చిక్కడపల్లి: నగరంలో శిథిలస్థితికి చేరిన గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె.ప్రసన్నరామ్మూర్తి, కార్యదర్శి పి.పద్మజ పేర్కొన్నారు. ఆరు నెలలకు ఓ సారి నిర్వహించే కేంద్ర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్న, పద్మజ మాట్లాడుతూ..
నగరంలో గ్రంథాలయాలను పాఠకుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు పాఠకుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నూతన పుస్తకాల కొనుగోలు, సిబ్బంది జీత భత్యాలు, పెన్షన్‌తో పాటు నగరంలోని 82 గ్రంథాలయాలను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని, ఇకపై ప్రతి నెలా ఇచ్చే అంశంపై చర్చించినట్లు తెలిసింది.
వచ్చే ఏడాది గ్రంథాలయాల అభివృద్ధి, జీత భత్యాలు తదితర వాటికి దాదాపు రూ.2కోట్ల పైచిలుకు నిధులకు ప్రతిపాదన చేసినట్లు సమాచారం. సమావేశంలో సభ్యులు వాసుదేవ్‌రావు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment