సాక్షి, హైదరాబాద్: కార్గో సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. కార్గో సేవల బుకింగ్ కోసం వారం, పదిరోజుల్లో మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారులు ఇక ఇంటి వద్ద నుంచే కార్గో సేవలను పొందవచ్చు.
ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజసంస్థలు అందజేస్తున్న తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో కార్గో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చి సేవలను విస్తృతపరచనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో వినియోగదారులు తమ పార్శిళ్ల కోసం బస్‌స్టేషన్లకు, ఆర్టీసీ పార్శిల్ కేంద్రాలకు పరుగెత్తాల్సిన పరిస్థితి ఇక ఉండదు. బుకింగ్‌ల కోసం కూడా బస్‌స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడదు.
యాప్‌తో మరింత చేరువ
ఇప్పటివరకు 15 లక్షలకుపైగా పార్శిళ్లను ఆర్టీసీ కార్గో సేవల ద్వారా తరలించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచి 60 శాతానికిపైగా పార్సిళ్లు్ల తెలంగాణ జిల్లాలకు, ఏపీలోని వివి ధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఇప్పటికీ వినియోగదారులే తాము పంపించాల్సిన వస్తువులను సమీప బస్‌స్టేషన్ల వరకు తీసు కొస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు కొంతమేర భారంగానే ఉంది. దీంతో వినియోగదారులు ఇంటి నుంచి బస్‌స్టేషన్ల వరకు వెళ్లడాన్ని అదనపు ఖర్చుగా భావిస్తున్నారు.
‘‘ఈ ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ కార్గోకు, వినియోగదారులకు మధ్య మరో సంస్థను అందుబాటులోకి తేవాలనుకుంటున్నాం. ఈ సంస్థ వినియోగదారుల నుంచి సేకరించిన వస్తువులను ఆర్టీసీ కార్గోకు అందజేస్తుంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కార్గోకు వచ్చిన వస్తువులను తిరిగి వినియోగదారుల ఇళ్ల వద్ద అందజేస్తుంది’’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 150 బస్సుల ద్వారా కార్గో సేవలను అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment