న్యూఢిల్లీ: కీలక రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీకి 110 కంటే తక్కువ సీట్లు ఇవ్వకపోవడం విశేషం! 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 99 సీట్లొచ్చిన కమల దళానికి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏకంగా 149 నుంచి 151 సీట్ల దాకా ఇచ్చాయి!!
2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన ఈ పోరులో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ దారుణ పరాభవం మూటగట్టుకోనుందని తేల్చేశాయి. గత ఎన్నికల్లో 77 స్థానాలు గెలుచుకున్న హస్తం పార్టీకి ఈసారి ఇండియాటీవీ–మార్టిజ్ ఎగ్జిట్ పోల్ ఇచ్చిన 51 సీట్లే గరిష్టం! ముక్కోణపు పోరులో కాంగ్రెస్‌ను ఆప్ నిండా ముంచిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.
ఆప్ 20 సీట్లకు పైగా నెగ్గనుందని పలు ఎగ్జిట్ సర్వేలు పేర్కొన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. పలు ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి మొగ్గు కన్పించగా ఒకట్రెండు మాత్రం స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని పేర్కొన్నాయి. ఇక కీలకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) బీజేపీ చేజారడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అక్కడ ఆప్ ఘనవిజయం సాధిస్తోందని వివరించాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్ 12న, గుజరాత్‌లో రెండు దశల్లో డిసెంబర్ 1, 5వ తేదీల్లో పోలింగ్ జరగడం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు 8వ తేదీ గురువారం జరగనుంది. ఇక ఎంసీడీ ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది.
గుజరాత్‌లో మళ్లీ మోదీ మ్యాజిక్
గుజరాత్‌లో ఏడోసారి బీజేపీ ఘనవిజయం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. దానికి 117 నుంచి 151, కాంగ్రెస్‌కు 16–51 సీట్ల దాకా వస్తాయని అంచనా వేశాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో మెజారిటీకి 92 సీట్లు కావాలి. 2017లో పటేళ్ల ఉద్యమం తదితర కారణాలతో బీజేపీ 99 స్థానాలే నెగ్గగా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చి 77 సీట్లు కైవసం చేసుకుంది.
ఈసారి బీజేపీకి 129 నుంచి 151 సీట్లు రావచ్చని ఇండియాటుడే యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. కాంగ్రెస్ 16 నుంచి 30 సీట్లకు పరిమితమవుతుందని, ఆప్ 9 నుంచి 21 సీట్ల దాకా గెలుస్తుందని అంచనా వేసింది. న్యూస్ 24 టుడేస్ చాణక్య కూడా బీజేపీకి 150 సీట్లు, కాంగ్రెస్‌కు కేవలం 19, ఆప్‌కు 11 స్థానాలిచ్చింది. ఏబీపీ న్యూస్ సీ ఓటర్ బీజేపీకి 128 నుంచి 140, కాంగ్రెస్‌కు 43 లోపు, ఆప్‌కు 11 దాకా రావచ్చని పేర్కొంది. బీజేపీకి 148, కాంగ్రెస్‌కు 42, ఆప్‌కు 10 సీట్లొస్తాయని రిపబ్లిక్ టీవీ పేర్కొంది.
మంచు కొండల్లో పోటాపోటీ
హిమాచల్‌ప్రదేశ్ ఓట్లర్లు ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ ఈసారి కూడా కొనసాగుతుందా అంటూ అందరిలోనూ నెలకొన్న ఉత్కంఠను ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరింత పెంచాయి! 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలతో ఘన విజయం సాధించగా కాంగ్రెస్ 21 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి రెండు పార్టీల మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్ పోల్సన్సీ పేర్కొన్నాయి.
ఇండియాటుడే యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 24–34, కాంగ్రెస్‌కు 30–40 సీట్లు; న్యూస్24 టుడేస్ చాణక్య రెండు పార్టీలకూ చెరో 33 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఏబీపీ న్యూస్ సీ ఓటర్ బీజేపీకి 33 నుంచి 41, కాంగ్రెస్‌కు 24 నుంచి 32 సీట్లు; ఇండియా టీవీ బీజేపీకి 35 నుంచి 40, కాంగ్రెస్‌కు 26 నుంచి 31 సీట్లిచ్చాయి. టైమ్స్ నౌ ఈటీజీ మాత్రం బీజేపీ 38 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, కాంగ్రెస్‌కు 28 సీట్లొస్తాయని పేర్కొంది.
ఢిల్లీ కార్పొరేషన్‌పై ఎగరనున్న ఆప్ జెండా
ప్రతిష్టాత్మకంగా జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు ఆప్ తెర దించనుందని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. 250 స్థానాల్లో ఆప్ 149 నుంచి ఏకంగా 171 సీట్లు కొల్లగొట్టనుందని ఇండియాటుడే యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. బీజేపీ 69 నుంచి 91 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలోనూ ఆప్‌కు 146 నుంచి 156, బీజేపీకి 84 నుంచి 94 సీట్లొచ్చాయి.
ఆప్ 150 నుంచి 175, బీజేపీ 70 నుంచి 92 సీట్లు గెలుస్తుందని న్యూస్ ఎక్స్ పేర్కొంది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దాటబోదని మూడు సర్వేలూ తేల్చడం విశేషం! 2007 నుంచీ ఎంసీడీ బీజేపీ చేతుల్లోనే ఉంది. 2017లో జరిగిన ఎన్నికల్లో 270 సీట్లలో బీజేపీ 181 నెగ్గగా ఆప్‌కు 48, కాంగ్రెస్‌కు 27 సీట్లొచ్చాయి. ఈ ఏడాది మొదట్లో ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను కేంద్రం ఏకీకృతం చేసింది. 250 వార్డులను ఏర్పాటు చేసింది. ఆదివారం పోలింగ్ జరిగింది. 50.48 శాతం పోలింగ్ నమోదైనట్టు ఢిల్లీ ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment