సాక్షి, సిటీబ్యూరో: ‘సాధారణంగా నేరం జరిగిన సమయం నుంచే పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తుంటారు. కానీ, ఎల్బీనగర్ సీసీఎస్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ టీ రవి కుమార్ అలా చేయలేదు. చోరీ తర్వాత నంబర్ ప్లేట్ లేని బైక్‌పై పారిపోతుండగా కెమెరాల్లో రికార్డయిన నిందితుడు వేసుకున్న వైట్ కలర్ షర్ట్ ఆధారంతో కేసుకు మూలమైన సికింద్రాబాద్ పీఓటీ మార్కెట్‌లోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఓ బైక్ రైడర్ అదే వైట్ షర్ట్‌తో చోరీ కంటే కొన్ని గంటల ముందు మార్కెట్‌లో రెక్కీ చేసినట్లు గుర్తించారు.
అయితే ఆ ఫుటేజీలో బైక్ నంబరు అస్పష్టంగా ఉండటంతో.. ఇన్‌స్పెక్టర్ మిగిలిన నంబర్లను కలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి ఓ బైక్‌పై మెదక్‌లోని రామాయంపేటలో ఈ–చలాన్ జనరేట్ అయినట్లు గుర్తించారు. చలాన్‌లోని ఫొటోలను గమనించగా.. అందులో బైక్ రైడర్, చోరీలో పాల్గొన్న నిందితుడు ధరించిన వైట్ షర్ట్ ఒక్కటేనని తేలిపోయింది. ఇక ఇక్కడి నుంచి దర్యాప్తును ప్రారంభించిన రాచకొండ పోలీసులు చైతన్యపురి ఠాణా పరిధిలోని మహాదేవ్ జ్యువెల్లరీలో దోపిడీ, కాల్పుల కేసు పోలీసులు చేధించారు.’
వివరాలు వెల్లడిండిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్..
- రాజస్థాన్‌లోని పాలి జిల్లాకు చెందిన మహేందర్ చౌదరి గజ్వేల్‌లో జయలక్ష్మి పేరిట జ్యువెల్లరీ షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో ఈయన ఫిర్యాదుదారుడు రాజ్‌కుమార్ సురానా తమ్ముడి బంగారం షాపులో పనిచేశాడు. ప్రతి గురువారం పీఓటీ మార్కెట్ నుంచి నగరంలోని వేర్వేరు జ్యువెల్లరీ షాపులకు ఆభరణాలు డెలివరీ అవుతాయన్న విషయం మహేందర్‌కు తెలుసు. తన షాపు పెద్దగా నడవకపోవటంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. భార్య గుడియా, బావ సిద్దిపేటలోని గౌరారంలో బంగారం షాపు ఉద్యోగి సుమేర్ చౌదరిలతో కలిసి పథకం వేశారు. రాజస్థాన్ నుంచి వలస వచ్చి రామాయంపేటలో బట్టల దుకాణం నిర్వహిస్తున్న భన్సీ రామ్ అలియాస్ మనీష్ దేవాసి, గజ్వేల్‌కు చెందిన మహ్మద్ ఫిరోజ్, కొండపాకకు చెందిన మనీష్ వైష్ణవ్, పాలకుర్తికి చెందిన రితేష్ వైష్ణవ్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రితేష్ తనకు పాత పరిచయస్తులైన హర్యానా, ఢిల్లీలకు చెందిన ప్రొఫెషనల్ నిందితులు సుమిత్ డాగర్, మనీష్, మానియాలను రంగంలోకి దింపారు. వీరికి తుపాకులు, డాగర్‌లను సమకూర్చాడు.
- ఈనెల 1న భన్సీ రామ్, మానియా, సుమిత్, మనీష్ రామాయంపేట నుంచి సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. గణపతి జ్యువెల్లర్స్ యజమాని రాజ్ కుమార్ సురానా, షాపులో ఉద్యోగి సుఖ్‌దేవ్‌ల కదలికలను గమనిస్తూ వారిని వెంబడించారు. రాత్రి 8 గంటల సమయంలో ఇరువురూ స్నేహపురి కాలనీలోని మహాదేవ్ జ్యువెల్లర్స్‌కు చేరుకున్నారు. సుమిత్, మనీష్ షాపులోకి చొరబడగా మానియా బయటి నుంచి షాపు షట్టర్‌ను మూసేశాడు. పక్కన సందులో భన్సీ రామ్ హోండా బైక్ మీద సిద్ధంగా ఉన్నాడు. షాపులో ఉన్న ఇద్దరు దుండగులు కల్యాణ్ చౌదరి, సుఖ్‌దేవ్‌లపై కాల్పులు జరిపి.. బంగారం బ్యాగుతో ఉడాయించి, బైక్‌లపై ఉప్పల్‌కు చేరుకున్నారు. హబ్సిగూడలో పల్సర్ బైక్‌ను వదిలేశారు. సుమిత్‌నూ ఇక్కడే వదిలేసి భన్సీరామ్ రామాయంపేటకు వెళ్లిపోయాడు.
- అప్పటికే గజ్వేల్ నుంచి కారులో ఉప్పల్‌కు వచి్చన ప్రధాన నిందితుడు మహేందర్, ఫిరోజ్ సుమిత్‌ను ఎక్కించుకుని పాలకుర్తిలోని రితేష్ వైష్ణవ్ ఇంటికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి హబ్సిగూడ వద్ద మనిష్, మానియాలు వదిలేసిన పల్సర్ బైక్‌ను సుమేర్ చౌదరి తీసుకొని, గుడియా జాత్‌తో కలిసి కొండపాకలోని మనీష్ వైష్ణవ్ ఇంటికి వెళ్లి బైక్, మారణాయుధాలను భద్రపరిచి, గౌరారంకు పరారయ్యారు. అనంతరం సుమేర్ కారు అద్దెకు తీసుకొని పాలకుర్తిలో ఉన్న మహేందర్, సుమిత్, మనీష్, మానియాలను తీసుకొని గజ్వేల్‌కు వెళ్లిపోయారు. రూ.4 లక్షల నగదు ఇచ్చి సుమిత్ నుంచి బంగారం బ్యాగు, తుపాకులను స్వా«దీనం చేసుకున్న మహేందర్ వీటిని గుడియా, సుమేర్‌లకు అందించగా.. వారు సొత్తుతో కొండపాకకు పారిపోయారు.
- మహిళ కారులో ఉంటే పోలీసుల తనిఖీ నుంచి తప్పించుకోవచ్చని పథకం వేసిన ప్రధాన నిందితుడు మహేందర్, తన భార్య గుడియా, సుమిత్, మనీ‹Ù, మానియాలతో కలిసి రాష్ట్రం దాటేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పోలీసులు గాలిస్తుండటంతో నిర్మల్‌లో గుడియాను వదిలేసి.. మహారాష్ట్రకు బయలుదేరారు. ఆమె తిరిగి బస్‌లో గజ్వేల్‌కు చేరుకుంది. అప్పటికే ఆధారాలను సమీకరించిన పోలీసులు.. గజ్వేల్‌లో గుడియా, సమీర్, ఫిరోజ్‌లను అరెస్టు చేశారు. రామాయంపేటలో భన్సీ రామ్, కొండపాకలో మనీష్ వైష్ణవ్, పాలకుర్తిలో రితేష్ వైష్ణవ్‌లను పట్టుకున్నారు.
- నిందితుల నుంచి 2,701.8 గ్రాముల బంగారం, మూడు తుపాకులు, 7.65 ఎంఎం 25 లైవ్ బుల్లెట్లు, ఎయిర్ పిస్తోల్, డాగర్, నాలుగు ద్విచక్ర వాహనాలు, కారు, 6 సెల్‌ఫోన్లు, రూ.65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి మహేందర్, సుమిత్, మనీ‹Ù, మానియా పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment