సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కల్పించేందుకు టీఎస్‌ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023ను రూపొందించిన ప్రభుత్వం.. దాని ని శాసనసభలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ తమిళిసై అనుమతి కోరుతూ రాజ్‌భవన్‌కు పంపింది. కానీ గవర్నర్ దీనికి అనుమతి ఇవ్వకపోవడంతో.. చట్టరూపంలోకి రాని బిల్లుల జాబితాలో చేరిపోయింది.
రేపటితో అసెంబ్లీ ముగుస్తుండటంతో..
ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఆర్టీసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కల్పించాలని ఇటీవలి కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదివారంతో రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగుస్తున్నాయి. ఆలోగా బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి లభించడం అనుమానమేనని అభిప్రా యం వ్యక్తమవుతోంది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు నైరాశ్యంలో మునిగిపోయారు.
ఇదే తొలిసారి
ద్రవ్య వినిమయం (బడ్జెట్), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించిన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇక శాసనసభ పాస్ చేసిన ఏ బిల్లునైనా గవర్నర్ ఆమోదానికి రాజ్‌భవన్‌కు పంపాలి. ఆపై బిల్లులు చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకోనుండటంతో వారికి ప్రతినెలా జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది.
ఇది ఆర్థికపరమైన వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందే గవర్నర్ అనుమతికి పంపాల్సి వచ్చింది. అయితే గతంలో కూడా.. ఇలాంటి బిల్లుల ను సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతిని వాయిదా వేసిన/నిరాకరించిన సందర్భాలు లేవని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ప్రభుత్వం వివరణ ఇస్తే నిర్ణయం!
ఆర్టీసీ బిల్లుకు సంబంధించి రాజ్‌భవన్ శుక్రవారం మధ్యాహ్నం, అర్ధరాత్రి రెండు ప్రకటనలు విడుదల చేసింది. తొలుత ‘‘ఈ నెల 3న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. 2న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 ప్రతిపాదన రాజ్‌భవన్‌కు చేరింది. బిల్లు పరిశీలన, న్యాయ నిపుణుల సలహా తీసుకుని ప్రభుత్వ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోవడానికి మరో కొంత సమయం అవసరం’’ అని పేర్కొంది.
రాత్రి విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘ఆర్టీసీ బిల్లును గవర్నర్ పరిశీలించారు. సంస్థ, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. పలు అంశాలపై వివరణలు, స్పష్టతను కోరుతూ ప్రభుత్వానికి వర్తమానం పంపించారు. ప్రభుత్వం తక్షణమే వివరణలతో బదులిస్తే.. బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు’’ అని తెలిపింది. ఆర్టీసీ బిల్లుకు అనుమతి ఇవ్వకుంటే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment