సాక్షి, హైదరాబాద్: సతీ సహగమనం గురించి అందరికీ తెలిసిందే. భర్త చితిపైనే భార్యను సజీవంగా దహనం చేసే దారుణ పద్ధతది. కానీ, రాజు చనిపోతే అంగరక్షకులను అతనితోపాటు సజీవ సమాధి చేసే మరో వికృత ఆచారం కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. స్వామి భక్తితో ఆత్మాహుతి చేసుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడి(లెంక) స్మృతిలో ఏర్పాటు చేసిన స్మారక ఆత్మాహుతి శిల ఇటీవల వెలుగుచూసింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ శివారు ఆల్వాన్‌పల్లిలో ఉన్న అతి పురాతన జైన దేవాలయం గొల్లత్తగుడి వెనక దీన్ని గుర్తించారు. అక్కడి శిథిల శైవమఠం గోళకీ ఆలయం పరిసరాల్లో ఆరు వీరగల్లు శిలలున్నాయి. వాటిల్లో ఒకటిగా ఉన్న ఈ శిలను కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, ముచ్చర్ల దినకర్‌లు పరిశీలించారు. దానిపై పరిశోధన చేసి, అది చనిపోయిన రాజుతోపాటు సజీవంగా సమాధి చేయించుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడిదిగా తేల్చారు.
స్థానికంగా ఉన్న రాజు లేదా రాజు హోదాలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు అతని సేవకుడు కూడా ఆత్పార్పణ చేసుకోవటంతో తొలుత సేవకుడిని సమాధి చేసి, దాని మీద రాజు శవాన్ని సమాధి చేసినట్టు పేర్కొన్నారు. ఈ శిలమీద చనిపోయిన రాజు చిత్రం, దిగువ ఆ సేవకుడి చిత్రాన్ని చెక్కారు. వారు శివైక్యం చెందారనటానికి గుర్తులు చెక్కి ఉన్నాయి.
యుద్ధంలో చనిపోతే...
‘శిల మీద లఘు శాసనం ఉంది. అది ఆ సేవకుడు, రాజుకు సంబంధించే ఉండి ఉంటుంది. అస్పష్టంగా ఉన్నందున చదవటం సాధ్యం కావటం లేదు’ అని హరగోపాల్ పేర్కొన్నారు. ఇక్కడికి చేరువలోని గంగాపూర్ ప్రాంతంలో గతంలో చాలా యుద్ధాలు జరిగాయని, ఓ యుద్ధంలో స్థానిక రాజు/ ఆ స్థాయి వ్యక్తి చనిపోవటంతో అతని సేవకుడు కూడా సజీవ సమాధి ద్వారా ఆత్మార్పణ చేసుకుని ఉంటాడని, దానికి గుర్తుగా స్థానిక దేవాలయం వద్ద ఈ ఆత్మాహుతి శిలను ఏర్పాటు చేసి ఉంటారని ఆయన చెప్పారు.
ఏడెనిమిది శతాబ్దాల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని గుంటూరు జిల్లా ఈపూర్‌లో గతంలో కాకతీయ రాణి రుద్రమ మరణంతో ప్రమేయమున్న ఇలాంటి శిల్పం లభించిందని, అది చెన్నై మ్యూజియంలో ఉందని, మరోటి త్రిపురాంతకంలో ఉందని వెల్లడించారు. తెలంగాణలో తొలిసారి వెలుగు చూసిన ఈ శిల్పానికి చరిత్రలో ప్రాధాన్యముంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment