సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌కు మరో మూడు నెలలే సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా సీఎం కేసీఆర్ ఈ నెల 31న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ భేటీకి భారీ ఎజెండాను ఖరారు చేశారు.
40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ‘నిరుద్యోగ భృతి’లాంటి అమలు కాని హామీలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. పాక్షికంగా అమలైన పంట రుణాల మాఫీ లాంటి అంశాలు కూడా చర్చకు రానున్నట్టు తెలిసింది.
అలాగే ఎన్నికలు పురస్కరించుకుని కొత్త హామీల ప్రకటనకు ఉన్న అవకాశాలను కేబినెట్ సమీక్షించనున్నట్టు సమాచారం. సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. ఇందుకు సంబంధించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోవచ్చు.
ఉద్యోగులకు వేతన సవరణ, పదోన్నతులు..
గత ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వర్తింపజేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను నియమించలేదు. ఈ నేపథ్యంలో పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటనకు ఉన్న అవకాశాలను మంత్రివర్గం సమీక్షించే అవకాశాలున్నాయి. ఉపాధ్యాయులు, భాషా పండితులు, పీఈటీలు దీర్ఘకాలంగా పదోన్నతులు, బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న 2 లక్షల మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. నెలల తరబడిగా వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ అంశాలపైనా కేబినెట్ చర్చించ వచ్చని చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ అమలు, సంస్థ ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశాన్ని కేబినెట్ ఎజెండాలో చేర్చారు.
వర్షాలు, వరదలపై...
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో జరిగిన నష్టం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కేబినెట్ సమీక్షించనుంది. వానాకాలం పంటల పరిస్థితిని అంచనా వేయడంతో పాటు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై చర్చించనుంది. రహదారులు తెగిపోవడం వంటి వాటిపై చర్చించి నష్టాన్ని అంచనా వేయనుంది. యుద్ధప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment