సర్వశక్తులూ ఒడ్డుతున్న బీఆర్‌ఎస్‌నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో గులాబీ శ్రేణుల సమావేశాలు
బసవతారకం ఆస్పత్రి నుంచి నిమ్స్ వరకు ర్యాలీ
నిమ్స్‌లో అన్నదానం, రోగులకు పండ్ల పంపిణీ
కరీంనగర్ జిల్లాలో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్, నిజామాబాద్‌లో కవిత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తిరిగి రగిలించడమే లక్ష్యంగా ‘దీక్షా దివస్’ నిర్వహిస్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్.. దానిని విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. తెలంగాణ సాధన కోసం 2009 నవంబర్ 29న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను గుర్తు చేస్తూ బీఆర్‌ఎస్ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో ‘దీక్షా దివస్’నిర్వహించనుంది. కేడర్‌ను సమీకరించేందుకు ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు, కీలక నేతలను జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం జరిగే దీక్షాదివస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తోపాటు ఇతర కీలక నేతలు పాల్గొంటారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ విరామం తర్వాత దీక్షాదివస్‌లో పాల్గొనేందుకు తెలంగాణభవన్‌కు రానున్నారు. కేటీఆర్ కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో, హరీశ్‌రావు సిద్దిపేటలో, కవిత నిజామాబాద్‌లో ఉదయం జరిగే దీక్షాదివస్‌లో, మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు తమ తమ జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీక్షాదివస్ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్‌కు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. కేసీఆర్ దీక్ష విరమించిన రోజును గుర్తు చేస్తూ డిసెంబర్ 9న మేడ్చల్‌లో కేటీఆర్ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
జాతీయ పార్టీలే లక్ష్యంగా...
బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి కేడర్ ను సమీకరించి దీక్షాదివస్ నిర్వహించనుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా శుక్రవారం జరిగే సమావేశాల్లో విమర్శలు సంధించి పార్టీ కేడర్‌లో జోష్ నింపాలని భావిస్తోంది. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా దీక్షాదివస్ సమావేశాలు ఉంటాయని పార్టీవర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ వైఫల్యాలపై కేంద్ర ప్రభు త్వం మౌనంగా ఉంటున్న తీరును కేడర్‌కు విడమరిచి చెప్పాలని పార్టీ ఆదేశించింది.
రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధాన్యం బోనస్, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం తదితరాలపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించిన బీఆర్‌ఎస్.. వాటిని మరింత బలంగా దీక్షాదివస్ వేదికగా ప్రశ్నించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయడంలో దీక్షాదివస్ తొలిఅంకమని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిస్తేజంగా మారిన పార్టీ కేడర్‌లో కదలిక తెచ్చేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment