
సీపీ కార్యాలయంలో ఒంటిపై పోసుకుంటున్న డీజిల్ డబ్బాలను బాధితుల నుంచి లాక్కుంటున్న పోలీస్
ఖలీల్‌వాడి : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సీహెచ్ కొండూర్ గ్రామంలోని అన్నదమ్ముల భూమిలో వైకుంఠధామం నిర్మించాలంటున్న గ్రామస్తుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారిద్దరూ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సీహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన హన్మాండ్లు, లింగంకు వారసత్వంగా వచ్చిన రెండెకరాల భూమి ఉంది.
మూడేళ్ల క్రితం ఈ భూమిలో వైకుంఠధామం నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. అయితే 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమిలో వైకుంఠధామం నిర్మిస్తే తమకు జీవానాధారమైన సాగు భూమి లేకుండా పోతుందని గ్రామస్తుల్ని వేడుకున్నారు. అయినప్పటికీ గ్రామస్తులు, కుల సంఘం సభ్యులు మూడేళ్లుగా పట్టువిడవకుండా ఒత్తిడి చేస్తుడటంతో విసిగిపోయిన హన్మాండ్లు, లింగంలు నందిపేట్‌లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి న్యాయం చేయాలని వేడుకున్నారు.
వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలసి జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి అన్నదమ్ములిద్దరూ ఒంటిపై డీజీల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు డీజీల్ డబ్బాలతోపాటు అగ్గిపెట్టెను లాక్కున్నారు. తమను కుల బహిష్కరణ చేశారని, గ్రామంలో కూడా తమతో ఎవరూ మాట్లాడటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్క ఊళ్లకు వెళ్లి వ్యవసాయపనులు చేసుకుంటున్నామని వాపోయారు. స్పందించిన సీపీ కేఆర్ నాగరాజు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆర్మూర్ ఏసీపీకి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment