
సాక్షి, హైదరాబాద్: పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఒకే పరివారమని చాటేలా, వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా బీజేపీ చేపట్టిన ‘టిఫిన్ బాక్స్ బైఠక్’ఆదివారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ ‘లంచ్’భేటీలకు కార్యకర్తలు ఎవరికి వారే టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకొని, సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఫొటోలు, వేదిక, బ్యానర్లు, మీడియా, భారీగా భోజనం ఏర్పాట్లు వంటి రాజకీయ హంగు, ఆర్భాటాలేవీ లేకుండా.. పార్టీ నేతలు, కార్యకర్తలు కలుసుకునేలా వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.
‘‘ప్రధానంగా దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఏర్పడిన కాంగ్రెస్ కల్చర్‌కు, ఏదో ఒక రూపంలో పెద్ద ఎత్తున ఖర్చు చేసే పద్ధతికి చెక్‌పెట్టేలా పార్టీ నాయకులు, కార్యకర్తల సాదర సమావేశాలకు రూపకల్పన చేశాం. ఈ భేటీల సందర్భంగా కార్యకర్తలు పిచ్చాపాటిగా అన్ని విషయాలపై మాట్లాడుకోవడంతో పాటు వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఉంటుంది..’’అని బీజేపీ నేతలు చెప్తున్నారు.
నిరంతరం కొనసాగించే యోచన
ప్రజలకు మరింత సేవ చేసేలా ప్రోత్సాహం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, పార్టీ పటిష్టత తదితర అంశాలపైనా ‘లంచ్’భేటీల్లో దృష్టి పెట్టనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. ఆదివారం ఈ బైఠక్‌లు జరిగాక.. వాటిని నిరంతరం కొనసాగించాలనే ఆలోచనతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉందని వివరించారు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. శక్తి కేంద్రాల ఇన్‌చార్జులు (మూడు, నాలుగు పోలింగ్ బూత్‌లు కలిపి ఓ శక్తి కేంద్రం), ఆ పైస్థాయిల వారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వంద మంది, అంతకు మించి పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో ప్రధాని మోదీ వారణాసిలో ఈ తరహా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్నారు.
నేతలు అతిథులుగా..
ఆదివారం నిర్వహిస్తున్న లంచ్ బైఠక్ కార్యక్రమాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి ఒక ప్రకటనలో తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్, గద్వాలలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆర్మూర్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ , బోథ్‌లో ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, దుబ్బాకలో రఘునందన్‌రావు, మలక్‌పేటలో నల్లు ఇంద్రసేనారెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఇతర నియోజకవర్గాల పరిధిలో బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠక్‌లకు హాజరవుతారని తెలిపారు.