‘అనర్హత’పై నిర్ణయాధికారం స్పీకర్‌దే
ఎమ్మెల్యే ఫిరాయింపుల పిటిషన్లలో ఏజీ వాదనలు
మధ్యంతర ఉత్తర్వుల కోసం ఒత్తిడి సరికాదు
పిటిషనర్ల న్యాయవాదుల తీరును తప్పబట్టిన ఏజీ
తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాధికారం శాసన సభ స్పీకర్‌దేనని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గడువు విధించి ఆలోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయజాలవన్నారు.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, దానం నాగేందర్‌ను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎల్పీ మహేశ్వర్‌రెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బీ.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు.
ప్రభుత్వం తరఫున ఏజీ, ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘అనర్హతపై కోర్టులు స్పీకర్‌కు గడువు విధించలేవు. పిటిషనర్లు చెప్పిన ప్రకారం ఫిర్యాదు చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వాలి. మరి వారంపది రోజుల్లోనే హైకోర్టులో పిటిషన్లు ఎలా వేశారు. ఎందుకు వేశారు?. స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అత్యంత స్వల్పం. అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత విచారణ చేయవచ్చు.
అయితే అందులోనూ న్యాయస్థానాల జోక్యం స్వల్పమే’అని వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు జె.రాంచందర్‌రావు, గండ్ర మోహన్‌రావు.. ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. స్పీకర్ రాజ్యాంగ అధికారి అని.. ఆ కుర్చీపై మాకు గౌరవం ఉందన్నారు. అయితే తన ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లు ఏ దశకు చేరుకున్నాయో తెలియజేయాలని స్పీకర్‌ను ఆదేశించకున్నా.. దీనిపై అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై స్పీకర్ ఏం చర్యలు చేపట్టారో వివరాలు అందజేయాలని కోరవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. దీనికి ఏజీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో కూడా స్పీకర్‌ను న్యాయస్థానాలు వివరాలు అడగలేవని బదులిచ్చారు. ఇప్పడు అత్యవసర ఉత్తర్వులు కోరుతున్న న్యాయవాదులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి కేసుల్లో వాయిదా కోరిన వారేనని చెప్పారు. ఇప్పుడు న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడం హాస్యాస్పదం అన్నారు. అనంతరం తదుపరి వాదనల కోసం విచారణను రేపటికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment