రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం  | BRS MLA Lasya Nanditha Dies In Car Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం 

Published Sat, Feb 24 2024 2:31 AM | Last Updated on Sat, Feb 24 2024 7:34 AM

BRS MLA Lasya Nanditha Dies In Car Accident - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్‌/కంటోన్మెంట్‌: దివంగత రాజకీయ నేత జి. సాయన్న కుమార్తె, బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి. లాస్య నందిత (37) శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రామేశ్వరం బండ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ గుర్తుతెలియని భారీ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొని ఆపై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

కారు ముందు సీట్లో కూర్చున్న నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం నడిపిన ఆమె పీఏ ఆకాష్‌ కాళ్లు విరిగాయి. కారు గంటకు సుమారు 100 కి.మీ. వేగంతో వెళ్తుండటంతో ప్రమాద తీవ్రతకు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద వార్త తెలియగానే హైవే పాట్రోల్, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఎమ్మెల్యే లాస్య నందిత, డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా నందిత అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

బ్రేక్‌ఫాస్ట్‌ చేసేందుకు వెళుతున్న క్రమంలో.. 
ఎమ్మెల్యే లాస్య నందిత తన అక్క కూతురు స్కూల్‌లో చేరుతుండటంతో రెండు వాహనాల్లో కుటుంబ సభ్యులతో కలసి రెండు వాహనాల్లో గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు సమీపంలోని సూఫీ మిస్కిన్‌ దర్గాను దర్శించుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఇతర కుటుంబ సభ్యులను వారి నివాసాల్లో దింపిన అనంతరం ఆకలి వేస్తుండటంతో బ్రేక్‌ఫాస్ట్‌ చేసేందుకు శామీర్‌పేట వైపు నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు ప్రకటించారు. డ్రైవర్‌ ఆకాష్‌ అకస్మాత్తుగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి ఆపై రైలింగ్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోందని... ఆ సమయంలో ఎమ్మెల్యే లాస్య సీటు బెల్టు పెట్టుకున్నట్లే ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, లాస్య నందిత కారు ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనాన్ని జహీరాబాద్‌ వద్ద పోలీసులు స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.  

అక్క పిలుస్తోంది.. వెళ్లొస్తానని చెప్పి.. 
ఎమ్మెల్యే లాస్య కారు నడిపిన ఆకాశ్‌కు ఆమె నుంచి ఫోన్‌ రావడంతో అక్క దగ్గరికి వెళ్తున్నానంటూ ఇంట్లో వాళ్లకు చెప్పి బయలుదేరినట్లు తెలిసింది. ఆకాశ్‌ తండ్రి శ్రీనివాస్‌ కంటోన్మెంట్‌లో దఫేదార్‌గా పనిచేసి రెండేళ్ల క్రితం బ్రెయిన్‌డెడ్‌కు గురై మరణించారు. మడ్‌ఫోర్ట్‌లో నివసించే ఆకాశ్‌ ఇటీవలే కానిస్టేబుల్‌ రాత పరీక్షల్లో ఉత్తీర్ణుడైనట్లు అతని సన్నిహితులు పేర్కొంటున్నారు. లాస్య నందిత చిన్నమ్మ కూతురు, కొడుకు పీయూష్‌ రాఘవ, ఆకాశ్‌ స్నేహితులు.

ఈ క్రమంలోనే పీయూష్‌ ద్వారా లాస్యకు ఆకాశ్‌ పరిచయం అయ్యాడు. ఇంటి మనిషిగా వ్యక్తిగత పనులపై వెళ్లినప్పుడు తరచూ ఆకాశ్‌తోనే ఆమె బయటకు వెళ్లేవారని తెలుస్తోంది. 10 రోజుల క్రితం నల్లగొండలో లాస్య కారు ప్రమాదానికి గురైన సమయంలో పీయూష్‌ ఆ వాహనాన్ని నడపగా శుక్రవారం నాటి ప్రమాదంలో ఆకాశ్‌ వాహనాన్ని నడపడం గమనార్హం. 

కేసు నమోదు 
ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాష్పై పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 304 కింద కేసు పెట్టారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపారని లాస్య సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాధు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పటాన్‌చెరు పోలీసులు తెలిపారు. 

సీఎం రేవంత్‌ సహా నేతల నివాళి... 
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత పారి్థవదేహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ ప్రసాద్‌రావు, ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్‌రావు సహా పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నేతలు నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని స్వగృహానికి ఆమె పారి్థవదేహాన్ని తరలించగా సీఎం, మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మరికొందరు నేతలు ఆమె నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఆమె అంతిమయాత్రలో పాడె మోశారు. శుక్రవారం సాయంత్రం ఈస్ట్‌ మారేడుపల్లిలోని హిందూ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు జరిగాయి. 

కుటుంబానికి అండగా ఉంటాం: కేసీఆర్‌ 
సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కష్టకాలంలో ఉన్న ఆమె కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇటీవల నల్లగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన లాస్య నందితను పరామర్శించి వారం కూడా కాకముందే ఆమె లేరనే విషాదకర వార్తను వినాల్సి వస్తుందని అనుకోలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. 

లాస్యను వెంటాడిన వరుస ప్రమాదాలు 
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితను రెండు నెలలుగా వరుస ప్రమాదాలు వెంటాడాయి. గతేడాది డిసెంబర్‌ 3న ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య అదే నెల 24న బోయిన్‌పల్లిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నూతన విభాగం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా వెళ్లారు. సెల్లార్‌ నుంచి మూడో అంతస్తుకు వెళ్లే క్రమంలో ఒకటో అంతస్తుకు రాగానే లిఫ్ట్‌ కూలిపోయింది. లిఫ్ట్‌ను బద్దలు కొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె ఆసుపత్రి ప్రారం¿ోత్సవంలో పాల్గొనకుండానే వెనుతిరిగారు. ఈ ఏడాది జనవరి మూడో వారంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నెల 13న నల్లగొండలో జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా చర్లపల్లి వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో ట్రాఫిక్‌ హోంగార్డు మృతి చెందాడు. ఈ రెండు ఘటనల నుంచి తేరుకోకముందే లాస్య నందిత ఔటర్‌ రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 

ఏడాది వ్యవధిలోనే తండ్రి, కూతురు మృతి 
కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే సాయన్న గతేడాది ఫిబ్రవరి 19న అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో మరణించారు. ఇటీవలే సాయన్న ప్రథమ వర్ధంతిని నిర్వహించగా అది జరిగిన నాలుగు రోజులకే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మెజారిటీ కంటోన్మెంట్‌ వాసులు సైతం సాయన్నను తమ కుటుంబ సభ్యుడిగానే భావించేవారు. సాయన్న మరణానంతరం సైతం ఆయన కుమార్తె లాస్యను 17వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండున్నర నెలల్లోనే లాస్య మృతి చెందడంపట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement