నాంపల్లి: బీసీ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏసీగార్డ్స్ అడ్వకేట్స్ కాలనీలోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు–బీఎస్పీ భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జనాభా దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, క్రీమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు.
కాలేల్కర్, మండల్ కమిషన్ల సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో దేశవ్యాప్తంగా బీసీల కోసం 8617 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఉన్నా ఉద్దేశపూర్వకంగా 4821 పోస్టులను ఖాళీగా ఉంచారని నిందించారు.
దర్యాప్తులు, ఐటీ దాడుల పేరుతో బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. పథకం ప్రకారమే రెండు ప్రభుత్వాలు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ఫారెస్టు అధికారులను చంపుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం నుంచి తమ పార్టీ కార్యాచరణ ప్రారంభం అవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు, రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ అబ్రార్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, అధికార ప్రతినిధులు సాంబశివగౌడ్, అరుణ, డాక్టర్ వెంకటేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment