స్వగ్రామానికి చేరిన అశ్విని మృతదేహం
ఆమె తండ్రి మోతీలాల్ మృతదేహం 24గంటల తర్వాత గుర్తింపు
గంగారం తండాలో వందలాది మంది అశృనయనాల నడుమ అంత్యక్రియలు
కారేపల్లి: ఆకేరు వాగు ఉధృతికి బలైన యువ శాస్త్ర వేత్త డాక్టర్ అశ్విని మృతదేహానికి మహబూబాబాద్ లో పోస్ట్‌మార్టం అనంతరం ఆదివారం రాత్రి స్వగ్రామమైన కారేపల్లి మండలం గంగారంతండాకు తీసుకొచ్చారు. ఇక సోమవారం మళ్లీ తనిఖీలు చేపట్టిన రెసూ్య్కటీం సభ్యులు ఆమె తండ్రి మోతీలాల్ మృతదేహాన్ని డోర్నకల్ మండలం చిలక్కొయలపాడు వద్ద గుర్తించారు. ఆపై పోస్టుమార్టం చేయించి స్వగ్రామానికి తీసుకురాగా అప్పటికే బంధువులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. గంటల తరబడి కన్నీళ్లతో ఎదురుచూసుకున్న వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా అందరూ కంటతడి పెట్టారు.
కన్నీటి సంద్రమైన గంగారంతండా
గంగారం తండాకు చెందిన మోతీలాల్ – నేజీకి అశ్విని, అశోక్‌కుమార్ సంతానం. పదో తరగతి కారేపల్లిలో చదివి 550 మార్కులతో మండల టాపర్‌గా నిలిచిన అశ్విని విజయవాడలో ఇంటర్, అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసింది. బీఎస్సీలో మూడు రజత పతకాలు, యూనివర్సిటీ స్థాయిలో ఆరు బంగారు పతకాలే కాక ఆపై ఎమ్మెస్సీలోనూ బంగారు పతకం సాధించింది.
ఆతర్వాత జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందింది. ఇక జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి(అగ్రికల్చర్ శాస్త్రవేత్తల రిక్రూట్‌మెంట్ బోర్డు) నిర్వహించిన పరీక్షలో వందల మంది పోటీ పడగా అశ్విని జాతీయ స్థాయిలోనూ ప్రథమ స్థానం సాధించి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అశ్విని ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తోంది. గతనెల 29న సోదరుడు అశోక్ నిశ్చితార్థానికి హాజరైన ఆమె ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో విమానం ఎక్కాల్సి ఉంది.
దీంతో తండ్రి మోతీలాల్ కారులో తీసుకెళ్తుండగా మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరులో గల్లంతైన విషయం విదితమే. ఇందులో అశ్విని మృతదేహం ఆదివారం మధ్యాహ్నం, మోతీలాల్ మృతదేహం సోమవారం లభించగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. అప్పటికే చేరుకున్న స్థానికులు ఉజ్వల భవిష్యత్ ఉన్న శాస్త్రవేత్త అశ్వినిని ఆకేరు వాగు మింగిందా అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరి మృతదేహాలను ట్రాక్టర్‌పై ఊరేగింపుగా గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈక్రమంలో అశ్విని తల్లి నేజీ, సోదరుడు అశోక్‌కుమార్ రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు.
వైరా ఎమ్మెల్యేకు నిరసన సెగ
వాగులో గల్లంతై మృతదేహాలు లభించక తాము నరకయాతన పడినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మోతీలాల్ కుటుంబీకులు ఆరోపించారు. కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌ను వారు నిలదీశారు. అయితే, ఆకేరులో కారు గల్లంతైనప్పటికీ అక్కడి కలెక్టర్ సహా అధికారులతో తాను మాట్లాడానని, వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ రాకపోవడంతో వారిని కాపాడలేకపోయామని సర్దిచెప్పారు. ఆ కుటుంబానికి తక్షణ సాయంగా కింద రూ.50వేలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment