అదీ రద్దీ ఉండని సమయాల్లోనే నిర్వహణకు అనుమతి
కొత్త ఓటర్లు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8.58 లక్షల ఓట్లు తొలగింపు
పాతబస్తీలో బోగస్ ఓట్లపై విచారణ.. త్వరలో నివేదిక
లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే రోడ్‌షోలకు సెలవు రోజుల్లో, ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే వేళల్లో నిర్వహించేందుకు మాత్రమే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో రోడ్‌షోలపై నిషేధం లేకున్నా, ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో అనుమతి ఇవ్వబోమన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్ సెంటర్లు, బ్లడ్‌బ్యాంకులున్న ప్రాంతాల్లో కూడా రోడ్‌షోలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. సోమవారం తన కార్యాలయంలో
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను వికాస్‌రాజ్ మీడియాకు వివరించారు.
రెండున్నరేళ్లలో 30 లక్షల ఓట్లు తొలగింపు
గత డిసెంబర్‌లో రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో 12 లక్షల కొత్త ఓటర్లు నమోదవగా.. 8,58,491 ఓటర్లను తొలగించినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 30లక్షల ఓట్లను తొలగించామన్నారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో బోగస్ ఓట్లున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి విచారణ నిర్వహించారని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోగస్ ఓట్ల తొలగింపు నిరంతర ప్రక్రియగా జరుగుతోందన్నారు.
ఏప్రిల్ 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
కొత్త ఓటరుగా నమోదు కోసం ఏప్రిల్ 15లోగా ఫారం–6 దరఖాస్తు చేసుకున్న వారందరికీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసే సదుపాయం కల్పిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాకే ఓటర్ల చిరునామా మార్పు(ఫారం–8), తప్పుల దిద్దుబాటు(ఫారం–7) దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈసారి 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచి ఓటేసే సదుపాయం కల్పిస్తామన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండే నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు, కుర్చీలు వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు.
లెక్కలు చూపకుంటే స్వాధీనం..
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సరైన లెక్కలు లేకుండా రూ.50వేలకు మించిన నగదు తీసుకెళ్లరాదని వికాస్‌రాజ్ సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిననాటి నుంచి ఇప్పటివరకు రూ.243 కోట్లు విలువైన నగదు/సరుకులను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. మార్చి 1 నుంచి ఆదివారం వరకు రూ.21.63 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఇటీవల నామినేటెడ్ పదవుల్లో నియామకమైన చైర్‌పర్సన్లు పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చా? అనే అంశంపై నిబంధనలను పరిశీలించాక తెలియజేస్తామన్నారు. ఈ–పేపర్లకు ఇచ్చే ప్రకటనలకు సైతం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సర్టిఫికేషన్ పొందాలని సూచించారు. ఈ సందర్భంగా పలు గణాంకాలను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment