
సూర్యాపేట: పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ నేతలు అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారని, అక్రమాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికారయాత్రలో భాగంగా ఆయన గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాం తాల్లో పర్యటించారు. తొలుత అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం క్రాస్‌రోడ్డులోని విగ్రహానికి నివాళులర్పించేందుకు ప్రవీణ్‌కుమార్ వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి వచ్చేవరకు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు ఎవరూ వేయొద్దని నిలిపివేయడంతో బీఎస్పీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదేసమయంలో అక్కడికి వచ్చిన మంత్రి తన తోపాటు ప్రవీణ్‌కుమార్‌ను విగ్రహం వద్దకు తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ వరి వేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వమే ఢిల్లీకి వెళ్లి డ్రామాలు వేసి చివరకు వడ్లు కొంటామంటోందన్నారు. మిల్లర్ల వద్ద రైతు లను బలిపశువును చేస్తోం దని దుయ్యబట్టారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు చడపంగు రవి, నియోజకవర్గ అధ్యక్షుడు యాతాకుల సునీల్ తదితరులు పాల్గొన్నారు.