బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
పారా బాయిల్డ్ బియ్యంపై ఎగుమతుల సుంకం 10 శాతానికి తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేతతో సన్నబియ్యం ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి. ప్రస్తుతం అధికంగా వినియోగించే సన్న బియ్యం రకాలైన సోనా మసూరి, హెచ్‌ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ రకాలు, తెలంగాణ సోనా వంటి మేలిమి బియ్యం ధరలు ఏకంగా కిలో రూ. 60 నుంచి రూ. 70కి చేరుకున్నాయి. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ, కనీస ఎగుమతి ధరను విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) శుక్రవారమే నోటిఫికేషన్ విడుదల చేసింది.
పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌పై ఎగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే సన్నరకాలు భారీ ఎత్తున విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశముంది. అమెరికాతో పాటు బంగ్లాదేశ్, యూరోప్ వంటి 140 దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు పెరుగుతాయి. ఈ ప్రభావం దేశీయ బియ్యం మార్కెట్‌పై పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
గత ఏడాది జూలైలో బియ్యంపై సర్కార్ ఆంక్షలు
2022–23లో ధాన్యం ఉత్పత్తి కొంత తగ్గింది. అదే సమయంలో విదేశాల్లో బియ్యం డిమాండ్ పెరిగి, దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరిగే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గత సంవత్సరం జూలైలో బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌లపై ఎగుమతి సుంకాన్ని 20 శాతం విధించింది. భారత్ నుంచి బియ్యం ఎగుమతి ఆగిపోవడంతో థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్తాన్‌ల నుంచి ఎగుమతులు పెరిగాయి. అయితే భారత్‌లో ఉత్పత్తి అయిన బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా దేశీయ బియ్యం ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment