దేశంలో పెరుగుతున్న వైద్యుల సంఖ్య.. ప్రతి 834 మందికి ఒకరు | Central govt Report Revealed The Number Of Doctors In India Is increasing | Sakshi
Sakshi News home page

దేశంలో పెరుగుతున్న వైద్యుల సంఖ్య.. ప్రతి 834 మందికి ఒకరు

Published Tue, Nov 22 2022 3:49 AM | Last Updated on Tue, Nov 22 2022 8:27 AM

Central govt Report Revealed The Number Of Doctors In India Is increasing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో డాక్టర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎనిమిదేళ్లతో పోలిస్తే ఇప్పుడు వైద్యులు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మెడికల్‌ కాలేజీలు, వాటిల్లో సీట్లు, దీంతో వైద్య సేవల మెరుగుదలపై కేంద్రం సోమవారం ఒక నివేదిక విడుదల చేసింది. 2014లో 1,008 మంది జనాభాకు ఒక డాక్టర్‌ ఉండగా, ఇప్పుడు 834 మందికి ఒక డాక్టర్‌ ఉన్నట్లు తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 13.01 లక్షల మంది నమోదిత అల్లోపతి వైద్యులు, 5.65 లక్షల ఆయుష్‌ వైద్యులు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ప్రాక్టీస్‌ చేస్తున్నవారు మొత్తంగా 15.80 లక్షల మంది ఉన్నారు. ఇక 2014లో దేశంలో 387 మాత్రమే మెడికల్‌ కాలేజీలుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 648కి చేరింది. వాటిలో 355 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, 293 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. గత ఎనిమిదేళ్లలో కొత్తగా 261 మెడికల్‌ కాలేజీలు వచ్చి చేరాయి. ఇప్పటివరకు మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సామర్థ్యం 96,077 కాగా, పీజీ మెడికల్‌ సీట్లు 63,842కు చేరాయి.  

ప్రత్యేక విభాగంగా కుటుంబ వైద్యం  
కుటుంబ వైద్యాన్ని ఒక ప్రత్యేక విభాగంగా సిద్ధం చేయాలి. ఈ విభాగంలో స్పెషలైజేషన్‌ను అందించే ఎండీ, డిప్లొమా కోర్సులు రెండూ ఉన్నాయి. ఫ్యామిలీ మెడిసిన్‌లో పోస్ట్‌–గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ మెడిసిన్, సర్జరీ, ప్రసూతి, గైనకాలజీకి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న స్పెషలిస్ట్‌ ఫ్యామిలీ ఫిజిషియన్లను అందుబాటులోకి తెస్తారు. 

గ్రామాల్లో అందుబాటులో వైద్యులు 
వైద్య విద్యలో జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సంస్థాగత సంస్కరణలు ప్రారంభించినట్లు కేంద్రం పేర్కొంది. కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పడానికి వీలుగా ఎన్‌ఎంసీ అనేక నిబంధనలను సులభతరం చేసింది. ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తితో సహా కనీస అవసరాల హేతుబద్ధీకరణ, పీజీ సీట్ల సంఖ్య పెంపు, ఇతర అంశాలకు సంబంధించిన నిబంధనల్లో సవరణలు చేసింది. చిన్న నగరాలు, పట్టణాలకు వైద్య విద్యను తీసుకెళ్లడం వల్ల గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో వైద్యులను అందుబాటులో ఉంచడానికి వీలు కలిగింది. 

ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులకు ఎగ్జిట్‌ టెస్ట్‌
‘నీట్‌’తో ఒకే దేశం.. ఒకే పరీక్ష.. ఒకే ప్రతిభ వ్యవస్థ ఏర్పడింది. ఒకేసారి వైద్య సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించడానికి వీలు కుదిరింది. మరోవైపు ఎంబీబీఎస్‌ పాసైన విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఇది ప్రాక్టీస్‌ కోసం లైసెన్స్‌గా కూడా ఉపయోగపడుతుంది.

స్పెషాలిటీ మెడికల్‌ కోర్సుల్లో, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదే పరీక్ష విదేశీ మెడికల్‌ గ్రాడ్యుయేట్లకు స్క్రీనింగ్‌ పరీక్షగా ఉపయోగపడుతుంది. దీన్ని త్వరలో అమలు చేయడానికి ఎన్‌ఎంసీ సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వైద్యులు – జనాభా నిష్పత్తిని ఇంకా మెరుగుపరిచేందుకు కృషి చేయాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. 

కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్లను అందుబాటులోకి తెస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు డాక్టర్లను సన్నద్ధం చేస్తారు.  జిల్లా రెసిడెన్సీ పథకం కింద జిల్లా ఆసుపత్రుల్లో పీజీ మెడికల్‌ విద్యార్థులకు మూడు నెలలు శిక్షణ ఇస్తారు. దీనివల్ల ప్రతి జిల్లా ఆసుపత్రిలో అదనంగా 4 నుంచి 8 మంది జూనియర్‌ రెసిడెంట్లు ఉంటారు. 

పేదలకు అందుబాటులో వైద్య విద్య  
పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండేలా సంస్కరణలు చేపట్టారు. ప్రైవేట్‌  మెడికల్‌ కాలేజీలు, డీమ్డ్‌ వర్సిటీల్లోని 50 శాతం సీట్ల ఫీజులను నియంత్రించేలా నిబంధనను అమలు చేస్తున్నారు.  

స్కిల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. ప్రత్యక్షంగా రోగులపై నేర్చుకునే పద్ధతులను తగ్గిస్తారు. బొమ్మలు, కంప్యూటరైజ్డ్‌ సిమ్యులేషన్‌ ద్వారా నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు.  

2022–23 వైద్య విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగాన్ని తప్పక ఏర్పాటు చేయాలి. క్యాజువాలిటీ ఏరియా, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్, ఆపరేషన్‌ థియేటర్‌తో పాటు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఉండాలి.   

విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోవడానికి, ఇంగ్లిష్‌ అలవాటు చేసుకోవడానికి నెల రోజుల ఫౌండేషన్‌ కోర్సు ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement