సదస్సులో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న జస్టిస్ రమణ. చిత్రంలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా తీవ్రత తగ్గడంతో న్యాయస్థానాలు ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. మీరు కూడా కరోనా భయం నుంచి బయటకు రండి. కోర్టు పనివేళలకన్నా అదనపు సమయాన్ని వెచ్చించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయండి. పెండింగ్ కేసుల పరిష్కారంలో మీ వంతు పాత్ర పోషించండి. వ్యవస్థలోని అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరచనిదే కార్యసిద్ధిపై హామీ ఇవ్వలేం. నిర్దేశిత లక్ష్యం, కేసుల సమర్థ నిర్వహణ ఈ విషయంలో ఎంతో వ్యత్యాసం చూపుతాయి. న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థే పునాది. పునాది బలంగా ఉంటేనే వ్యవస్థ వర్ధిల్లుతుంది.
ఈ విషయంలో మీరంతా న్యాయ వ్యవస్థ పతాకం ఎల్లప్పుడూ రెపరెపలాడేలా చూడండి. న్యాయవ్యవస్థ ఉన్నతిని నిలబెట్టేందుకు మీ వంతు కృషి చేయండి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ న్యాయాధికారులకు పిలుపునిచ్చారు. రెండు రోజుల రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు–2022ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్, తెలంగాణ, ఏపీ హైకోర్టు సీజేలు సతీష్‌చంద్ర శర్మ, ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానవీయ కోణాన్ని చూడండి...
సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ‘సమస్యలతో కోర్టుకు వచ్చే కక్షిదారుల్లో మైనర్లు, మహిళలు, బలహీన వర్గాలు, దివ్యాంగులకు ఉండే విభిన్న అవసరాలను గుర్తించి వారిని గౌరవించండి. మీ ఎదుట ఉండే సాక్ష్యాలను పరిశీలించే సమయంలో రాజ్యాంగ విలువలు పరిరక్షించే దిశగా స్వతంత్రంగా ఆలోచించండి. విధి నిర్వహణలో భయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా జడ్జీలపై పెరుగుతున్న భౌతికదాడులను నిరోధించేందుకు కోర్టు లోపలా, బయట భద్రత పెంచాలని మార్గదర్శకాలు జారీ చేశా. మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సమయాన్ని వెచ్చిస్తూ తీర్పులు ఇవ్వండి. జడ్జీల ఆర్థిక అంశాలను త్వరలో పే కమిషన్ దృష్టికి తీసుకెళ్లి శుభవార్త వినిపిస్తా’ అని తెలిపారు.
కోర్టుల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యత...
‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కోర్టుల పనితీరుపై తీవ్ర ప్రభా వం చూపుతున్న మౌలిక వసతులు, ఖాళీ పోస్టుల భర్తీని ప్రధానాంశాలుగా తీసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టాం. మౌలికవసతుల కల్పన, ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలంగాణలో ఎనిమిదేళ్లుగా కోర్టులకు కొత్త భవనాలు వస్తున్నా ఇంకా చాలా చోట్ల రావాల్సిన అవసరం ఉంది. పెండింగ్ కేసులను దృష్టిలో పెట్టుకొని హైకోర్టులో బెంచీల సంఖ్యను 24 నుంచి 42కు పెం చడంతోపాటు 17 కొత్త జడ్జీలను నియమించాం. గతంలో 12 పేర్లను జడ్జీలుగా ప్రతిపాదించగా పెండింగ్‌లో ఉన్న రెండు పేర్లను త్వరలో ఆమోదిం చేందుకు ప్రయత్నిస్తా’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఉమ్మడి ఏపీలో 2016లో ఈ తరహా సదస్సు జరిగిందని, న్యాయవ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సదస్సు ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరాలి’ అని సీజేఐ ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు...
సీఎం కేసీఆర్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ తన తెలుగు ప్రసంగంలో ప్రశంసలు కురిపించారు. ‘నాతోపాటు న్యాయవ్యవస్థకు కూడా మిత్రుడైన కేసీఆర్ గురించి పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు. చేతికి ఎముక లేదనే సామెతకు ఆయనే ట్రేడ్‌మార్క్. వివిధ రంగాల తరహాలోనే న్యాయవ్యవస్థ అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపనకు న్యాయవ్యవస్థ తరఫున కృతజ్ఞతలు. కేంద్రం, వివిధ రాష్ట్రాలు ఉద్యోగాలను తగ్గిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తున్న క్రమంలో కేసీఆర్ న్యాయవ్యవస్థలో 4,320 ఉద్యోగాలు సృష్టించారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కోసం స్థలం, నిధులు కేటాయించి భవనం నిర్మించారు. హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ విజయవంతమైతే ఇతర రాష్ట్రాలకు కూడా ఫ్రాంచైజీలు ఇస్తాం’ అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు.
వేదికపై ఉన్న వారికి వీణలను బహుమతిగా ఇచ్చిన సీఎం కేసీఆర్ తనకు మాత్రం నెమలి బొమ్మ ఇచ్చారంటే జాతీయ పక్షి అని ఇచ్చారేమోనని సీజేఐ చమత్కరించారు. తనకు నెమలి బొమ్మ ఇచ్చినా ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ హాస్యోక్తి విసిరారు. కాగా, యువ న్యాయ అధికారుల్లో క్రమశిక్షణా రాహిత్యం, సీనియర్ న్యాయమూర్తులను అవమానించడం సరికాదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. తీర్పులు వెలువరించడంలో సమయపాలన పాటించడం లేదని, బాధితులకు సరైన న్యాయం అందించేందుకు సమగ్ర మార్పులు అవసరమన్నారు. వికార్ మంజిల్‌లో నిర్మించే జడ్జీల అతిథిగృహం, సెంట్రల్ రికార్డు బ్లాక్ శిలాఫలకాలను జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. తెలంగాణ జడ్జీల అసోసియేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. యామినీరెడ్డి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి వి.రామసుబ్రమణ్యం, హైకోర్టు న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్, హైకోర్టు ఇతర జడ్జీలు, జిల్లాలు,
మెజిస్ట్రే్టట్ కోర్టుల జడ్జీలు పాల్గొన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి కోర్టుల్లో పనిభారం: సీఎం కేసీఆర్
గోవా, సిక్కిం వంటి రాష్ట్రాలను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తలసరి ఆదా యం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో అద్భుత పురోగతిలో ఉన్న తెలంగాణలో పాలనా సంస్కరణలతో 33 జిల్లాలు ఏర్పాటైనట్లు వెల్లడిం చారు. రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 24 నుంచి 42కు పెరిగిందని, న్యాయ విభాగంలో గతంలో 780 పోస్టులు మంజూరు చేయగా, తాజాగా 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మం జూరు చేసినట్లు చెప్పారు.
ధరణి ద్వారా భూములను డిజిటలైజేషన్ చేసి కోర్టులపై అపార నమ్మకంతో రెవెన్యూ కోర్టులు రద్దు చేశామన్నారు. న్యాయమూర్తుల హోదాకు తగ్గట్లుగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో 30 నుంచి 40 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహ సముదాయం నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమ శంకు స్థాపనకు రావాల్సిందిగా సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణను ఆహ్వా నించారు. పెట్టుబడుల ఆకర్షణలో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం పోటీ పెరిగిన నేపథ్యంలో తలెత్తే న్యాయ వివా దాలను న్యాయవ్యవస్థ వెంటనే పరిష్కరించా లని కోరుకుంటున్నానని, అలా జరిగితేనే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. 400 మంది హాజరైన న్యాయ అధికారుల సదస్సు న్యాయమూర్తులు తమ పనితనం మెరుగుపరుచుకునే వేదికగా ఉపయోగపడుతుందన్నారు.
ఒత్తిడిలో ఉండే కక్షిదారులకు ఊరటనివ్వడంతోపాటు వివాదాల్లో మానవీయ కోణాన్ని చూడండి. సమానత్వానికి న్యాయసూత్రాలు దూరం కావనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు మీ విచక్షణను ఉపయోగించే అవకాశం ఉన్న చోట న్యాయ వ్యవస్థలోని మానవీయ కోణాన్ని చాటిచెప్పండి.
– సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
హైదరాబాద్, రంగారెడ్డిలోని సిటీ సివిల్ కోర్టులు, జిల్లా కోర్టుల్లో పనిభారం పెరిగింది. కొత్తగా ఏర్పాటైన 22 జిల్లాల్లో కోర్టులు ప్రారంభించాలి. కొత్త కోర్టులకు అవసరమైన స్థలాలను ఎంపిక చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధులిస్తాం. కొత్తగా ప్రారంభమయ్యే జిల్లా కోర్టుల సిబ్బంది కోసం 1,730 అదనపు పోస్టులు మంజూరు చేస్తాం.
– ముఖ్యమంత్రి కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment