భాస్కర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వండి..సీబీఐ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటిషన్‌ | Cbi Officials Arrested Ys Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

భాస్కర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వండి..సీబీఐ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటిషన్‌

Published Mon, Apr 17 2023 4:37 AM | Last Updated on Mon, Apr 17 2023 5:54 AM

Cbi Officials Arrested Ys Bhaskar Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన భాస్కర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో పాటు ఉదయ్‌కుమార్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సోమవా రం సీబీఐ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా, 2019 మార్చి 15న వివేకానందరెడ్డి మృతదేహం రక్తపు మడుగులో బాత్రూమ్‌లో లభ్యమైందని, ఈ హత్య వెనుక భారీ కుట్ర ఉందని సీబీఐ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఇంకా ఏం చెప్పిందంటే..

వివేకాతో వారికి పలు విభేదాలు
‘వివేకానందరెడ్డితో భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి పలు విభేదాలు ఉన్నాయి. 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకా ఓడిపోయారు. ఈ ఓటమికి పై ఇద్దరే కారణమని వివేకా తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. హత్య చేసిన వారు కూడా భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి సహా పలువురు కీలక వ్యక్తులు ఉన్నారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. హంతకులకు రూ.40 కోట్లు ఇస్తానని శివశంకర్‌రెడ్డి హామీ ఇచ్చాడని దస్తగిరి చెప్పాడు.

హత్య చేసే ప్రక్రియలో ఏ–1, ఏ–2, ఏ–3, ఏ–4 లను వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న చూశాడు. ఆ రోజు రాత్రి సుమారు 1.58 గంటల సమయంలో సునీల్‌యాదవ్‌ భాస్కర్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్నట్లు అతని మొబైల్‌ లొకేషన్‌ చూపించింది. ఇది విచారణలో తేలింది. భాస్కర్‌రెడ్డి ఇతరులతో మాట్లాడినట్లు.. వారు అంతా చూసుకుంటారని హత్య తర్వాత ఎర్ర గంగిరెడ్డి.. ఇతర నిందితులకు చెప్పాడు.

 అ తర్వాత వివేకా గుండెపోటుతో చనిపోయారని.. భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ కథ అల్లారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు.  అవినాశ్‌రెడ్డి.. అతని పీఏ రాఘవరెడ్డి ఫోన్‌ నుంచి  సీఐ శంకరయ్యకు కాల్‌ చేశారు. వివేకా మృతి చెందారని చూసిన తర్వాతే అవినాశ్‌ ఫోన్‌ చేసినట్లు ఇదే ఆధారం. సాధారణ మరణం అని చెప్పడం కోసమే ఇదంతా చేశారు. ఆ తర్వాత రక్తపు మరకలను తుడిచి వేశాక మృతదేహాన్ని బెడ్‌రూంలోకి మార్చారు. ఈ హత్యలో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. మా విచారణలోనూ భాస్కర్‌రెడ్డి సహకరించలేదు. అందువల్ల కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నాం’ అని సీబీఐ కోరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement