ధగ ధగ.. దగా! | People worry about dangers in the dark at night | Sakshi
Sakshi News home page

ధగ ధగ.. దగా!

Published Sat, Jun 29 2024 6:31 AM | Last Updated on Sat, Jun 29 2024 6:31 AM

People worry about dangers in the dark at night

గ్లోబల్‌ సిటీ.. సగం చీకటి

ఎల్‌ఈడీ వీధిదీపాల నిర్వహణలో ఈఈఎస్‌ఎల్‌ వైఫల్యం

జీహెచ్‌ఎంసీ స్ట్రీట్‌లైట్‌ డాష్‌బోర్డు చెబుతున్న నిజమిదీ..

కాలనీలు, మారుమూల ప్రాంతాలే కాదు ప్రధాన రహదారుల్లోనూ ఇదే పరిస్థితి

‘ఆ రెండు’ జోన్లలోనే 98 శాతానికి పైగా వెలుగులు

నిబంధనల మేరకు లైట్లు వెలగకున్నా ఈఈఎస్‌ఎల్‌కు చెల్లింపులు?

రాత్రివేళ చీకట్లో ప్రమాదాలపై ప్రజల ఆందోళన

సీహెచ్‌. వెంకటేశ్‌: రాత్రి వేళ వీధి దీపాల వెలుగులో మెరిసి పోవాల్సిన హైదరాబాద్‌ మహానగరంలో చాలాచోట్ల చీకటే రాజ్యమేలుతోంది. ఎక్కువ కాంతిని వెదజల్లడమే కాకుండా, విద్యుత్‌ చార్జీలు కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధిదీపాలు అనేక ప్రాంతాల్లో వెలగడం లేదు. రాత్రిళ్లు అన్ని లైట్లూ వెలుగుతాయని ఈఈఎస్‌ఎల్‌ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌), జీహెచ్‌ఎంసీ చెబుతున్నా ఆ మేరకు వెలగడం లేదని జీహెచ్‌ఎంసీ స్ట్రీట్‌లైట్‌ డాష్‌బోర్డే స్పష్టం చేస్తోంది. అన్ని స్ట్రీట్‌ లైట్లూ సీసీఎంఎస్‌ (సెంట్రలైజ్డ్‌ కంట్రోల్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) బాక్స్‌లకు అనుసంధానమైనందున సర్వర్‌ నుంచి అందే అలర్ట్స్‌తో సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని, చీకటి పడ్డప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతూ, తెల్లారగానే ఆరిపోయేలా ఆటోమేటిక్‌ వ్యవస్థ పనిచేస్తుందన్నది కూడా మాటలకే పరిమితమైంది.

ఎల్‌ఈడీల ఏర్పాటుకు ముందు ఏటా దాదాపు రూ.150 కోట్ల విద్యుత్‌ చార్జీలు ఉండగా, వీటిని ఏర్పాటు చేశాక ఆ వ్యయం రూ.100 కోట్ల లోపే ఉంటోందని జీహెచ్‌ఎంసీ పేర్కొంటోంది. పొదుపు సంగతేమో కానీ.. కోటిమందికి పైగా ప్రజలు నివసిస్తున్న భాగ్యనగరంలోని రోడ్లపై అంధకారం నెల కొంటుండటంతో ప్రమాదాలు జరుగుతున్నా యని, దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులకు కూడా ఈ పరిస్థితి అనుకూలంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో?
⇒  గత 4 రోజులుగా మా ఏరియాలో స్ట్రీట్‌లైట్లు వెలగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షం కురిసినప్పుడు డ్రైనేజీ మ్యాన్‌హోళ్లతో ఎప్పు డు, ఎక్కడ, ఏ ప్రమా దం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. అధికారులకు పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.  – కె.రాజశేఖరరెడ్డి, ఓల్డ్‌ మలక్‌పేట

రాత్రివేళ రక్షణ కావాలి
⇒  అడ్డగుట్ట వీధుల్లో దీపాలు వెలగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో లైట్ల చుట్టూ పెరిగిన చెట్ల కొమ్మల కారణంగా వెలు తురు రోడ్లపై పడటం లేదు. చెట్ల కొమ్మలు తొలగించాలని, వెలగని విద్యుత్‌ దీపాల కు మరమ్మతులు చేయాలని అధికారు లను కోరుతున్నా స్పందించడంలేదు. కొన్ని బస్తీ ల్లో పగటి వేళ కూడా లైట్లు వెలుగు తున్నాయి. ఇప్పటికైనా చెట్ల కొమ్మల్ని తొలగించి, మరమ్మ తులు  చేసి రాత్రి వేళల్లో మాకు రక్షణ కల్పించాలి. – సంతోషమ్మ , అడ్డగుట్ట

గురువారం ఇదీ పరిస్థితి
⇒  గురువారం (27వ తేదీ) అర్ధరాత్రి 1.20 గంటలు. ఆ సమయంలో జీహెచ్‌ఎంసీ స్ట్రీట్‌లైట్‌ డాష్‌బోర్డు మేరకే నగరంలో 43.79 శాతం వీధిదీపాలు మాత్రమే వెలుగుతున్నాయి. అయితే అది కూడా తప్పే. సీసీఎంఎస్‌ బాక్సులకు కనెక్టయిన  లైట్లలో 43.79 శాతం వెలుగుతున్నాయన్న మాట. వాస్తవానికి ఈ వివరాలు నమోదయ్యే డాష్‌ బోర్డు లింక్‌ను ఎవరికీ తెలియనివ్వరు. మొత్తం లైట్లలో 98 శాతం లైట్లు వెలిగితేనే వీటిని నిర్వహిస్తున్న ఈఈఎస్‌ఎల్‌కు చార్జీలు చెల్లించాలి. కానీ ఎవరికే లింకులున్నాయో కానీ చెల్లింపులు మాత్రం నిరాటంకంగా జరిగిపోతున్నాయి.

ఇదీ లెక్క..

మొత్తం స్ట్రీట్‌ లైట్స్‌    5,10,413
కనెక్టెడ్‌    3,05,018
లైట్స్‌ ఆఫ్‌    1,71,455
లైట్స్‌ ఆన్‌    1,33,563
గ్లో రేట్‌    43.79 %

ఎక్కువ ఫిర్యాదులు దీనిపైనే..
నగరంలో భారీ వర్షం కురిసి రోడ్లు జలమయమైనప్పుడు.. రాత్రివేళ స్ట్రీట్‌లైట్లు వెల గక, కనిపించని గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ విధులు నిర్వహించేవారు ముఖ్యంగా మహిళలు పని ప్రదేశాల నుంచి ఇళ్లకు వెళ్లాలంటే భయప డాల్సిన పరిస్థితులు నెలకొంటుండగా, వృద్ధులు, పిల్లలు  ప్రమాదాల బారిన పడుతున్నారు. జీహెచ్‌ఎంసీకి ఎక్కువ ఫిర్యాదులందే అంశాల్లో వీధిదీపాలు వెలగకపోవడం ఒకటి. ఈఈఎస్‌ఎల్‌ పనితీరుపై పలు సందర్భాల్లో మేయర్, కమిషనర్‌ హెచ్చ రించినా ఎలాంటి ఫలితం లేదు.

ప్రధాన రహదారుల్లోనూ..
కాలనీలు, మారుమూల ప్రాంతాలే కాదు ప్రధాన రహదారుల్లోనూ లైట్లు వెలగడం లేదు. సికింద్రాబాద్‌ జోన్‌లోని బైబిల్‌ హౌస్, ముషీరాబాద్, బోయిగూడ, నామాల గుండు, ఆనంద్‌బాగ్, మోండా మార్కెట్, మల్కాజిగిరి రామాలయం, ఎల్‌బీనగర్‌ జోన్‌లోని నాగోల్‌ ఎన్‌క్లేవ్, లక్ష్మీ రాఘవేంద్ర కేజిల్, చింతల్‌కుంట, స్నేహపురి కాలనీ, ఎస్‌బీహెచ్‌ కాలనీ, చార్మినార్‌ జోన్‌లోని మైలార్‌ దేవ్‌పల్లి, అత్తాపూర్, ఖైరతాబాద్‌ జోన్‌లోని బేగంబజార్, అఫ్జల్‌గంజ్, కూకట్‌పల్లి జోన్‌లోని కూకట్‌పల్లి,  బోయిన్‌పల్లి సహా వందలాది ప్రాంతాల్లో లైట్లు వెలగక అంధకారం రాజ్యమేలుతోంది.

వీఐపీలకే వెలుగులా!? 
⇒ డాష్‌బోర్డులో జీహెచ్‌ఎంసీలోని అన్ని జోన్లు, సర్కిళ్ల వారీగా డేటా నమోదు కావాల్సి ఉండగా చార్మినార్, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్‌ జోన్లకు సంబంధించిన డేటా అందుబాటులో లేదు. సంపన్నులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, తదితర వీఐపీలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లకు సంబంధించిన వెలుగుల వివరాలే డాష్‌ బోర్డులో ఉన్నాయి. ఖైరతా బాద్, శేరిలింగంపల్లి జోన్లలో మాత్రమే 98 శాతా నికి పైగా (కనీసం 98% లైట్లు వెలగాలనే నిబంధనకు అను గుణంగా) వెలుగులుండటం గమనార్హం. కాగా మిగతా జోన్లలో చాలా తక్కువ శాతం మాత్రమే వెలుగు తున్నాయి.

పనులు చేయని థర్డ్‌పార్టీ..
⇒  ఈఈఎస్‌ఎల్‌ తాను నిర్వహించాల్సిన పనుల్ని సబ్‌ కాంట్రాక్టుకు అప్పగించింది. వారికి చెల్లింపులు చేయకపోవడంతో సబ్‌ కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. బల్బు పోయిందని ఫిర్యాదులొస్తే బల్బు తీస్తున్నారు కానీ కొత్తది వేయడం లేదు. అలాగే ఇతరత్రా పనులూ చేయడం లేదు.     

అధిక చెల్లింపులు?
విద్యుత్‌ ఖర్చుల పొదుపు పేరిట జీహెచ్‌ఎంసీ నగరమంతా ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు, ఏడేళ్ల నిర్వహణకు ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం వ్యయం రూ.563.58 కోట్లు. ఎల్‌ఈడీలతో వెలుగులు బాగుంటాయని, సాధారణ స్ట్రీట్‌లైట్స్‌  వ్యయంతో పోలిస్తే ఏడేళ్లలో జీహెచ్‌ఎంసీకి రూ.672 కోట్లు మిగులుతాయని జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు ఒప్పంద సమయంలో పేర్కొంది. అలా పొదుపయ్యే నిధులనే ఈఈఎస్‌ఎల్‌కు చెల్లిస్తామని తెలిపింది. 

ఇలా ఇప్పటివరకు రూ.400 కోట్లు చెల్లించినట్లు  సమా చారం. కాగా వీధిదీపాలు వెలగాల్సిన మేర వెలగ కున్నా చెల్లింపులు జరిగాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఒప్పందం మేరకు 5,40,494 వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 5,10,413 మాత్రమే ఉండటం గమనార్హం. అయితే ఒప్పందం మేరకు వెలగాల్సిన లైట్లు వెలగనప్పుడు ఈఈఎస్‌ఎల్‌కు చెల్లింపులు చేయడం లేదని, కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు కూడా విధించామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement