సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిర్బంధాలు విధించినా దీక్షను కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి తీరుతామన్నారు.
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే. దీక్షకు ప్రభు త్వం అనుమతి నిరాకరించిన తర్వాత బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర. బీజేపీని అణిచివేసే చర్య. బీజేపీ పేరు వింటేనే సీఎం కేసీఆర్ వెన్నులో వణుకుపుడుతోంది.
బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అందులో భాగమే. అసెంబ్లీలోకి అనుమతించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు.. స్పీకర్‌కు సూచించినా పట్టించుకోలేదు. ట్రాఫిక్ రద్దీ, ప్రజలకు ఇబ్బంది అనే పేరుతో ధర్నా కు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయం కలిగి స్తోంది.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేసినప్పుడు లేని ఇబ్బంది.. బీజేపీ దీక్ష చేపడితేనే వచ్చిందా? ఇది ముమ్మాటికీ పక్షపాత చర్యే. ఈ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు స్పందించాలి. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంత పాలనను అంతం చేసేదాకా ఉద్యమిస్తూనే ఉంటాం’అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment