సాక్షి, హైదరాబాద్: ఎవరికి ఫోన్ చేసినా మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఆంగ్లంలో కోవిడ్–19 వైరస్ గురించి ఆదరాబాదరా ఉపన్యాసం.. చివరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ 30 సెకన్ల తర్వాత ముక్తాయింపు. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్ వినియోగదారులకు కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధం కోసం వస్తున్న కాలర్ ట్యూన్ ఇది. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా కాలర్ ట్యూన్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ.. ఆంగ్లంలో హడావుడిగా దొర్లుకుంటూ.. చివరకు ప్రజలను గజిబిజి చేసే విధంగా నంబర్లతో ముగించడంతో కాలయాపన తప్ప ప్రయోజనం ఏమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కాలర్‌ట్యూన్ వలన రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ ట్యూన్‌తో పాటు కాల్ కనెక్ట్ కావడం లేదని, ఈ ట్యూన్ పూర్తయ్యాకే మనం ఫోన్ చేసిన వ్యక్తికి లైన్ కలుస్తుండటంతో చాలా టైమ్ వేస్ట్ అవుతోందని, పదేపదే అదే ట్యూన్ వినడం విసుగుపుట్టిస్తోందని మెజార్టీ మొబైల్ వినియోగదారులంటున్నారు. మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే కాలర్ ట్యూన్ ఇంగ్లిష్‌లో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అర్థం కాక ఫోన్ కలవడం లేదంటూ కట్ చేస్తున్నారు. మొబైల్ అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోయినా, నెట్‌వర్క్ సమస్యతో ఫోన్ కలవకపోయినా సదరు వినియోగదారుడికి కూడా ఆ నెట్‌వర్క్ ప్రతినిధులు ఇంగ్లిష్‌లోనే వివరిస్తుంటారు. ఇప్పుడు కోవిడ్ కాలర్ ట్యూన్ కూడా ఇంగ్లిష్‌లోనే వస్తుండటంతో ఫోన్ కలవడంలో సమస్య ఉందని, అందుకే ఎవరో ఇంగ్లిష్‌లో చెబుతున్నారనే భావనతో గ్రామీణ నిరక్షరాస్యులు ఫోన్ కట్ చేస్తున్నారు.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎవరికి చేసినా ఇదే సమస్య వస్తోందంటూ కొందరు మొబైల్ షాప్‌లకు కూడా వెళ్లాల్సి వస్తోంది. మొత్తంమీద కోవిడ్‌పై చైతన్యపర్చడంలో తప్పేమీ లేదని, కానీ ఇంగ్లిష్ వల్లే ఇబ్బందులొస్తున్నాయనే భావన వ్యక్తమవుతోంది. కాలర్‌ట్యూన్‌ను మాతృభాషలో ఇస్తే అందరికీ అర్థమవుతుందని, తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని చర్చ ఇంగ్లిష్‌లో ఇవ్వడం వల్ల జరిగే ఉపయోగ మేంటన్న జరుగుతోంది. మాతృభాషలో ఇచ్చినా రోజుకు రెండు లేదా మూడు సార్లు కోవిడ్ వైరస్ గురించి చెపితే బాగుంటుం దని, ప్రతిసారీ ఫోన్ చేయగానే దగ్గు వినిపించడం కూడా మానసికంగా ఇబ్బందేనని ప్రజలంటున్నారు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తెలుగులో కాలర్ ట్యూన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment