Cantonment mla
-
ఢీకొట్టింది వాహనానికా.. రెయిలింగ్‌కా..?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కంటోన్మెంట్ ఎమ్మెల్యే జ్ఞాన లాస్య నందిత కారు ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు ఇంకా ఓ నిర్ధారణకు రాలేక పోతున్నారు. నందిత ప్రయాణిస్తున్న కారు గుర్తు తెలియని వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీ కొట్టిన తర్వాత.. అదుపు తప్పి అతి వేగంగా వెళ్లి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌కు గుద్దుకుందా? లేదా డైరెక్ట్‌గా రెయిలింగ్‌కు ఢీకొట్టిందా.. అనే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణకు రాలేకపోతున్నారని సమాచారం. ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు.. ఇప్పటికే కారు నడుపుతున్న ఎమ్మెల్యే పీఏ ఆకాష్ వద్ద స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కళ్లు బైర్లు కమ్ముకున్నట్లు ఆయన పేర్కొన్నట్లు సమాచారం. వాహనంపై రోబోసాండ్ రేణువులు.. ప్రమాదానికి గురైన వీరి వాహనం ఎస్ఎల్–6 కారుపై రోబోసాండ్ రేణువులు పడి ఉన్నాయి. దీనిని బట్టి ఈ వాహనం టిప్పర్‌ను ఢీకొట్టిందనే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఓఆర్ఆర్పై ఉన్న టోల్గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తే.. ఆ సమయంలో సుమారు 15 నుంచి 20 వరకు టిప్పర్లు లాంటి భారీ వాహనాలు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అలా కాకుండా వీరి వాహనం సుమారు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌కు గుద్దుకుందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట టిప్పర్ లాక్కెళ్లినట్లు గుర్తులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలించారు. మృతురాలు ఎమ్మెల్యే కావడంతో.. రోడ్డు ప్రమాదంలో మరణించినది ఎమ్మెల్యే కావడంతో ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కేసు దర్యాప్తును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు పోలీసులు ఐదు శాఖలతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు, మోటార్‌వెహికిల్ (టాన్స్‌పోర్టు డిపార్టుమెంట్), సివిల్ ఇంజనీర్ (ఓఆర్ఆర్ ఇంజనీరింగ్ విభాగం), క్లూస్‌టీం, ఫోరెన్సిక్ డాక్టర్లు.. ఇలా ఐదు కీలక శాఖల నిపుణులతో ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఆయా శాఖల నిపుణులు ఒకటీ రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. వాహనాన్ని పరిశీలించిన బృందం ప్రమాదానికి గురైన వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణుల బృందం లాస్యనందిత సీటు బెల్టు పెట్టుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. బెల్టు పెట్టుకుంటేనే బెలూన్లు ఓపెన్ అయ్యాయని చెబుతున్నారు. అయినా లాస్య తీవ్ర స్థాయిలో గాయాల పాలవడం.. ఏకంగా మృత్యువాత పడటం ఎలా జరిగిందనే కోణంలో కూడా నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. వీరి వాహనం కొత్తది కావడంతో ఫిట్నెస్ లోపాలు కూడా ఉండవనే నిర్దారణకు వచ్చారు. మలుపులు లేని రోడ్డు.. ఇంజనీరింగ్ విభాగం నిపుణులు ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే ప్రమాదం జరిగిన చోట ఎలాంటి మలుపులు లేవని నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రదేశంలో ఎక్కడైనా సీసీటీవీ పుటేజీ దొరుకుతుందేమోనని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఒకటీ రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో తేల్చే అవకాశాలున్నట్లు పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి. హరీశ్‌రావు పరామర్శ పటాన్చెరు/ సంగారెడ్డి: లాస్య నందిత మృతి వార్త విని ఎమ్మెల్యే హరీష్‌రావు హుటాహుటిన పటాన్‌చెరుకు చేరుకున్నారు. అమేద ఆసుపత్రి వద్ద లాస్య కుటుంబ సభ్యులను, బంధువులను పరామర్శించారు. అలాగే లాస్య నందిత మృతి చెందడం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతోమంచి భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఆమె మృతికి సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు/పటాన్చెరు టౌన్/కంటోన్మెంట్: దివంగత రాజకీయ నేత జి. సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. లాస్య నందిత (37) శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై రామేశ్వరం బండ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ గుర్తుతెలియని భారీ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొని ఆపై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు సీట్లో కూర్చున్న నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం నడిపిన ఆమె పీఏ ఆకాష్ కాళ్లు విరిగాయి. కారు గంటకు సుమారు 100 కి.మీ. వేగంతో వెళ్తుండటంతో ప్రమాద తీవ్రతకు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద వార్త తెలియగానే హైవే పాట్రోల్, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఎమ్మెల్యే లాస్య నందిత, డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా నందిత అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు వెళుతున్న క్రమంలో.. ఎమ్మెల్యే లాస్య నందిత తన అక్క కూతురు స్కూల్లో చేరుతుండటంతో రెండు వాహనాల్లో కుటుంబ సభ్యులతో కలసి రెండు వాహనాల్లో గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు సమీపంలోని సూఫీ మిస్కిన్ దర్గాను దర్శించుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులను వారి నివాసాల్లో దింపిన అనంతరం ఆకలి వేస్తుండటంతో బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు శామీర్‌పేట వైపు నుంచి పటాన్చెరు వైపు వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు ప్రకటించారు. డ్రైవర్ ఆకాష్ అకస్మాత్తుగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి ఆపై రైలింగ్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోందని... ఆ సమయంలో ఎమ్మెల్యే లాస్య సీటు బెల్టు పెట్టుకున్నట్లే ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, లాస్య నందిత కారు ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనాన్ని జహీరాబాద్ వద్ద పోలీసులు స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అక్క పిలుస్తోంది.. వెళ్లొస్తానని చెప్పి.. ఎమ్మెల్యే లాస్య కారు నడిపిన ఆకాశ్‌కు ఆమె నుంచి ఫోన్ రావడంతో అక్క దగ్గరికి వెళ్తున్నానంటూ ఇంట్లో వాళ్లకు చెప్పి బయలుదేరినట్లు తెలిసింది. ఆకాశ్ తండ్రి శ్రీనివాస్ కంటోన్మెంట్లో దఫేదార్‌గా పనిచేసి రెండేళ్ల క్రితం బ్రెయిన్‌డెడ్‌కు గురై మరణించారు. మడ్‌ఫోర్ట్‌లో నివసించే ఆకాశ్ ఇటీవలే కానిస్టేబుల్ రాత పరీక్షల్లో ఉత్తీర్ణుడైనట్లు అతని సన్నిహితులు పేర్కొంటున్నారు. లాస్య నందిత చిన్నమ్మ కూతురు, కొడుకు పీయూష్ రాఘవ, ఆకాశ్ స్నేహితులు. ఈ క్రమంలోనే పీయూష్ ద్వారా లాస్యకు ఆకాశ్ పరిచయం అయ్యాడు. ఇంటి మనిషిగా వ్యక్తిగత పనులపై వెళ్లినప్పుడు తరచూ ఆకాశ్‌తోనే ఆమె బయటకు వెళ్లేవారని తెలుస్తోంది. 10 రోజుల క్రితం నల్లగొండలో లాస్య కారు ప్రమాదానికి గురైన సమయంలో పీయూష్ ఆ వాహనాన్ని నడపగా శుక్రవారం నాటి ప్రమాదంలో ఆకాశ్ వాహనాన్ని నడపడం గమనార్హం. కేసు నమోదు ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాష్‌పై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 304 కింద కేసు పెట్టారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపారని లాస్య సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాధు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పటాన్చెరు పోలీసులు తెలిపారు. సీఎం రేవంత్ సహా నేతల నివాళి... రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత పారి్థవదేహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌రావు, ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్‌రావు సహా పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని స్వగృహానికి ఆమె పారి్థవదేహాన్ని తరలించగా సీఎం, మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మరికొందరు నేతలు ఆమె నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఆమె అంతిమయాత్రలో పాడె మోశారు. శుక్రవారం సాయంత్రం ఈస్ట్ మారేడుపల్లిలోని హిందూ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు జరిగాయి. కుటుంబానికి అండగా ఉంటాం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కష్టకాలంలో ఉన్న ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఇటీవల నల్లగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన లాస్య నందితను పరామర్శించి వారం కూడా కాకముందే ఆమె లేరనే విషాదకర వార్తను వినాల్సి వస్తుందని అనుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లాస్యను వెంటాడిన వరుస ప్రమాదాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను రెండు నెలలుగా వరుస ప్రమాదాలు వెంటాడాయి. గతేడాది డిసెంబర్ 3న ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య అదే నెల 24న బోయిన్‌పల్లిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నూతన విభాగం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా వెళ్లారు. సెల్లార్ నుంచి మూడో అంతస్తుకు వెళ్లే క్రమంలో ఒకటో అంతస్తుకు రాగానే లిఫ్ట్ కూలిపోయింది. లిఫ్ట్‌ను బద్దలు కొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె ఆసుపత్రి ప్రారం¿ోత్సవంలో పాల్గొనకుండానే వెనుతిరిగారు. ఈ ఏడాది జనవరి మూడో వారంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నెల 13న నల్లగొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా చర్లపల్లి వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో ట్రాఫిక్ హోంగార్డు మృతి చెందాడు. ఈ రెండు ఘటనల నుంచి తేరుకోకముందే లాస్య నందిత ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రి, కూతురు మృతి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న గతేడాది ఫిబ్రవరి 19న అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో మరణించారు. ఇటీవలే సాయన్న ప్రథమ వర్ధంతిని నిర్వహించగా అది జరిగిన నాలుగు రోజులకే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మెజారిటీ కంటోన్మెంట్ వాసులు సైతం సాయన్నను తమ కుటుంబ సభ్యుడిగానే భావించేవారు. సాయన్న మరణానంతరం సైతం ఆయన కుమార్తె లాస్యను 17వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండున్నర నెలల్లోనే లాస్య మృతి చెందడంపట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. -
ఎమ్మెల్యే సాయన్న మృతి.. కేసీఆర్, కిషన్‌రెడ్డి సహా పలువురి సంతాపం
సాక్షి, హైదరాబాద్: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా, పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. - సాయన్న మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను.. తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. - మంత్రి కేటీఆర్ కూడా సాయన్న మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణం చాలా బాదాకరమని అన్నారు. ఈ సందర్బంగా సాయన్న కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. - మంత్రి తలసాని కూడా సాయన్న మృతికి సంతాపం తెలిపారు. - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయన్న మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సాయన్న అందరితోనూ సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సాయన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్యెల్యే జి సాయన్న కన్నుమూత
-
విషాదం: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బి. సాయన్న(72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న ఆదివారం తుదిశ్వాస విడిచారు. వివరాల ప్రకారం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం చెందారు. ఆదివారం ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయన్న కన్నుమూశారు. కాగా, సాయన్న గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక, సాయన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న.. 1951 మార్చి 5వ తేదీన చిక్కడపల్లిలో జన్మించారు. సాయన్నకు భార్య, ముగ్గుకు కుమారులు, కూతురు ఉన్నారు. -
కంటోన్మెంట్‌పై బాబు కన్ను
హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ కసరత్తు చేస్తోంది. అందులోభాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం టీటీడీపీ నేతలతో హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో టీటీడీపీ కీలక నేతలు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్నతోపాటు ఆ ప్రాంతానికి చెందిన నేతలు కూడా హాజరుకానున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టవలసిన కార్యచరణపై బాబు, టీటీడీపీ నేతలు ఈ సందర్భంగా చర్చిస్తారు. అయితే కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. 2015, జనవరి 11న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. కంటోన్మెంట్లో మొత్తం ఎనిమిది వార్డులకు చెందిన దాదాపు 2.30 లక్షల మంది ఓటర్లు.... ఎనిమిది మంది సభ్యులను ఎన్నుకుంటారు. కంటోన్మెంట్ చట్టం -1924 స్థానంలో కొత్తగా ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006 అమల్లోకి వచ్చింది. ఆ చట్ట ప్రకారం 2008లో మే 18 కంటోన్మెంట్‌కు ఎన్నికలు జరిగాయి. తద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తొలి పాలకమండలి ఏర్పాటైంది. ఆ పాలక మండలి గడువు 2013 జూన్ 5వ తేదీతో ముగిసింది. అయితే పాలక మండలి గడువును మరో రెండు సార్లు పొడిగించారు. 2014 జూన్ 5వ తేదీతో ఆ గడువు కూడా పూర్తి అయింది. అప్పటి నుంచి కంటోన్మెంట్ అధికారుల పాలన సాగుతోంది.