Hyderabad Floods: Hyderabad Citizens Suffering with Mud after Heavy Rains | వరద.. బురద.. తీరని వ్యథ! - Sakshi
Sakshi News home page

వరద.. బురద.. తీరని వ్యథ!

Published Mon, Oct 19 2020 9:31 AM | Last Updated on Mon, Oct 19 2020 1:20 PM

City People Suffering With Floods And Huge Mud In Hyderabad - Sakshi

నీట మునిగిన బండ్లగూడ అయ్యప్పకాలనీ, పాతబస్తీలోని బాబానగర్‌లో..

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముంపు నుంచి తేరుకునే లోపే..మళ్లీ వరదనీరు ముంచెత్తుతుండటంతో ఆయా బస్తీల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరదలతో సర్వం కోల్పోయిన వారిలో కొంత మంది తాత్కాలికంగా ఇళ్లను వదలి ఇతర ప్రాంతాలకు వలస పోగా..మరికొందరు గత్యంతరం లేక మోకాలిలోతు బురదలోనే ఉండిపోయారు. ఇన్నాళ్లు కష్టపడి కూడబెట్టుకున్న వస్తువులన్నీ కళ్లముందే వరదనీటిలో కొట్టుకుపోవడంతో తీవ్ర వేదన చెందుతున్నారు. సాయం అందక..ఏం చేయాలో దిక్కుతోచక నిరాశలో కూరుకుపోతున్నారు. చివరకు పరామర్శల పేరుతో కాలనీల  సందర్శనకు వస్తున్న ప్రజాప్రతినిధులపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం వనస్థలిపురం కార్పొరేటర్‌పై స్థానికులు దాడికి దిగడాన్ని పరిశీలిస్తే..సమస్య తీవ్రతను..ముంపు బాధితుల ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు.  

సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ బార్కాస్‌లోని గుర్రం చెరువు దిగువన ఉన్న అన్ని బస్తీలను వరద అతలాకుతలం చేసింది. భారీ ఎత్తున కట్ట తెగడంతో నీరు ఒక్కసారిగా దిగువకు వాయువేగంతో నదులను తలపిస్తూ ఉరుకులు పరుగులు పెట్టింది. నీటి ఉధృతికి రోడ్డుపై ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు సైతం నేలమట్టమయ్యాయి. మొదటగా హఫీజ్‌ బాబానగర్‌లోని బ్లాక్‌లను పూర్తిగా ముంచెత్తిన వరద ప్రధాన రహదారి మీదుగా నసీబ్‌నగర్,  నర్కీపూల్, సాయిబాబానగర్, శివాజీనగర్, రాజీవ్‌ గాంధీనగర్, అరుంధతి కాలనీ, కృష్ణారెడ్డినగర్, పార్వతీనగర్, సాదత్‌నగర్, క్రాంతినగర్, లలితాబాగ్, మారుతీనగర్, తానాజీనగర్, భయ్యాలాల్‌ నగర్, కాళికానగర్‌లను ముంచెత్తింది. కాగా హఫీజ్‌బాబానగర్‌లోని కొన్ని వీధులలో రెండంతస్తులలోకి నీరు చేరుకోగా...ఉప్పుగూడలో ఒక్క అంతస్తు మేర చేరుకున్నాయి. ఇప్పటికీ చాలా కాలనీలు అంధకారంలోనే మగ్గిపోయాయి.

కోదండరాం నగర్‌లో బాధితుల తరలింపు
ముంపులోనే వందలాది కాలనీలు 
ఎల్‌బీనగర్‌ పరిధి బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోని కప్రాయిచెరువులోకి గత మంగళవారం భారీగా వరదనీరు వచ్చి చేరింది. వారం రోజుల నుంచి హరిహరపురం కాలనీలోని 350 ఇళ్లు మురుగునీటిలోనే ఉండిపోయాయి. 400 కార్లు సహా రెండు వేలకుపైగా బైక్‌లు నీటమునిగాయి. ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్, సెల్లార్లలో నివసిస్తున్న వారు సర్వం కోల్పోవాల్సి వచ్చింది. చెరువులోని నీరు తగ్గకపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో వారు వారం రోజులుగా అంధకారంలోనే మగ్గుతున్నారు. కంటికి కునుకు లేదు. తాగేందుకు నీరు లేదు. ఇంట్లో పొయ్యి వెలిగించే పరిస్థితి కూడా లేకపోవడంతో చాలా మంది ఇప్పటికే ఇళ్లను వదిలి బంధువుల ఇళ్లకు చేరుకున్నారు. మరికొంత మంది ఇప్పటికీ ముంపులోనే ఉండిపోయారు. వరదనీరు తగ్గుతుందని భావించి ఊపిరి పీల్చుకుంటున్న లోపే..శనివారం మళ్లీ వరద ముంచెత్తడంతో వారు మరిన్ని కష్టాలకు గురయ్యారు. 
 మీర్‌పేటలోని మంత్రాల చెరువుకు వరద పోటెత్తడంతో చెరువు కట్టకింద ఉన్న మిథులానగర్‌లో వారం రోజుల నుంచి 100పైగా ఇళ్లు మురుగునీటిలోనే ఉండిపోయాయి. సాయినగర్‌ సహా మందమల్లమ్మ, గ్రీన్‌పార్క్‌ కాలనీ, లింగోజిగూడ కాలనీలు ముంపులో చిక్కుకుపోయాయి. వీధుల్లో మోకాలిలోతు వరద నీరు నిల్వ ఉండటం, నడవటానికి వీల్లేకుండా భారీగా బురద పేరుకుపోయింది.

బాలాపూర్‌లో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు
హస్తినాపురంలోని శ్రీ బాలాజీ కాలనీ ఇంకా ముంపులోనే ఉండిపోయింది. 50 ఇళ్లు నీటమునిగాయి. అయినా పట్టించుకున్న నాధుడే లేరు. ఇటు నుంచి వచ్చే నీరంతా రెడ్డికాలనీ మీదుగా బైరామల్‌గూడ, కాకతీయనగర్‌లను ముంచెత్తింది. బండ్లగూడ చెరువులోకి వరద నీరు భారీగా చేరడంతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో చెరువు కింద భాగంలో ఉన్న రాఘవేంద్రకాలనీ, గీతా కాలనీ, లేక్‌ హోమ్స్, వినయ్‌ అపార్ట్‌మెంట్‌ వాసులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే అయ్యప్పనగర్‌కాలనీ, అయ్యప్పకాలనీ గత 5 రోజలు నుండి వరద నీటిలో మునిగి ఉంది. మరో సారి వర్షం పడితే బండ్లగూడ చెరువు పైనుండి వరద వచ్చే ప్రమాదం ఉంది. 

హయత్‌నగర్‌లోని బాతుల చెరువు అలుగు ఉధృతితో కట్టమైసమ్మకాలనీ, యశోదనగర్, ఆర్టీసీ మజ్దూరీకాలనీ, అంబేద్కర్‌నగర్, రంగనాయకులగుట్ట, బంజారా కాలనీలు నీట మునిగాయి. పద్మావతికాలనీ, నాగోలు డివిజన్‌ పరిధిలోని మల్లికార్జున్‌నగర్, అయ్యప్పనగర్, శ్రీనివాస కాలనీ, వెంకటరమణ కాలనీ, బీకే రెడ్డినగర్‌ కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. బడంగ్‌పేట నుంచి వరదనీరు పెద్దచెరువుకు పోటెత్తడంతో అధికారులు లెనిన్‌నగర్‌ శ్మశాన వాటికలోనుంచి తాత్కాలికంగా కాలువను తవ్వారు. దీంతో వరద ఒక్కసారిగా జనప్రియ మహానగర్‌ను ముంచెత్తింది. సాయిబాలాజీ, నవయుగ కాలనీ, శివనారాయణపురం కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుని నేటికి వారం రోజులు కావస్తోంది. ప్రసిద్ధ కాశీబుగ్గ దేవాలయం సహా నాదర్‌గుల్‌లోని గ్రీన్‌ హోమ్స్‌ కాలనీ, శ్రీకృష్ణ ఎన్‌క్లేవ్‌ వరదనీటిలో మునిగి పోయింది. చాదర్‌ఘాట్, మూసానగర్, కమలానగర్, శంకర్‌నగర్, కాలనీలో శనివారం రాత్రి ఇండ్లలోకి నీరు ప్రవేశించి కాలనీ వాసులకు కునుకు లేకుండా చేసింది. చాదర్‌ఘాట్‌ లోయర్‌ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయి రాకపోకలు బంద్‌ అయ్యాయి. ఉప్పల్‌ చిలుకానగర్‌ నాలా ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఆదివారం కూడా రాకపోకలు సాగలేదు. స్వరూప్‌నగర్‌ నాలాది సైతం అదే పరిస్థితి. వరద దాటికి సౌత్‌ స్వరూప్‌నగర్, న్యూభరత్‌నగర్, శ్రీనగర్‌ కాలనీ, కావేరినగర్, కాలని, అమృత కాలనీ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.
      
అయినా తప్పదుగా... కోదండరాంనగర్‌లో ముంపునకు గురైన ఇంటి నుంచి ఆదివారం వివాహ నిశ్చితార్థం కోసం ఫంక్షన్‌ హాలుకు బయలుదేరిన కుటుంబ సభ్యులు, బంధువులు

పై చిత్రంలో కన్పిస్తున్న ఈయన పేరు మల్లికార్జున్‌. మీర్‌పేట పరిధిలోని మిథులానగర్‌లో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఉపాధి కోసం ఇంట్లోనే కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పైన ఉన్న మంత్రాలచెరువు ఉప్పొంగడంతో దానికింద ఉన్న మిథులానగర్‌కు వరదపోటెత్తింది. ఫలితంగా షాపులో ఉన్న సామాన్లు, ఇంటి ముందు పార్కింగ్‌ చేసిన కారు..స్కూటర్, ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. రూ.రెండున్నర లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. వరద తగ్గుముఖం పడుతుందని ఊపిరిపీల్చుకునే లోపే శనివారం రాత్రి మళ్లీ భారీగా వరద పోటెత్తింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement