
వరంగల్: మండల పరిధి వనపర్తిలో ఇటీవల ప్రదర్శించిన ‘బలగం’ సినిమా మనస్పర్థలతో దూరమైన అక్కా.. తమ్ముడి కుటుంబాలను కలిపింది. వివరాలిలా ఉన్నాయి. అనుముల లింగారెడ్డి, లక్ష్మి అక్కా తమ్ముళ్లు. లక్ష్మిని అదే గ్రామంలో పప్పు వీరారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. రెండు కుటుంబాలు వనపర్తిలోనే ఉంటున్నాయి. 15 ఏళ్ల క్రితం లింగారెడ్డి కూతురు రజిని వివాహవేడుకల్లో లక్ష్మి ఫొటో తీయకపోవడంతో భోజనం చేయకుండా అలిగి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు దూరమయ్యాయి.
ఏడాదిన్నర క్రితం లక్ష్మి భర్త వీరారెడ్డి మృతి చెందగా.. అంత్యక్రియల సమయంలో లింగారెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడు. దీంతో అతడి భార్య వసంత, కొడుకు శ్రీకాంత్‌రెడ్డి అంత్యక్రియలకు వెళ్లొచ్చారు. అయినా రెండు కుటుంబాలు కలిసిపోలేదు. ఇటీవల సర్పంచ్ ఉంగరాల శ్రీధర్ గ్రామంలో బలగం సినిమాను పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించారు. ఆ సినిమా చూసిన లింగారెడ్డి, లక్ష్మి హృదయాల్లో మార్పు వచ్చింది. పంతాలు వదిలేసి సర్పంచ్ శ్రీధర్, గ్రామస్తులు మహేష్, రవీందర్‌రెడ్డి సమక్షంలో ఈనెల 15న లింగారెడ్డి తన అక్క లక్ష్మి ఇంటికి వెళ్లాడు. దీంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment