సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌లో అసమ్మతిపై అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నవారి వివరాలు అంద జేయాల్సిందిగా జిల్లా ఇన్‌చార్జిలను ఆదేశించారు. ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళ నాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో ప్రారంభమైన ఆత్మీయ సమ్మేళనాలను ఈ నెల 20 వరకు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు.
అయితే వీటికి లభిస్తున్న స్పందన దృష్టిలో పెట్టుకుని, కార్యకర్తలతో మొక్కుబడి సమావేశాలు కాకుండా విస్తృత స్థాయిలో నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఆత్మీయ సమ్మేళనాల గడువును మే నెలాఖరుదాకా పొడిగిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. ఇప్పటివరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు 60 శాతం మేర పూర్తయినట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి.
పార్టీకి నష్టం వాటిల్లకుండా..
నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు అప్పగించారు. జిల్లాల వారీగా పార్టీ తరఫున ఇన్‌చార్జిలను కూడా నియమించారు. ఈ మేరకు జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాల వివరాలను జిల్లా ఇన్‌చార్జిలు ఎప్పటికప్పుడు కేటీఆర్‌కు నివేదిస్తున్నారు. అయితే ఇటీవల.. కొంతకాలంగా అసమ్మతి గళం విన్పిస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఏడాదిలో ఈ తరహా నేతలతో పార్టీకి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. మొత్తంగా ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపై ఈ నెల 27 లోగా నివేదికలు ఇవ్వాలని కేటీఆర్ ఆదేశించారు.
40కి పైగా నియోజకవర్గాల్లో అసంతృప్తి!
ఇప్పటికే సుమారు 40కి పైగా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు.. ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉంటున్నట్లు గుర్తించారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ తరహా పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారి అసంతృప్తికి కారణాలు తెలుసుకోవాలని జిల్లా ఇన్‌చార్జిలకు ఆదేశాలు వెళ్లాయి.
చాలా నియోజకవర్గాల్లో వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన ముఖ్య నేతలు, ఆ తర్వాత స్తబ్దుగా ఉండటానికి గల కారణాలపై జిల్లా ఇన్‌చార్జిలు ఆరా తీస్తున్నారు. అలాగే ఇతర పార్టీల నుంచి నేతల చేరికతో పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలు దూరంగా ఉండటంపైనా బీఆర్‌ఎస్ అంతర్గతంగా పోస్ట్‌మార్టమ్ చేస్తోంది.
పార్టీ ప్రతినిధుల సభకు బదులు..
ఈ నెల 25న పార్టీ ముఖ్య నేతలతో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న ఎల్‌బీ స్టేడియంలో సుమారు 6వేల మంది ముఖ్య నేతలతో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తామని తొలుత ప్రకటించారు. అయితే ప్రతినిధుల సమావేశానికి బదులుగా అదేరోజు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర్‌ర కార్యవర్గం ఈ భేటీలో పాల్గొంటుంది.
సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. 2023 చివరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం లక్ష్యంగా ఈ సమావేÔశం ఉంటుందని సమాచారం. జనరల్ బాడీ మీటింగ్ తర్వాత ఎన్నికల సన్నాహాలతో పాటు దిద్దుబాటు చర్యలు వేగవంతమవుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా నేతలు.. అసమ్మతిపై బీఆర్‌ఎస్ ఆరా!
Published Tue, Apr 18 2023 2:31 AM | Last Updated on Tue, Apr 18 2023 7:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment