సాక్షి, తెలంగాణభవన్: హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి రేవంత్ సర్కార్ వసూళ్లకు పాల్పడుతోందన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? లేక బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దిక్కుమాలిన పాలన వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
నేడు తెలంగాణభవన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రాను తీసుకువచ్చారు. వసూళ్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా పేరుతో వసూలు జరుగుతున్నాయని ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ నేతలను కొట్టారు. అఖిలపక్షం సమావేశం కాదు.. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలతో మీటింగ్ పెట్టాలి. పార్టీల అభిప్రాయాలు కాదు.. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. మూసీ సుందరీకరణ వెనుక భారీ కుంభకోణం ఉంది.
అక్రమ నిర్మాణమైతే.. నా ఫాంహౌస్‌ను కూల్చేయండి. పేదల కడుపు కొట్టకుండా మూసీ సుందరీకరణ చేసుకోవచ్చు. మూసీకి పురిట్లోనే గండి కొట్టి.. హైదరాబాద్ వచ్చి సుందరీకరణ అంటున్నారు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్స్‌కు అమెరికా, యూకే లాంటి దేశాలు వాడటం లేదు. పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్లై ఓవర్స్ ఆలోచనను విరమించుకున్నాం. సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? లేక బీజేపీలో ఉన్నారా?. ఉన్నట్టుండి రేవంత్‌కు దేశరక్షణ గుర్తొచ్చింది. గతంలో ఆర్మీలో ఏమైనా రేవంత్ పనిచేశాడా?.
మూసీ నది పరివాహక ప్రజలకు 50 ఏండ్ల కిందట ప్రభుత్వమే పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చింది. వారి చేత నల్లా బిల్లు, కరెంట్ బిల్లు కట్టించుకుంది. మూసీ సుందీరకరణ, హైడ్రా ఏదైనా కావొచ్చు.. ఏదైనా సరే.. నిర్దిష్టమైన ఆలోచన, పద్ధతి, ప్రణాళిక లేదు. మూసీ పేరిట జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో దాన్ని వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. దిక్కుమాలిన పాలన వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. సీఎం దివాలాకోరు మాటల వలనే అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డంగా ఉంటారు. కాంగ్రెస్ హయాంలోనే అనుమతిలిచ్చి.. ఇప్పుడు కూల్చుతున్నారని డిప్యూటీ సీఎంకు తెలియదా?. మోదీని చూస్తే.. రేవంత్ రెడ్డికి హడల్. సంక్షేమ పథకాలకు లేని నిధులు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు ఎక్కడివి?’ అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment