సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ‘మిషన్–90’పై బీజేపీ అధినాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. దీనికోసం తెలంగాణలోనూ ‘గుజరాత్ మోడల్’ని తు.చ. తప్పకుండా అమలుచేసి పూర్తిస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాష్ట్రపార్టీని ఆదేశించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌స్థాయిల్లో పార్టీని పటిష్టం చేయడం ఒక్కటే విజయానికి బాటలు వేస్తుందని స్పష్టంచేసింది. దీనికి సంబంధించిన కచ్చితమైన కార్యాచరణను అమలుచేయాలని, బూత్ కమిటీల ఏర్పాటు, పూర్తిస్థాయిలో వనరుల వినియోగంపై తమ ఆదేశాలు అమలు చేయాలని చెప్పింది.
ఎన్నికల దృష్ట్యా ‘ఓటర్ రీచౌట్ ప్రోగ్రామ్’ను వెంటనే మొదలుపెట్టి, ఎన్నికలు ముగిసేదాకా విడవకుండా కొనసాగించాలని ఆదేశించింది. కిందిస్థాయిలో (బూత్‌స్థాయిలో) క్రమం తప్పకుండా ప్రజలతో సంబంధాలు కొనసాగించాలని పేర్కొంది. దీంతోపాటు కేంద్రంలో మోదీ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, అభివృద్ధి గురించి వివరించి, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా పాజిటివ్ ఓటుబ్యాంక్‌ను సాధించాలని సూచించింది. జాతీయ కార్యవర్గ భేటీ దిశానిర్దేశం నేపథ్యంలో ఈ నెల 24న మహబూబ్‌నగర్‌లో జరగనున్న పార్టీ కార్యవర్గసమావేశంలో కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
మంగళవారం ఢిల్లీలో ముగిసిన జాతీయ కార్యవర్గభేటీలో ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై అధినాయకత్వం ఆయా రాష్ట్రపార్టీలకు దిశానిర్దేశం చేసింది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడం, కాంగ్రెస్‌పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లను చేజిక్కించుకోవడం, నాలుగు ఈశాన్యరాష్ట్రాల్లో విజయపరంపరను కొనసాగించాలనే సందేశాన్నిచ్చింది.
ఈ ఏడాది జరిగే అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేస్తుందని స్పష్టంచేసింది. కాగా, రెండురోజుల భేటీలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర సాగించిన తీరును వివరించారు. కేసీఆర్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలు, హామీలను నిలబెట్టుకోకపోవడంపై తాము సాగిస్తున్న పోరాటాన్ని, బీఆర్‌ఎస్‌ను ఎండగడుతున్న తీరు గురించి తెలియజేశారు.
మంగళవారం వివిధ తీర్మానాలపై మాట్లాడే అవకాశం తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి, ఈటల రాజేందర్, డా.జి.వివేక్ వెంకటస్వామికి లభించడంతో ఈ భేటీలో తెలంగాణ నేతలకు సముచితస్థానం లభించినట్టుగా చెబుతున్నారు.
20 నుంచి ఫిబ్రవరి 5 వరకు వీధి సభలు
ఈ నెల 28న బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లోక్‌సభతోపాటు మరో ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఆయన పర్యటించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలో పార్టీపరంగా జరుగుతున్న కార్యక్రమాలు, బూత్ కమిటీలతోపాటు ఇతర కమిటీల నియామకం తదితర అంశాలను సమీక్షించే అవకాశాలున్నాయి.
ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు గ్రామస్థాయిలో పది వేల వీధి సభలు, ఫిబ్రవరి 5 నుంచి 20 దాకా పదివేల శక్తికేంద్రాల్లో (3, 4 పోలింగ్‌బూత్‌లు కలిపి ఓ శక్తికేంద్రం) సమావేశాలు, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సభలు నిర్వహించనున్నారు.
తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో తెలియజేసేందుకు ఫిబ్రవరిలో మేధావులతో సమావేశాలు, మార్చిలో ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రజలను చైతన్య పరిచేందుకు సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఏప్రిల్‌లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ సర్కార్‌పై అమిత్ షా లేదా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ద్వారా చార్జిషీట్ విడుదల చేయించేలా వ్యూహరచన చేస్తున్నారు.
ఇలా ముందుకు...
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఏదో సాధించేశామని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ప్రాధాన్యతా రంగాలు మొదలుకుని.. వివిధ శాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, నిర్దేశిత లక్ష్యాలు, ఫలితాల సాధనలో వెనకడుగు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వంటి వాటిపై గ్రామస్థాయిలో, మరీ ముఖ్యంగా ప్రతీ పోలింగ్‌బూత్‌స్థాయిలో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు.
గుజరాత్‌లో ప్రధానంగా ఉన్న అభివృద్ధి సూచికలు
► అతి తక్కువ నిరుద్యోగం
► అధిక రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)
► సబర్మతి నదిని వనరులుగా మలచుకోవడం
► మహిళలకు అత్యంత భద్రత ∙ఆరోగ్యవంతులైన పిల్లలు
Comments
Please login to add a commentAdd a comment