సాక్షి, సిటీబ్యూరో : నగరంలో అన్ని వర్గాల ప్రయాణికులకు అందుబాటులో ఉన్న క్యాబ్‌లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏడాది కాలంగా చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు కారణం. కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ క్యాబ్‌ల మనుగడపైన భారీ దెబ్బ కొట్టింది. ఆ తరువాత నిబంధనల సడలింపుతో క్రమంగా వాహనాలు రోడ్డెక్కినప్పటికీ ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో భారీగా కురిసిన వర్షాలతో క్యాబ్ రంగం కుదేలైంది. సుమారు 5 వేల వాహనాలు నీటమునిగి వినియోగానికి పనికి రాకుండా పోయాయి. థర్డ్ పార్టీ ఇన్సూ్యరెన్స్ కలిగిన ఈ క్యాబ్‌లకు పరిహారం లభించలేదు. మరోవైపు ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థల నుంచి సరైన కమీషన్‌లు లభించక చాలా మంది డ్రైవర్లు ఈఎంఐలు చెల్లించలేక వాహనాలను వదులుకున్నారు. ఓలా సంస్థ స్వయంగా 3 వేల లీజు వాహనాలను డ్రైవర్‌ల నుంచి జప్తు చేసినట్లు తెలంగాణ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా క్యాబ్‌లపై జరిగిన ముప్పేట దాడి కారణంగా వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
గ్రేటర్‌లో 40 వేల క్యాబ్‌లే...
కోవిడ్‌కు ముందుకు సుమారు 1.2 లక్షలకు పైగా క్యాబ్‌లు నగరంలో తిరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకే ప్రతి రోజు 10 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో క్యాబ్‌లకు కూడా డిమాండ్ తగ్గింది. అలాగే ఐటీ సంస్థలు ఇంకా తెరుచుకోలేదు. ఒకప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఐటీ రంగాన్ని నమమ్ముకొని వాహనాలు కొనుగోలు చేశారు. ఓలా, ఉబెర్ సంస్థలతో అనుసంధానమయ్యారు. క్యాబ్ సంస్థలు కమీషన్‌లను తగ్గించినప్పటికీ క్యాబ్ డ్రైవర్లు రవాణా రంగాన్ని మాత్రం వదులుకోలేదు. కానీ ఏడాది కాలంగా ఐటీ కార్యకలాపాలు ఇంటి నుంచే సాగుతుండడంతో ఉద్యోగుల రాకపోకలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తరువాత తిరిగి 60 వేల క్యాబ్‌లు రోడ్డెక్కాయి. కానీ భారీ వర్షాలు దెబ్బతీసాయి. సుమారు 5 వేల క్యాబ్‌లు నీటమునిగి వినియోగానికి రాకుండా పాడయ్యాయి. ఇలా అనేక కారణాల వల్ల క్యాబ్‌లసంఖ్య సిటీలో సుమారు 40 వేలకు పడిపోయింది.
చార్జీలు పెంచితేనే మనుగడ..
ఈ క్రమంలో కర్ణాటక తరహాలో కిలోమీటర్ ప్రాతిపదికన చార్జీలను పెంచాలని క్యాబ్ అసోసియేషన్‌లు కోరుతున్నాయి. ప్రస్తుతం నగరంలో కిలోమీటర్‌కు రూ.10 నుంచి రూ.12 మాత్రమే లభిస్తుంది. దీనిని కిలోమీటర్‌కు రూ.17 చొప్పున పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘ ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయి. ఓలా, ఉబెర్ సంస్థలు కమిషన్‌లలో భారీగా కోత విధించాయి. దీంతో మా మనుగడే ప్రశ్నార్ధకమైంది’ అని తెలంగాణ క్యాబ్ అండ్ ట్రావెల్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కన్వీనర్ షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: పెళ్లి బృందంతో బస్సు.. డ్రైవర్‌కి ఫిట్స్
Comments
Please login to add a commentAdd a comment