజయ్‌కే అప్పగించినట్లు తెలిసింది. నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు కేటీఆర్‌ను కలిసిన వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి నేతృత్వంలో సోమవారం నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. సమగ్ర వివరాలను సేకరించి రెండు రోజుల్లో తనకు రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని సంజయ్ ఆదేశించారు. దీంతో కమిటీ వెంటనే రంగంలోకి దిగి వాస్తవాలను నిగ్గు తేల్చే పనిలో పడింది. చదవండి: మంత్రి ఈటలకు ఏమైంది? మరోసారి ‘అసంతృప్తి’ వ్యాఖ్యలు చదవండి: మున్సి‘పోరు’.. టీఆర్ఎస్ సరికొత్త రాజకీయం -
బీజేపీకి అండగా టీఆర్ఎస్: ఉత్తమ్‌కు కేటీఆర్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: అనూహ్యంగా బీజేపీకి టీఆర్ఎస్ అండగా నిలబడింది. ఓ ఉప ఎన్నిక విషయమై బీజేపీ బరిలో నిలవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పోటీ నుంచి దూరంగా జరిగింది. ఆ ఎన్నికలో పోటీ చేయడం లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఈ పరిణామం హైదరాబాద్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. లింగోజిగూడ డివిజన్‌కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. ఈ డివిజన్‌కు ఏప్రిల్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో రమేశ్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తుండడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం ప్రగతి భవన్లో కలిసింది. ఈ సందర్భంగా లింగోజిగూడలో ఏకగ్రీవానికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆకుల రమేశ్ గౌడ్ సతీమణి, కుమారుడు, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేశ్ గౌడ్ మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వారి అకాల మరణంతో వచ్చిన ఈ ఎన్నికలో పోటీ పెట్టవద్దు అని బీజేపీ చేసిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేయడం విశేషం. ఏకగ్రీవ ఉప ఎన్నికకు సహకరించాలని కేటీఆర్ ఉత్తమ్‌ను కోరినట్లు సమాచారం. మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీజేపీ ప్రతినిధి బృందం, ఆకుల రమేశ్ గౌడ్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకుండా ఏకగ్రీవ ఎన్నికకు కలిసి రావాలని పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి @KTRTRS గారు కోరారు. — TRS Party (@trspartyonline) April 16, 2021 -
జీహెచ్ఎంసీ: బీజేపీ కార్పొరేటర్ మృతి
సాక్షి, హైదరాబాద్ : లింగోజీగూడ బీజేపీ కార్పొరేటర్ రమేశ్ గౌడ్ గురువారం మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన.. ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఇటీవలే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన రమేశ్ గౌడ్ లింగోజీగూడ నుంచి కార్పొరేట్‌ర్‌గా ఎన్నికయ్యారు. కాగా వారం రోజుల క్రితం రమేశ్ గౌడ్‌కు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో రమేశ్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారు. గతంలో రమేశ్ గౌడ్ ఎల్బీ నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. -
లారీని ఢీకొట్టిన టాటాఏస్..ఇద్దరి మృతి
చౌటుప్పల్(నల్గొండ జిల్లా): చౌటుప్పల్ మండలం లింగోజీగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం వేకువజామున రెండు గంటల సమయంలో ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు శ్రీకాకుళం వాసులుగా గుర్తించారు. టాటా ఏస్ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.