ఢీకొట్టింది వాహనానికా.. రెయిలింగ్‌కా..? | Cantonment MLA Lasya Nandita dies in road accident on ORR | Sakshi
Sakshi News home page

ఢీకొట్టింది వాహనానికా.. రెయిలింగ్‌కా..?

Published Sat, Feb 24 2024 12:43 PM | Last Updated on Sat, Feb 24 2024 3:09 PM

Cantonment MLA Lasya Nandita dies in road accident on ORR - Sakshi

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జ్ఞాన లాస్య నందిత కారు ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు ఇంకా ఓ నిర్ధారణకు రాలేక పోతున్నారు. నందిత ప్రయాణిస్తున్న కారు గుర్తు తెలియని వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీ కొట్టిన తర్వాత.. అదుపు తప్పి అతి వేగంగా వెళ్లి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌కు గుద్దుకుందా?  లేదా డైరెక్ట్‌గా రెయిలింగ్‌కు ఢీకొట్టిందా.. అనే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణకు రాలేకపోతున్నారని సమాచారం. ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు.. ఇప్పటికే కారు నడుపుతున్న ఎమ్మెల్యే పీఏ ఆకాష్‌ వద్ద స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కళ్లు బైర్లు కమ్ముకున్నట్లు ఆయన పేర్కొన్నట్లు సమాచారం. 

 వాహనంపై రోబోసాండ్‌ రేణువులు.. 
ప్రమాదానికి గురైన వీరి వాహనం ఎస్‌ఎల్‌–6 కారుపై రోబోసాండ్‌ రేణువులు పడి ఉన్నాయి. దీనిని బట్టి ఈ వాహనం టిప్పర్‌ను ఢీకొట్టిందనే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఓఆర్‌ఆర్‌పై ఉన్న టోల్‌గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తే.. ఆ సమయంలో సుమారు 15 నుంచి 20 వరకు టిప్పర్లు లాంటి భారీ వాహనాలు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అలా కాకుండా వీరి వాహనం సుమారు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌కు గుద్దుకుందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట టిప్పర్‌ లాక్కెళ్లినట్లు గుర్తులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలించారు.  

మృతురాలు ఎమ్మెల్యే కావడంతో.. 
రోడ్డు ప్రమాదంలో మరణించినది ఎమ్మెల్యే కావడంతో ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కేసు దర్యాప్తును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు పోలీసులు ఐదు శాఖలతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు, మోటార్‌వెహికిల్‌ (టాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌), సివిల్‌ ఇంజనీర్‌ (ఓఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ విభాగం), క్లూస్‌టీం, ఫోరెన్సిక్‌ డాక్టర్లు.. ఇలా ఐదు కీలక శాఖల నిపుణులతో ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఆయా శాఖల నిపుణులు ఒకటీ రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.  

వాహనాన్ని పరిశీలించిన బృందం
ప్రమాదానికి గురైన వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణుల బృందం లాస్యనందిత సీటు బెల్టు పెట్టుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. బెల్టు పెట్టుకుంటేనే బెలూన్‌లు ఓపెన్‌ అయ్యాయని చెబుతున్నారు. అయినా లాస్య తీవ్ర స్థాయిలో గాయాల పాలవడం.. ఏకంగా మృత్యువాత పడటం ఎలా జరిగిందనే కోణంలో కూడా నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. వీరి వాహనం కొత్తది కావడంతో ఫిట్‌నెస్‌ లోపాలు కూడా ఉండవనే నిర్దారణకు వచ్చారు.  

 మలుపులు లేని రోడ్డు.. 
ఇంజనీరింగ్‌ విభాగం నిపుణులు ఔటర్‌రింగ్‌ రోడ్డుపై ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే ప్రమాదం జరిగిన చోట ఎలాంటి మలుపులు లేవని నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రదేశంలో ఎక్కడైనా సీసీటీవీ పుటేజీ దొరుకుతుందేమోనని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఒకటీ రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో తేల్చే అవకాశాలున్నట్లు పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి.  

హరీశ్‌రావు పరామర్శ 
పటాన్‌చెరు/ సంగారెడ్డి: లాస్య నందిత మృతి వార్త విని ఎమ్మెల్యే హరీష్రావు హుటాహుటిన పటాన్‌చెరుకు చేరుకున్నారు. అమేద ఆసుపత్రి వద్ద లాస్య కుటుంబ సభ్యులను, బంధువులను పరామర్శించారు. అలాగే లాస్య నందిత మృతి చెందడం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతోమంచి భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఆమె మృతికి సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement