people suffering
-
ధగ ధగ.. దగా!
సీహెచ్. వెంకటేశ్: రాత్రి వేళ వీధి దీపాల వెలుగులో మెరిసి పోవాల్సిన హైదరాబాద్ మహానగరంలో చాలాచోట్ల చీకటే రాజ్యమేలుతోంది. ఎక్కువ కాంతిని వెదజల్లడమే కాకుండా, విద్యుత్ చార్జీలు కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధిదీపాలు అనేక ప్రాంతాల్లో వెలగడం లేదు. రాత్రిళ్లు అన్ని లైట్లూ వెలుగుతాయని ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్), జీహెచ్ఎంసీ చెబుతున్నా ఆ మేరకు వెలగడం లేదని జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ డాష్బోర్డే స్పష్టం చేస్తోంది. అన్ని స్ట్రీట్ లైట్లూ సీసీఎంఎస్ (సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) బాక్స్‌లకు అనుసంధానమైనందున సర్వర్ నుంచి అందే అలర్ట్స్తో సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని, చీకటి పడ్డప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతూ, తెల్లారగానే ఆరిపోయేలా ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేస్తుందన్నది కూడా మాటలకే పరిమితమైంది.ఎల్ఈడీల ఏర్పాటుకు ముందు ఏటా దాదాపు రూ.150 కోట్ల విద్యుత్ చార్జీలు ఉండగా, వీటిని ఏర్పాటు చేశాక ఆ వ్యయం రూ.100 కోట్ల లోపే ఉంటోందని జీహెచ్ఎంసీ పేర్కొంటోంది. పొదుపు సంగతేమో కానీ.. కోటిమందికి పైగా ప్రజలు నివసిస్తున్న భాగ్యనగరంలోని రోడ్లపై అంధకారం నెల కొంటుండటంతో ప్రమాదాలు జరుగుతున్నా యని, దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులకు కూడా ఈ పరిస్థితి అనుకూలంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో?⇒ గత 4 రోజులుగా మా ఏరియాలో స్ట్రీట్‌లైట్లు వెలగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షం కురిసినప్పుడు డ్రైనేజీ మ్యాన్‌హోళ్లతో ఎప్పు డు, ఎక్కడ, ఏ ప్రమా దం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. అధికారులకు పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – కె.రాజశేఖరరెడ్డి, ఓల్డ్ మలక్పేటరాత్రివేళ రక్షణ కావాలి⇒ అడ్డగుట్ట వీధుల్లో దీపాలు వెలగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో లైట్ల చుట్టూ పెరిగిన చెట్ల కొమ్మల కారణంగా వెలు తురు రోడ్లపై పడటం లేదు. చెట్ల కొమ్మలు తొలగించాలని, వెలగని విద్యుత్ దీపాల కు మరమ్మతులు చేయాలని అధికారు లను కోరుతున్నా స్పందించడంలేదు. కొన్ని బస్తీ ల్లో పగటి వేళ కూడా లైట్లు వెలుగు తున్నాయి. ఇప్పటికైనా చెట్ల కొమ్మల్ని తొలగించి, మరమ్మ తులు చేసి రాత్రి వేళల్లో మాకు రక్షణ కల్పించాలి. – సంతోషమ్మ , అడ్డగుట్టగురువారం ఇదీ పరిస్థితి⇒ గురువారం (27వ తేదీ) అర్ధరాత్రి 1.20 గంటలు. ఆ సమయంలో జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ డాష్‌బోర్డు మేరకే నగరంలో 43.79 శాతం వీధిదీపాలు మాత్రమే వెలుగుతున్నాయి. అయితే అది కూడా తప్పే. సీసీఎంఎస్ బాక్సులకు కనెక్టయిన లైట్లలో 43.79 శాతం వెలుగుతున్నాయన్న మాట. వాస్తవానికి ఈ వివరాలు నమోదయ్యే డాష్ బోర్డు లింక్‌ను ఎవరికీ తెలియనివ్వరు. మొత్తం లైట్లలో 98 శాతం లైట్లు వెలిగితేనే వీటిని నిర్వహిస్తున్న ఈఈఎస్ఎల్కు చార్జీలు చెల్లించాలి. కానీ ఎవరికే లింకులున్నాయో కానీ చెల్లింపులు మాత్రం నిరాటంకంగా జరిగిపోతున్నాయి.ఇదీ లెక్క..మొత్తం స్ట్రీట్ లైట్స్ 5,10,413కనెక్టెడ్ 3,05,018లైట్స్ ఆఫ్ 1,71,455లైట్స్ ఆన్ 1,33,563గ్లో రేట్ 43.79 %ఎక్కువ ఫిర్యాదులు దీనిపైనే..నగరంలో భారీ వర్షం కురిసి రోడ్లు జలమయమైనప్పుడు.. రాత్రివేళ స్ట్రీట్‌లైట్లు వెల గక, కనిపించని గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ విధులు నిర్వహించేవారు ముఖ్యంగా మహిళలు పని ప్రదేశాల నుంచి ఇళ్లకు వెళ్లాలంటే భయప డాల్సిన పరిస్థితులు నెలకొంటుండగా, వృద్ధులు, పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. జీహెచ్ఎంసీకి ఎక్కువ ఫిర్యాదులందే అంశాల్లో వీధిదీపాలు వెలగకపోవడం ఒకటి. ఈఈఎస్ఎల్ పనితీరుపై పలు సందర్భాల్లో మేయర్, కమిషనర్ హెచ్చ రించినా ఎలాంటి ఫలితం లేదు.ప్రధాన రహదారుల్లోనూ..కాలనీలు, మారుమూల ప్రాంతాలే కాదు ప్రధాన రహదారుల్లోనూ లైట్లు వెలగడం లేదు. సికింద్రాబాద్ జోన్‌లోని బైబిల్ హౌస్, ముషీరాబాద్, బోయిగూడ, నామాల గుండు, ఆనంద్‌బాగ్, మోండా మార్కెట్, మల్కాజిగిరి రామాలయం, ఎల్బీనగర్ జోన్‌లోని నాగోల్ ఎన్క్లేవ్, లక్ష్మీ రాఘవేంద్ర కేజిల్, చింతల్‌కుంట, స్నేహపురి కాలనీ, ఎస్బీహెచ్ కాలనీ, చార్మినార్ జోన్‌లోని మైలార్ దేవ్‌పల్లి, అత్తాపూర్, ఖైరతాబాద్ జోన్‌లోని బేగంబజార్, అఫ్జల్‌గంజ్, కూకట్పల్లి జోన్‌లోని కూకట్పల్లి, బోయిన్పల్లి సహా వందలాది ప్రాంతాల్లో లైట్లు వెలగక అంధకారం రాజ్యమేలుతోంది.వీఐపీలకే వెలుగులా!? ⇒ డాష్‌బోర్డులో జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లు, సర్కిళ్ల వారీగా డేటా నమోదు కావాల్సి ఉండగా చార్మినార్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్లకు సంబంధించిన డేటా అందుబాటులో లేదు. సంపన్నులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, తదితర వీఐపీలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లకు సంబంధించిన వెలుగుల వివరాలే డాష్ బోర్డులో ఉన్నాయి. ఖైరతా బాద్, శేరిలింగంపల్లి జోన్లలో మాత్రమే 98 శాతా నికి పైగా (కనీసం 98% లైట్లు వెలగాలనే నిబంధనకు అను గుణంగా) వెలుగులుండటం గమనార్హం. కాగా మిగతా జోన్లలో చాలా తక్కువ శాతం మాత్రమే వెలుగు తున్నాయి.పనులు చేయని థర్డ్‌పార్టీ..⇒ ఈఈఎస్ఎల్ తాను నిర్వహించాల్సిన పనుల్ని సబ్ కాంట్రాక్టుకు అప్పగించింది. వారికి చెల్లింపులు చేయకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. బల్బు పోయిందని ఫిర్యాదులొస్తే బల్బు తీస్తున్నారు కానీ కొత్తది వేయడం లేదు. అలాగే ఇతరత్రా పనులూ చేయడం లేదు. అధిక చెల్లింపులు?⇒ విద్యుత్ ఖర్చుల పొదుపు పేరిట జీహెచ్ఎంసీ నగరమంతా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు, ఏడేళ్ల నిర్వహణకు ఈఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం వ్యయం రూ.563.58 కోట్లు. ఎల్ఈడీలతో వెలుగులు బాగుంటాయని, సాధారణ స్ట్రీట్‌లైట్స్ వ్యయంతో పోలిస్తే ఏడేళ్లలో జీహెచ్ఎంసీకి రూ.672 కోట్లు మిగులుతాయని జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఒప్పంద సమయంలో పేర్కొంది. అలా పొదుపయ్యే నిధులనే ఈఈఎస్ఎల్కు చెల్లిస్తామని తెలిపింది. ఇలా ఇప్పటివరకు రూ.400 కోట్లు చెల్లించినట్లు సమా చారం. కాగా వీధిదీపాలు వెలగాల్సిన మేర వెలగ కున్నా చెల్లింపులు జరిగాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఒప్పందం మేరకు 5,40,494 వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 5,10,413 మాత్రమే ఉండటం గమనార్హం. అయితే ఒప్పందం మేరకు వెలగాల్సిన లైట్లు వెలగనప్పుడు ఈఈఎస్ఎల్కు చెల్లింపులు చేయడం లేదని, కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు కూడా విధించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. -
Hyderabad: ఎండల్లో వానలు.. ఏందిరా ఈ బాధలు!
సాక్షి, హైదరాబాద్: మార్చి నెలలో అకాల వర్షాలు నగరాన్ని వణికిస్తున్నాయి. వేసవిలో ఊహించని విధంగా భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈదురు గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ తీగలు తెగిపోతున్నాయి. రోడ్లు జలమయమై ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవున్నారు. శివారు ప్రాంతాల్లో వడగళ్లు పడటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటల అపార నష్టం వాటిల్లుతోంది. అల్పపీడంతో ఏర్పడిన ద్రోణి ఆదివారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు.. ఉత్తర అంతర్గత కర్ణాటక మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తున కొనసాగుతుండటంతో ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు రోజులు నుంచి వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ద్రోణుల ప్రభావంతో వేసవిలో సైతం వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మార్చి నెలలో సాధారణ వర్షపాతం కంటే పదింతలు అధికంగా నమోదు కావడం గమనార్హం. -
వరద.. బురద.. తీరని వ్యథ!
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముంపు నుంచి తేరుకునే లోపే..మళ్లీ వరదనీరు ముంచెత్తుతుండటంతో ఆయా బస్తీల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరదలతో సర్వం కోల్పోయిన వారిలో కొంత మంది తాత్కాలికంగా ఇళ్లను వదలి ఇతర ప్రాంతాలకు వలస పోగా..మరికొందరు గత్యంతరం లేక మోకాలిలోతు బురదలోనే ఉండిపోయారు. ఇన్నాళ్లు కష్టపడి కూడబెట్టుకున్న వస్తువులన్నీ కళ్లముందే వరదనీటిలో కొట్టుకుపోవడంతో తీవ్ర వేదన చెందుతున్నారు. సాయం అందక..ఏం చేయాలో దిక్కుతోచక నిరాశలో కూరుకుపోతున్నారు. చివరకు పరామర్శల పేరుతో కాలనీల సందర్శనకు వస్తున్న ప్రజాప్రతినిధులపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం వనస్థలిపురం కార్పొరేటర్‌పై స్థానికులు దాడికి దిగడాన్ని పరిశీలిస్తే..సమస్య తీవ్రతను..ముంపు బాధితుల ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు. సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ బార్కాస్‌లోని గుర్రం చెరువు దిగువన ఉన్న అన్ని బస్తీలను వరద అతలాకుతలం చేసింది. భారీ ఎత్తున కట్ట తెగడంతో నీరు ఒక్కసారిగా దిగువకు వాయువేగంతో నదులను తలపిస్తూ ఉరుకులు పరుగులు పెట్టింది. నీటి ఉధృతికి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు సైతం నేలమట్టమయ్యాయి. మొదటగా హఫీజ్ బాబానగర్‌లోని బ్లాక్‌లను పూర్తిగా ముంచెత్తిన వరద ప్రధాన రహదారి మీదుగా నసీబ్‌నగర్, నర్కీపూల్, సాయిబాబానగర్, శివాజీనగర్, రాజీవ్ గాంధీనగర్, అరుంధతి కాలనీ, కృష్ణారెడ్డినగర్, పార్వతీనగర్, సాదత్‌నగర్, క్రాంతినగర్, లలితాబాగ్, మారుతీనగర్, తానాజీనగర్, భయ్యాలాల్ నగర్, కాళికానగర్లను ముంచెత్తింది. కాగా హఫీజ్‌బాబానగర్‌లోని కొన్ని వీధులలో రెండంతస్తులలోకి నీరు చేరుకోగా...ఉప్పుగూడలో ఒక్క అంతస్తు మేర చేరుకున్నాయి. ఇప్పటికీ చాలా కాలనీలు అంధకారంలోనే మగ్గిపోయాయి. కోదండరాం నగర్లో బాధితుల తరలింపు ముంపులోనే వందలాది కాలనీలు ఎల్బీనగర్ పరిధి బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లోని కప్రాయిచెరువులోకి గత మంగళవారం భారీగా వరదనీరు వచ్చి చేరింది. వారం రోజుల నుంచి హరిహరపురం కాలనీలోని 350 ఇళ్లు మురుగునీటిలోనే ఉండిపోయాయి. 400 కార్లు సహా రెండు వేలకుపైగా బైక్‌లు నీటమునిగాయి. ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్, సెల్లార్లలో నివసిస్తున్న వారు సర్వం కోల్పోవాల్సి వచ్చింది. చెరువులోని నీరు తగ్గకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో వారు వారం రోజులుగా అంధకారంలోనే మగ్గుతున్నారు. కంటికి కునుకు లేదు. తాగేందుకు నీరు లేదు. ఇంట్లో పొయ్యి వెలిగించే పరిస్థితి కూడా లేకపోవడంతో చాలా మంది ఇప్పటికే ఇళ్లను వదిలి బంధువుల ఇళ్లకు చేరుకున్నారు. మరికొంత మంది ఇప్పటికీ ముంపులోనే ఉండిపోయారు. వరదనీరు తగ్గుతుందని భావించి ఊపిరి పీల్చుకుంటున్న లోపే..శనివారం మళ్లీ వరద ముంచెత్తడంతో వారు మరిన్ని కష్టాలకు గురయ్యారు. మీర్‌పేటలోని మంత్రాల చెరువుకు వరద పోటెత్తడంతో చెరువు కట్టకింద ఉన్న మిథులానగర్‌లో వారం రోజుల నుంచి 100పైగా ఇళ్లు మురుగునీటిలోనే ఉండిపోయాయి. సాయినగర్ సహా మందమల్లమ్మ, గ్రీన్‌పార్క్ కాలనీ, లింగోజిగూడ కాలనీలు ముంపులో చిక్కుకుపోయాయి. వీధుల్లో మోకాలిలోతు వరద నీరు నిల్వ ఉండటం, నడవటానికి వీల్లేకుండా భారీగా బురద పేరుకుపోయింది. బాలాపూర్‌లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు హస్తినాపురంలోని శ్రీ బాలాజీ కాలనీ ఇంకా ముంపులోనే ఉండిపోయింది. 50 ఇళ్లు నీటమునిగాయి. అయినా పట్టించుకున్న నాధుడే లేరు. ఇటు నుంచి వచ్చే నీరంతా రెడ్డికాలనీ మీదుగా బైరామల్‌గూడ, కాకతీయనగర్లను ముంచెత్తింది. బండ్లగూడ చెరువులోకి వరద నీరు భారీగా చేరడంతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో చెరువు కింద భాగంలో ఉన్న రాఘవేంద్రకాలనీ, గీతా కాలనీ, లేక్ హోమ్స్, వినయ్ అపార్ట్మెంట్ వాసులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే అయ్యప్పనగర్‌కాలనీ, అయ్యప్పకాలనీ గత 5 రోజలు నుండి వరద నీటిలో మునిగి ఉంది. మరో సారి వర్షం పడితే బండ్లగూడ చెరువు పైనుండి వరద వచ్చే ప్రమాదం ఉంది. హయత్‌నగర్‌లోని బాతుల చెరువు అలుగు ఉధృతితో కట్టమైసమ్మకాలనీ, యశోదనగర్, ఆర్టీసీ మజ్దూరీకాలనీ, అంబేద్కర్‌నగర్, రంగనాయకులగుట్ట, బంజారా కాలనీలు నీట మునిగాయి. పద్మావతికాలనీ, నాగోలు డివిజన్ పరిధిలోని మల్లికార్జున్‌నగర్, అయ్యప్పనగర్, శ్రీనివాస కాలనీ, వెంకటరమణ కాలనీ, బీకే రెడ్డినగర్ కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. బడంగ్‌పేట నుంచి వరదనీరు పెద్దచెరువుకు పోటెత్తడంతో అధికారులు లెనిన్‌నగర్ శ్మశాన వాటికలోనుంచి తాత్కాలికంగా కాలువను తవ్వారు. దీంతో వరద ఒక్కసారిగా జనప్రియ మహానగర్ను ముంచెత్తింది. సాయిబాలాజీ, నవయుగ కాలనీ, శివనారాయణపురం కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుని నేటికి వారం రోజులు కావస్తోంది. ప్రసిద్ధ కాశీబుగ్గ దేవాలయం సహా నాదర్గుల్లోని గ్రీన్ హోమ్స్ కాలనీ, శ్రీకృష్ణ ఎన్క్లేవ్ వరదనీటిలో మునిగి పోయింది. చాదర్‌ఘాట్, మూసానగర్, కమలానగర్, శంకర్‌నగర్, కాలనీలో శనివారం రాత్రి ఇండ్లలోకి నీరు ప్రవేశించి కాలనీ వాసులకు కునుకు లేకుండా చేసింది. చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయి రాకపోకలు బంద్ అయ్యాయి. ఉప్పల్ చిలుకానగర్ నాలా ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఆదివారం కూడా రాకపోకలు సాగలేదు. స్వరూప్‌నగర్ నాలాది సైతం అదే పరిస్థితి. వరద దాటికి సౌత్ స్వరూప్‌నగర్, న్యూభరత్‌నగర్, శ్రీనగర్ కాలనీ, కావేరినగర్, కాలని, అమృత కాలనీ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయినా తప్పదుగా... కోదండరాంనగర్‌లో ముంపునకు గురైన ఇంటి నుంచి ఆదివారం వివాహ నిశ్చితార్థం కోసం ఫంక్షన్ హాలుకు బయలుదేరిన కుటుంబ సభ్యులు, బంధువులు పై చిత్రంలో కన్పిస్తున్న ఈయన పేరు మల్లికార్జున్. మీర్‌పేట పరిధిలోని మిథులానగర్‌లో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఉపాధి కోసం ఇంట్లోనే కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పైన ఉన్న మంత్రాలచెరువు ఉప్పొంగడంతో దానికింద ఉన్న మిథులానగర్‌కు వరదపోటెత్తింది. ఫలితంగా షాపులో ఉన్న సామాన్లు, ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారు..స్కూటర్, ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. రూ.రెండున్నర లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. వరద తగ్గుముఖం పడుతుందని ఊపిరిపీల్చుకునే లోపే శనివారం రాత్రి మళ్లీ భారీగా వరద పోటెత్తింది. -
కోవిడ్ కాలర్ ట్యూన్‌తో ‘కాలయాపన’
సాక్షి, హైదరాబాద్: ఎవరికి ఫోన్ చేసినా మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఆంగ్లంలో కోవిడ్–19 వైరస్ గురించి ఆదరాబాదరా ఉపన్యాసం.. చివరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ 30 సెకన్ల తర్వాత ముక్తాయింపు. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్ వినియోగదారులకు కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధం కోసం వస్తున్న కాలర్ ట్యూన్ ఇది. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా కాలర్ ట్యూన్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ.. ఆంగ్లంలో హడావుడిగా దొర్లుకుంటూ.. చివరకు ప్రజలను గజిబిజి చేసే విధంగా నంబర్లతో ముగించడంతో కాలయాపన తప్ప ప్రయోజనం ఏమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కాలర్‌ట్యూన్ వలన రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ట్యూన్‌తో పాటు కాల్ కనెక్ట్ కావడం లేదని, ఈ ట్యూన్ పూర్తయ్యాకే మనం ఫోన్ చేసిన వ్యక్తికి లైన్ కలుస్తుండటంతో చాలా టైమ్ వేస్ట్ అవుతోందని, పదేపదే అదే ట్యూన్ వినడం విసుగుపుట్టిస్తోందని మెజార్టీ మొబైల్ వినియోగదారులంటున్నారు. మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే కాలర్ ట్యూన్ ఇంగ్లిష్‌లో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అర్థం కాక ఫోన్ కలవడం లేదంటూ కట్ చేస్తున్నారు. మొబైల్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా, నెట్వర్క్ సమస్యతో ఫోన్ కలవకపోయినా సదరు వినియోగదారుడికి కూడా ఆ నెట్వర్క్ ప్రతినిధులు ఇంగ్లిష్‌లోనే వివరిస్తుంటారు. ఇప్పుడు కోవిడ్ కాలర్ ట్యూన్ కూడా ఇంగ్లిష్‌లోనే వస్తుండటంతో ఫోన్ కలవడంలో సమస్య ఉందని, అందుకే ఎవరో ఇంగ్లిష్‌లో చెబుతున్నారనే భావనతో గ్రామీణ నిరక్షరాస్యులు ఫోన్ కట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎవరికి చేసినా ఇదే సమస్య వస్తోందంటూ కొందరు మొబైల్ షాప్‌లకు కూడా వెళ్లాల్సి వస్తోంది. మొత్తంమీద కోవిడ్‌పై చైతన్యపర్చడంలో తప్పేమీ లేదని, కానీ ఇంగ్లిష్ వల్లే ఇబ్బందులొస్తున్నాయనే భావన వ్యక్తమవుతోంది. కాలర్‌ట్యూన్‌ను మాతృభాషలో ఇస్తే అందరికీ అర్థమవుతుందని, తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని చర్చ ఇంగ్లిష్‌లో ఇవ్వడం వల్ల జరిగే ఉపయోగ మేంటన్న జరుగుతోంది. మాతృభాషలో ఇచ్చినా రోజుకు రెండు లేదా మూడు సార్లు కోవిడ్ వైరస్ గురించి చెపితే బాగుంటుం దని, ప్రతిసారీ ఫోన్ చేయగానే దగ్గు వినిపించడం కూడా మానసికంగా ఇబ్బందేనని ప్రజలంటున్నారు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తెలుగులో కాలర్ ట్యూన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఎండ.. ప్రచండ
తణుకు : ఎండలు మండుతున్నాయి.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వారం రోజుల క్రితం వరకు చల్లబడిన వాతావరణం రెండురోజులుగా వేడెక్కింది. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ వేడిమి తగ్గకపోగా వడగాలులు వీస్తున్నాయి. మంగళవారం జిల్లాలో గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలోని మార్పులతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 40 డిగ్రీలను దాటేసిన ఉష్ణోగ్రతలు జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మండుఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఎండవేడిమిని భరించలేకపోతున్నారు. గత రెండు మూడురోజుల క్రితం వరకు అకాలవర్షంతో జిల్లాలో కొన్నిచోట్ల చల్లబడినా మంగళవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గంట గంటకూ ఉష్ణోగ్రతలు పెరగడంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జిల్లాలోని మంగళవారం ఏలూరులో 42, తాడేపల్లిగూడెంలో 41, తణుకులో 40, భీమవరం 39, నరసాపురం 36, కొవ్వూరు 42, జంగారెడ్డిగూడెం 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా పట్టణాల్లో ప్రధాన రహదారులన్నీ కూడా జనం లేక బోసిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇళ్లనుంచి బయటకు వచ్చేవారు ఎండవేడిమి తట్టుకునేందుకు గొడుగులు, చేతిరుమాళ్లు, టోపీలు, స్కార్ఫ్‌లు ధరిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండవేడిమి తగ్గకపోగా వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రోడ్డు పక్కన చిరువ్యాపారులు, కూలీనాలీ చేసుకుని జీవించేవారు, రిక్షా కార్మికులు ఎండవేడిమి తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు ఎండకు వినియోగదారులు రావడంలేదని వ్యాపార లావాదేవీలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్య, మధ్యతగరతి ప్రజలు గతంలో కూలర్లు, ఫ్యాన్లతో సరిపెట్టుకునేవారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఎండవేడిమిని భరించలేక ఏసీలు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందుతున్నారు. గతేడాది 35 మంది మృతి ఈ ఏడాది కూడా జిల్లాలో వడదెబ్బ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే వారం రోజుల్లో జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ఐఎండీ హెచ్చరిస్తున్నారు. గతేడాది వడదెబ్బ కారణంగా జిల్లాలో 35 మంది మృతి చెందారు. అయితే ఈ ఏడాది ఎండవల్ల వడదెబ్బ బాధితులతో పాటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భానుడి ప్రకోపానికి తట్టుకునేలా జనాలు నిలబడాలంటే వైద్యుల సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఓ వైపు అకాలవర్షాల కారణంగా రాత్రి వేళల్లో చల్లటి గాలులు, ఉదయం, మధ్యాహ్నం ఎండల తీవ్రత అధికమవుతుండటం ఆరోగ్యానికి మంచిదికాదని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. గత మార్చి నెలలో ఎండల తీవ్రత అధికమవుతున్న సమయంలో అకాల వర్షాల కారణంగా గడిచిన పదిహేను రోజుల్లో వాతావరణం చల్లబడినా మళ్లీ రెండ్రోజులుగా పుంజుకుంటోంది. -
కుక్కలున్నాయి జాగ్రత్త
మొరిగే కుక్క కరవదంటారు. కానీ ఇప్పుడు మొరగని కుక్కలే కాదు.. మొరిగేవి సైతం పిక్కలు పట్టుకుని పీకుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం ప్రజల్ని వెంటపడి మరీ కరుస్తున్నాయి. నడిచి వెళ్లేవారే కాదు ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారినీ వదలడం లేదు. శునకాల దెబ్బకు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కుక్కల బెడద నివారించండి మహాప్రభో అని ప్రజలు అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వారిలో ఏమాత్రం చలనం లేదు. సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని రాజంపేట పట్టణంలో శనివారం ఏకంగా 10 మంది పిచ్చికుక్క కాటుకు గురై అసుపత్రి పాలయ్యారు. రాయచోటిలోనూ ఆదివారం పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేయడంతో ఐదుగురు చిన్నారులు గాయాలపాలయ్యారు. వీరిలో మాసూద్ అనే మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడగా.. చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. జిల్లాలోని పలు చోట్ల ఇలాంటి సంఘటనలు సర్వ సాధారణంగా మారాయి. జిల్లాలో నెలకు 200 మందికి పైగా కుక్కకాటుకు గురవుతున్నారు. కడప నగర పాలక సంస్థతోపాటు, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, రాయచోటి, పులివెందుల, యర్రగుంట్ల, మైదుకూరు తదితర పట్టణాల్లో వీధి కుక్కలు యధేచ్ఛగా సంచరిస్తున్నాయి. గ్రామాల్లో పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిల్లాలో ఏకంగా 2 లక్షల వరకు వీధి కుక్కలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటికి మున్సిపాలిటీ, పంచాయతీ పాలకులు ఏటా టీకాలు వేయించాల్సి ఉంది. ఇందుకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. కానీ ఫలితం లేదు. శని, ఆదివారాల్లో రాజంపేట, రాయచోటి పట్టణాల్లో పిచ్చికుక్కల స్వైరవిహారమే ఇందుకు ఉదాహరణ. అధికారులు మాత్రం వాటి నివారణ పేరుతో లక్షల్లో నిధులను కాజేస్తున్నారనే విమర్శలున్నాయి. బెంబేలెత్తుతున్న ప్రజలు.. జిల్లాలో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాత్రి అయ్యేసరికి రోడ్డు మీద ప్రయాణం నరకంగా మారుతోంది. వీధి కుక్కలను నియంత్రించాల్సిన అధికారులు నామమాత్ర చర్యలతో మిన్నకుంటున్నారు. న్యాయస్థానాలు ఇతర సంస్థల నుంచి వచ్చిన సూచనలను సాకుగా చూపుతూ.. ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోవడం లేదు. నియంత్రణకు చర్యలేవి.. వాస్తవానికి వీధి కుక్కల నియంత్రణకు ఉన్నత న్యాయస్థానం నిర్ధిష్ట సూచనలు చేసింది. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించి క్రమంగా వాటిలో సంతానోత్పత్తిని తగ్గించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. పిచ్చికుక్కలను మాత్రమే లేకుండా చేయవచ్చు. ఇందుకోసం ఒక్కో కుక్క కోసం దాదాపు రూ. 500 వరకు కేటాయిస్తున్నారు. అధికారులు మాత్రం కాగితాల్లోనే పనులు చేశామంటూ చూపుతూ నిధులు మింగేస్తుండడంతో వీధి కుక్కలు చెలరెగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీధి కుక్కల స్వైర విహారం రాయచోటి రూరల్ : రాయచోటి పట్టణ పరిధిలోని కొత్తపల్లె ప్రాంతంలో ఆదివారం ఉదయం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. వీధిలోని చిన్నారులు, పెద్దలపై విచక్షణా రహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో కొత్తపల్లె ప్రాంతం ఫైర్ స్టేషన్ సమీపంలోని రియాజ్ కుమార్తె 3వ తరగతి చదువుతున్న మసూద్ తీవ్రంగా గాయపడింది. ముఖంపైన, గొంతుపైన తీవ్రగాయాలు కావడంతో కడప రిమ్స్‌కు తరలించారు. దీంతో పాటు అదే ప్రాంతానికి చెందిన చిన్నారులు నితిన్, ముబషీర్, వరాధిలు కుక్కల కాటుకు గాయపడ్డారు. మట్లికి చెందిన జలజ (5)ను కూడా కుక్కలు తీవ్రంగా కరిచి గాయపరిచాయి. గాయపడిన వారికి రాయచోటి ఆసుపత్రిలో చికిత్స చేశారు. మసూద్ అనే చిన్నారి మాత్రం తీవ్రగాయాలతో కడప రిమ్స్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతోంది. -
బ్యాంకుల చుట్టూ ఎన్నిరోజులు తిరిగాలి?
సాక్షి, అమరావతి: బ్యాంకుల వద్ద రద్దీ మూడో రోజూ కొనసాగుతోంది. రెండో శనివారం చాలా ఆఫీసులు, పాఠశాలలకు సెలవులు కావడంతో బ్యాంకులు, ఏటీఎంలు ముందు నగదు కోసం జనం బారులు తీరారు. కొన్ని బ్యాంకుల ముందు టెంట్లు వేసినప్పటికీ, క్యూ లైన్లు రోడ్లపైకి ఉండటంతో ఎండవేడిమి తట్టుకోలేక మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకుల వద్ద 100 నోట్లు లేకపోవడంతో వీటిని చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. బ్యాంకు ఖాతాలేని వారు పాత నోట్లు మార్చుకోవడానికి వస్తే 2,000 నోట్లను ఇస్తున్నారు. ఖాతాదారులు బ్యాంకుల నుంచి రూ10,000 వరకు తీసుకోవడానికి అనుమతి ఉండటంతో రెండువేల వరకు 100 నోట్లు ఇచ్చి మిగిలిన మొత్తానికి 2,000 నోట్లు ఇస్తున్నట్లు బ్యాంకు ఉద్యోగి ఒకరు తెలిపారు. ఇక ఏటీఎంల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా ఏటీఎంలలో మూడు వంతులు పనిచేయనే లేదు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఏటీఎంలో క్యాష్ అయిపోయిందని, ఇప్పటివరకు (మధ్యాహ్నం రెండయ్యింది) క్యాష్ రాలేదని, సాయంత్రానికి రావచ్చంటున్నారని ఏటీఎం సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఒక్క చోటే కాదు చాలాచోట్ల గురువారం రాత్రి నుంచి ఏటీఎంల వద్ద నో-క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బ్యాంకు శాఖల వద్ద ఉన్న ఏటీఎంలు పనిచేస్తున్నాయి కానీ.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏటీఎంలు చాలామటుకు పనిచేయడం లేదు. తమ దగ్గర ఉన్న 100 నోట్లతో ఈ రాత్రి వరకు ఏటీఎంలు నడపగలమని ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు. చిన్న నోట్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, తగినంత సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఎస్బీఐ అధికారి ఒకరు చెప్పారు. పరిస్థితి తీవ్రతను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియచేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తోందని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో తగినంత నగదు అందుబాటులోకి వస్తుందన్న నమ్మకాన్ని బ్యాంకు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకొని ఇలా ఎన్ని రోజులు ఏటీఎంలు, బ్యాంకులు చుట్టూ తిరగాలంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లధనం కలిగిన బడాబాబులు ఏసీ గదుల్లో చల్లగా కూర్చొని ఉంటే కష్టపడి సంపాదించుకున్న తాము మాత్రం తప్పు చేసిన వాళ్ల మాదిరిగా మండే ఎండలో గంటలు తరబడి నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పేదల కష్టాలు
-
చిత్తూరు జిల్లాలో విషజ్వరాలు
-
మెదక్ జిల్లాలో విషజ్వరాలు