సికింద్రాబాద్ టు విశాఖకు ఉదయం 5:05 గంటలకు రైలు ప్రారంభం
ఆటోలు, క్యాబ్‌లు దొరక్క ప్రయాణికుల ఇబ్బందులు
టైమింగ్స్ మార్చాలన్నా మూడోలైన్ పూర్తి కాక రూట్ ఖాళీ లేని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ‘సికింద్రాబాద్ – విశాఖ’ వందేభారత్ రైలు టైమింగ్ మార్చాలనే డిమాండ్ రైల్వే ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 5:05 గంటలకే బయలుదేరుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నగరానికి నలువైపులా ఉన్నవారు తెల్లవారుజామునే స్టేషన్‌కు చేరుకోవాలి. అయితే ఆ సమాయానికి క్యాబ్‌లు, ఆటోలు బుక్ కావడం లేదు. ఒకవేళ బుక్ అయినా ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో ఆ రైలు టైమింగ్ మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.
సికింద్రాబాద్–విశాఖ మధ్య ఈ నెల 12న రెండో వందేభారత్ రైలుకు ప్రారంభించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ రైలు ఉదయం 6 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి బయలు దేరాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో ఇతర రైళ్లు నడుస్తుండటంతో ఈ రైలును నడపలేని దుస్థితి నెలకొంది. మరో గంట తర్వాత కాస్త నిడివి ఉంది. కానీ, ఉదయం ఏడున్నరకు లింగంపల్లి–విశాఖ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.10కి సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది.
అది కూడా వందేభారత్ తరహాలో చైర్‌కార్ ఎక్స్‌ప్రెస్ రైలు. దీంతో విశాఖపట్నానికి రెండు చైర్‌కార్ ఎక్స్‌ప్రెస్‌లు ఒకేసారి బయలుదేరాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో వందేభారత్ రైలును ఉదయం 5.05 సమయాన్ని ఖరారు చేశారు.
అయితే ఆ సమయం ప్రయాణికులకు అసౌకర్యంగా మారింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఉదయం ఐదింటిలోపు చేరుకోవాలంటే, దూరప్రాంతాల నుంచి వచ్చే వారు ఉదయం నాలుగింటికల్లా ఇళ్లలో బయలుదేరాలి. ఆ సమయాల్లో ఆటోలు, క్యాబ్‌లు తక్కువగా ఉండటంతో వాటి బుకింగ్ ఇబ్బందిగా మారింది.
మూడోలైన్ పూర్తయితేనే...
విశాఖకు నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లు వరంగల్ మీదుగా తిరుగుతున్నాయి. ఆ మార్గంలో మూడో లైన్ అందుబాటులో లేదు. ఉన్న రెండు లైన్లమీదుగా వందల సంఖ్యలో రైళ్లు పరుగుపెడుతున్నాయి. ప్రయాణికుల రైళ్లు, సరుకు రవాణా రైళ్లు ఆ రెండు లైన్లమీదుగానే నడపాల్సి వస్తోంది.
ఈమార్గంలో మూడోలైన్ పనులు 2017 నుంచి న డుస్తున్నా..తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడోలైన్ పూర్తయి తే, మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలవుతుంది. ప్రయాణికుల కు అనువైన వేళల్లో నడిపేందుకూ అవకాశం కలుగుతుంది.
ఆ రూట్లో నడపలేక..
విశాఖపట్నం మొదటి వందేభారత్ రైలును వరంగల్ రూట్‌లో నడుపుతున్నందున, రెండో వందేభారత్‌ను నల్లగొండ–నడికుడి– గుంటూరు మార్గంలో తిప్పాలని తొలుత భావించారు. కానీ, ఆ మార్గం ప్రస్తుతం సింగిల్ లైన్‌తో ఉంది.
ఎదురుగా ఓ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వస్తే, మిగతా వాటిని ఆయా ప్రాంతాల్లోని స్టేషన్‌లలో నిలపాలి. ఈ మార్గంలో తిరుపతి వందేభారత్ రైలు నడుస్తోంది. ఆ సింగిల్‌లైన్‌ను దాటే సమయంలో చాలా రైళ్లు క్రాసింగ్ సమయంలో నిలిచిపోవాల్సి వస్తోంది. దీంతో ఆ రూట్‌లో ఇబ్బందులు ఉన్నాయని, వరంగల్‌రూట్‌కు మార్చారు.
అయినా వెయిటింగ్ జాబితానే..
విశాఖకు నడిచే మొదటి వందేభారత్ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. దానికి దాదాపు 114 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. కనీసం ఐదారు రోజుల వెయిటింగ్ లిస్టు ఉంటోంది. దీనికి ఆదరణ బాగుందనే రెండో వందేభారత్ రైలు ప్రారంభించారు. ఇది కూడా వందశాతం ఆక్యుపెన్సీ రేషియో దాటి నడుస్తోంది. నాలుగు రోజుల వెయిటింగ్ లిస్టు ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment