caller tune
-
ఫోన్లలో మారుమోగుతున్న ‘హర్‌ఘర్ తిరంగా’
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుతున్నాయి. ఈ సందర్భంగా దేశ పౌరులు తమలోని దేశభక్తిని పలు రకాలుగా చాటుకుంటున్నారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా పలువురి ఫోన్లలో ‘హర్ ఘర్ తిరంగా' కాలర్ ట్యూన్ మారుమోగుతోంది. ఫోన్ చేసినప్పుడు హర్ ఘర్ తిరంగా సందేశం వినిపిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ హర్‌ఘర్ తిరంగా కాలర్ ట్యూన్ మోరుమోగింది. ఈ సారి కూడా పలువురికి ఫోన్ చేసినప్పుడు హర్‌ఘర్ తిరంగా కాలర్ ట్యూన్ వినిపిస్తోంది. త్రివర్ణ పతాకంతో దిగిన ఫొటోను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకోవాలనే సందేశం వినిపిస్తోంది. జాతీయ జెండాను ఎగురవేయడాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం చేస్తున్న ప్రచారంలో భాగంగా ఈ కాలర్ ట్యూన్లను మార్చారు. జెండా సందేశం తర్వాత హర్ ఘర్ తిరంగా థీమ్ సాంగ్‌కు సంబంధించిన చిన్న క్లిప్ ప్లే అవుతోంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు అత్యంత వైభవంగా జరుపుకునే 'హర్ ఘర్ తిరంగ' ఉద్యమంలో భారతీయులందరూ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు. In the spirit of the #HarGharTiranga movement, let us change the DP of our social media accounts and extend support to this unique effort which will deepen the bond between our beloved country and us. — Narendra Modi (@narendramodi) August 13, 2023 -
కరోనా కాలర్ ట్యూన్లు తక్షణమే ఆపేయండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అందుబా టులోకి తెచ్చిన కాలర్ ట్యూన్లను ఇకపై నిలిపివేయాలని టెలికం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వ్యాధిపై ముందు జాగ్రత్తలు, టీకా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ రెండేళ్లుగా పలు దఫాలుగా వీటిని జారీ చేసింది. ఇకపై కరోనా సంబంధిత అన్ని ప్రకటనలు, కాలర్ ట్యూన్లను తక్షణమే ఆపేయాలని టెలికం ప్రొవైడర్లను కోరుతూ టెలికమ్యూనికేషన్ల శాఖ మార్చి 29వ తేదీన ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకు, కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ కూడా సమ్మతించిం దని వివరించింది. వీటి కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ ఆలస్యమవు తున్నాయంటూ కేంద్రానికి ఇటీవలి కాలంలో పలువురి నుంచి విజ్ఞాపనలు అందాయి. -
కరోనా కాలర్ ట్యూన్‌కు ఇక సెలవు..!
కరోనా సమయంలో ఎంతో మందికి వినిపించిన కోవిడ్ కాలర్ ట్యూన్ ఇకపై మూగబోనుంది. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో పాటుగా మరిన్ని కాలర్ ట్యూన్స్ వినిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపై ఆ కాలర్ ట్యూన్ మళ్లీ వినిపించకపోవచ్చు. కాగా, దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే కొవిడ్ నిబంధనలను ఎత్తివేయాలని కేంద్రం ఇటీవలే రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్చి 31వ తేదీ నుంచి కేవలం మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలు మాత్రమే కొనసాగనున్నాయి. అయితే, కరోనా సమయంలో ప్రజలను కోవిడ్ వైరస్‌పై, కోవిడ్ టీకాపై అవగాహన కల్పించేందుకు కేంద్రం.. టెలికాం ఆపరేటర్లతో కలిసి ఫ్రీ కాల్- ఆడియో ప్రకటనలు, కాలర్ ట్యూన్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో కరోనా తీవ్రత తగ్గడంతో ఫ్రీ కాల్ సందేశాలను నిలిపి వేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం ఆదివారం ఓ లేఖ రాసింది. భారత సెల్యులర్ ఆపరేటర్ల సంఘం, మొబైల్ వినియోగదారుల నుంచి కాలర్ ట్యూన్ నిలిపివేయాలని విజ్ఞప్తులు వచ్చినట్లు ఆ లేఖలో పేర్కొంది. దీంతో కొవిడ్ కాలర్ ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందంటూ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. మరోవైపు.. గత 21 నెలలుగా ఈ కాలర్ ట్యూన్స్ వినియోగదారులకు కోవిడ్‌పై సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. అయితే కాలర్ ట్యూన్స్ కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్ మాట్లాడటం ఆలస్యమవుతోందంటూ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల అందుతున్నాయని.. అందుకే దీన్ని నిలిపివేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. Govt considering dropping COVID-19 pre-call announcements from phones after almost two years of raising awareness about disease: Official sources — Press Trust of India (@PTI_News) March 27, 2022 -
‘‘టీకాలు లేనప్పుడు విసిగించే ఆ కాలర్ ట్యూన్ ఎందుకు?’’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు టీకా తీసుకోవాలని ప్రజలను కోరడం ఏంటని ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రశ్నించింది. టీకా వేయించుకోవాలని ప్రజలను కోరుతూ సెల్ఫోన్లలో కేంద్ర ప్రభుత్వం వినిపిస్తున్న డయలర్ ట్యూన్ సందేశంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కాలర్ ట్యూన్ చికాకు కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. అసలు టీకాలే లేనప్పుడు దాన్ని వేయించుకోవాలని కోరడం అర్థం లేని పని అని స్పష్టం చేసింది. ఎవరికైనా ఫోన్ చేసిన ప్రతిసారీ ఈ డయలర్ టోన్ వినిపిస్తోందని.. ఇది జనాల సహనాన్ని పరీక్షిస్తోందని కోర్టు ఆపేక్షించింది. వ్యాక్సిన్ తీసుకొండి అని చెబుతున్నారు.. అసలు టీకానే లేనప్పుడు ఎవరైనా ఎలా తీసుకోవాలి అసలు ఈ సందేశంతో ఏం చెప్పదల్చుకున్నారు అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లితో కూడిన ఢిల్లీ హై కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అలానే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలి. డబ్బులు తీసుకునైనా సరే జనాలకు టీకా ఇవ్వండి. చిన్న పిల్లలు కూడా ఇదే చెబుతారు అని కోర్టు స్పష్టం చేసింది. ఇక కోవిడ్‌పై జనాలకు అవగాహన కల్పించే విషయంలో ప్రభుత్వాలు మరింత సృజనాత్మకంగా ఉండాలని కోర్టు సూచించింది. ఒక్క డయలర్ ట్యూన్‌నే పదే పదే వినిపించే కంటే.. ఎక్కువ సందేశాలు రూపొందించి.. మార్చి మార్చి వాటిని వినిపించాలని.. దీని వల్ల జనాలకు మేలు కలుగుతుందని తెలిపింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, సిలిండర్ల వాడకం, టీకాలపై జనాలకు అవగాహన కల్పించడానికి టీవీ యాంకర్లు, నిర్మాతలను ఉపయోగించుకుని కార్యక్రమాలను రూపొందించాలని.. అమితాబ్ వంటి పెద్ద పెద్ద నటులను దీనిలో భాగస్వామ్యం చేసి అన్నీ చానెల్స్‌లో వీటిని ప్రసారం చేయాలని ఆదేశించింది. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. గతేడాది కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం వంటి అంశాల గురించి భారీ ఎత్తున ప్రచారం చేశారని.. ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మందులు మొదలైన వాటి వాడకంపై కూడా ఇలాంటి ఆడియో-విజువల్ కార్యక్రమాలు రూపొందించాలని కోర్టు తెలిపింది. ప్రింట్ మీడియా, టీవీ ద్వారా కోవిడ్ నిర్వహణపై సమాచారాన్ని ప్రచారం చేయడానికి వారు ఏ చర్యలు తీసుకోబోతున్నారనే దానిపైన, అలానే డయలర్ ట్యూన్ల విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకున్నారనే దాని గురించి మే 18 లోగా తమ నివేదికలను దాఖలు చేయాలని కోర్టు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. చదవండి: టీకా కొరత.. మేం ఉరేసుకోవాలా ఏంటి: కేంద్ర మంత్రి -
మరోసారి మారిన కరోనా కాలర్ ట్యూన్
సాక్షి, హైదరాబాద్ : కరోనాపై అవగాహన కోసం కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి టెలికాం సంస్థ విధిగా వినిపిస్తోన్న కాలర్ ట్యూన్ మరోసారి మారింది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలైన సందర్భంగా శనివారం ఉదయం నుంచి కోవిడ్ కాలర్ ట్యూన్లలో మార్పు మొదలైంది. మనదేశంలో రూపొందించిన వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని, కోవిడ్ వైరస్‌ను ఎదుర్కొనే శక్తిని మీకు అందిస్తుందని, అత్యవసర సమయాల్లో కోవిడ్ కాల్ సెంటర్లను సంప్రదించాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కోవిడ్ వ్యాధి లక్షణాలు, లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరుతూ కేంద్రం ఆదేశాల మేరకు అన్ని టెలికాం సంస్థలు గతేడాది మార్చి నాలుగోవారం నుంచి కరోనా –లాక్డౌన్ నిబంధనలతో కాలర్ ట్యూన్‌ను వినిపిస్తున్నాయి. తరువాత లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేశాక ఈ కాలర్ ట్యూన్ మారింది. భౌతికదూరం, శానిటైజర్, మాస్కు ధరించాలని, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన నెంబర్లతో కాలర్‌టోన్లలో మార్పులు జరిగాయి. తాజాగా వాక్సినేషన్ ప్రక్రియ మొదలవడంతో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. -
ఆ అర్హత ఆయనకు లేదు : బిగ్‌బీకి ఎదురుదెబ్బ
సాక్షి, ఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అద్భుతమైన నటనకు తోడు, ఆయన వాయిస్ బంగారానికి తావి అబ్బిందా అన్నట్టుగా అతికిపోతుంది. అలనాటి ‘దో బూంద్ జిందగీ కే లియే’ అనే పోలీయో వ్యాక్సిన్ యాడ్ నుంచి, ఈనాటి కరోనా వైరస్ కాలర్ ట్యూన్ వరకూ ఆయన వాయిస్ విన్నవారెవ్వరైనా బిగ్‌బీకి ఫిదా అవ్వకు మానరు. అయితే ఇపుడు అమితాబ్ గళమే ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే కరోనా కాలర్‌ట్యూన్ వాయిస్‌కు బిగ్‌బీ అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ వేశారు. అమితాబ్ గొంతును ఆ కాలర్‌ట్యూన్ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కాలర్ ట్యూన్లో జాగ్రత్తలు బోధిస్తున్న అమితాబ్ స్వయంగా కరోనా బారిన పడ్డారని, ఇక ఆయన ఎలా సలహా ఇస్తారని పిటిషనర్ వాదించారు. ఆయనే సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు కదా అరోపించారు. అంతేకాదు రెమ్యూనరేషన్ తీసుకొని వాయిస్ చెప్పడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఎంతో మంది కరోనా యోధులతోపాటు, సినిమా ప్రముఖులు సమాజ సేవలో పాల్గొన్నారని, పేదలకు భోజనం పెట్టడంతో పాటు వసతి, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. దేశ సేవ చేసిన వాళ్లలో చాలామంది ఈ కాలర్ ట్యూన్‌కు ఉచితంగా వాయిస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అమితాబ్ మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా పారితోషికం తీసుకున్నారని పేర్కొన్నారు. అమితాబ్ ఈ అవగాహన కార్యక్రమానికి అనర్హుడని, ఆయనపై చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని కూడా ఆరోపించడం గమనార్హం. మరోవైపు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, తదుపరి విచారణను జనవరి 18కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్.పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్ ధర్మాసనం విచారించింది. -
రీబ్రాండింగ్ తరువాత ‘వీఐ’ కొత్త ప్లాన్లు
సాక్షి,ముంబై: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ‘వీఐ’గా రీబ్రాండింగ్ పూర్తి చేసుకున్నఅనంతరం సరికొత్త ప్రణాళికలపై దృష్టి పెట్టింది. తాజాగా కొత్త ప్లాన్లను ప్రకటించింది. తద్వారా వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అందరూ ఊహించినట్టుగా డేటా ప్లాన్లు కాదు. కాలర్ ట్యూన్ల ప్లాన్లు. ప్రత్యక కాలర్ట్యూన్ల కోసం వొడాఫోన్ ఐడియా వీఐ కాలర్ ట్యూన్ అనే స్పెషల్ యాప్ ప్రారంభించింది. ఇందులో కస్టమర్లు తమ కిష్టమైన కాలర్ ట్యూన్లను ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వీఐ కాలర్టూన్స్ ప్లాన్స్ రూ .49, రూ .69, రూ.99, రూ .249 గా ఉన్నాయి. వినియోగదారులు ప్రొఫైల్ ట్యూన్స్ , తమ పేరుతో పాటు స్టేటస్ టోన్‌ను సెట్ చేసుకోవచ్చు. కాగా టెలికాం మార్కెట్లో ఉన్న పోటీ కారణంగా త్వరలో ప్లాన్ల టారిఫ్ లు పెరిగే అవకాశం ఉందని రీబ్రాండింగ్ తరువాత వొడాఫోన్ ఐడియా సంకేతాలిచ్చింది. కానీ ప్రస్తుతానికి డేటా ప్లాన్లలో ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. (వొడాఫోన్ ఐడియా కొత్త బ్రాండ్ వీఐ) వీఐ కాలర్ ట్యూన్ ప్లాన్స్ రూ .49 ప్లాన్: ప్రీపెయిడ్ వినియోగదారులకు నాలుగు వారాలు , పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు 30 రోజులు 50 కాలర్ ట్యూన్లు ఉచితం రూ .69 ప్లాన్: ఈ ప్లాన్ లో పరిమితి లేదు. అన్ లిమిటెడ్ గా వాడుకోవచ్చు. ప్రీపెయిడ్ వినియోగదారులకు నాలుగు వారాలు, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 30 రోజులు అపరిమితంగా కాలర్ ట్యూన్లను మార్చుకోవచ్చు. రూ .99 ప్లాన్: 100 కాలర్ ట్యూన్లను మూడు నెలలు ఉచితం రూ .249 ప్లాన్ : ఒక ఏడాదికి 250 కాలర్ ట్యూన్లు ఉచితం -
కరోనాపై యుద్ధమంటే..?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై ప్రపంచమంతా యుద్ధం చేస్తోంది. వైరస్ బారిన పడకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు, సలహా సూచనలు చేసేందుకు మొబైల్ నెట్వర్క్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎవరికైనా ఫోన్ చేస్తే వెంటనే కరోనా వైరస్‌పై జాగ్రత్తలు చెబుతూ కాలర్‌టోన్ వచ్చేలా ఐడియా, ఎయిర్టెల్, జియో తదితర నెట్వర్క్ కంపెనీలు ఏర్పాట్లు చేశాయి. గతంలో దగ్గుతో కూడిన శబ్దంతో అలర్ట్ ప్రారంభమయ్యేది. తాజా గా ఈ కాలర్‌టోన్లను కంపెనీలు అప్డే ట్ చేశాయి. ‘కరోనా వైరస్ లేదా కోవిడ్–19పై దేశం మొత్తం యుద్ధం చేస్తోంది’ అంటూ కాలర్‌టోన్ వినిపిస్తోంది. జాగ్రత్తలు పాటిస్తే యుద్ధం చేసినట్లే.. కరోనా బారిన పడిన రోగి, వ్యాధి నుంచి బయట పడిన వ్యక్తిపై వివక్ష చూపొద్దని కాలర్‌టోన్ సూచిస్తుంది. యుద్ధం చేయాల్సింది రోగం పైన అంటూ.. వ్యక్తిగత శుభ్రత, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం తదితర జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌పై యుద్ధం చేసినట్టేననే సారాంశంతో కాలర్‌టోన్ కొనసాగుతుంది. కోవిడ్–19పై చేస్తున్న యుద్ధంలో రక్షణ కవచాలుగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు పోలీసులను వర్ణించింది. ఈ రక్షణ కవచాలను గౌరవించాలని, వారి సూచనలను పాటించాలని, రక్షణ కవచాలను పరిరక్షించుకుని దేశాన్ని గెలిపించాలంటూ కాలర్‌టోన్ ముగుస్తుంది. -
తెలుగులోనూ కోవిడ్ కాలర్ ట్యూన్
సాక్షి, అమరావతి : గత రెండ్రోజులుగా కోవిడ్-19 నియంత్రణకు ఇంగ్లిష్ భాషలో మాత్రమే వినిపిస్తున్న కాలర్ ట్యూన్ ఇప్పుడు తెలుగులోనూ వినిపించనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడారు. నమస్తే అంటూ మొదలై.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, జనసమర్థంలోకి వెళ్లవద్దని చెప్పడం, వైరస్ లక్షణాలున్న అనుమానితులను గుర్తించడం వంటి పలు అంశాలతో కూడిన చక్కటి వాయిస్‌ను రూపొందించారు. సుమారు యాబై సెకన్ల పాటు ఈ కాలర్ ట్యూన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి అన్ని మొబైల్ ఫోన్లలోనూ కోవిడ్ నిరోధానికి పాటించే జాగ్రత్తలు తెలుగులోనే రానున్నాయి. ఇప్పటివరకు ఇంగ్లీష్‌లో వచ్చే ఈ కాలర్ ట్యూన్ అర్థం కాక సామాన్యులు ఇబ్బంది పడుతుండేవారు. (బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కరోనా) హోమియో మందుల పంపిణీ కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ఏపీ సచివాలయంలో మంగళవారం ఆర్సెనికం ఆల్బమ్–30 పేరున హోమియో మందులు పంపిణీ చేశారు. ప్రాంతీయ ఉపసంచాలకులు వెంకట్రామ నాయక్ నేతృత్వంలో 1,500 మందికి హోమియో మందులు అందించామని సెక్రటేరియట్ వైద్యులు వెంకట్ రెడ్డి, ఝాన్సీ లక్ష్మీ, సత్యబాబు తెలిపారు. ఈ హోమియో మందు రాష్ట్రంలోని అన్ని వైద్య కేంద్రాల్లో, హోమియో షాపుల్లో లభిస్తోందన్నారు. భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ఆమోదించిందని వెల్లడించారు. -
కోవిడ్ కాలర్ ట్యూన్‌తో ‘కాలయాపన’
సాక్షి, హైదరాబాద్: ఎవరికి ఫోన్ చేసినా మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఆంగ్లంలో కోవిడ్–19 వైరస్ గురించి ఆదరాబాదరా ఉపన్యాసం.. చివరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ 30 సెకన్ల తర్వాత ముక్తాయింపు. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్ వినియోగదారులకు కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధం కోసం వస్తున్న కాలర్ ట్యూన్ ఇది. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా కాలర్ ట్యూన్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ.. ఆంగ్లంలో హడావుడిగా దొర్లుకుంటూ.. చివరకు ప్రజలను గజిబిజి చేసే విధంగా నంబర్లతో ముగించడంతో కాలయాపన తప్ప ప్రయోజనం ఏమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కాలర్‌ట్యూన్ వలన రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ట్యూన్‌తో పాటు కాల్ కనెక్ట్ కావడం లేదని, ఈ ట్యూన్ పూర్తయ్యాకే మనం ఫోన్ చేసిన వ్యక్తికి లైన్ కలుస్తుండటంతో చాలా టైమ్ వేస్ట్ అవుతోందని, పదేపదే అదే ట్యూన్ వినడం విసుగుపుట్టిస్తోందని మెజార్టీ మొబైల్ వినియోగదారులంటున్నారు. మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే కాలర్ ట్యూన్ ఇంగ్లిష్‌లో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అర్థం కాక ఫోన్ కలవడం లేదంటూ కట్ చేస్తున్నారు. మొబైల్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా, నెట్వర్క్ సమస్యతో ఫోన్ కలవకపోయినా సదరు వినియోగదారుడికి కూడా ఆ నెట్వర్క్ ప్రతినిధులు ఇంగ్లిష్‌లోనే వివరిస్తుంటారు. ఇప్పుడు కోవిడ్ కాలర్ ట్యూన్ కూడా ఇంగ్లిష్‌లోనే వస్తుండటంతో ఫోన్ కలవడంలో సమస్య ఉందని, అందుకే ఎవరో ఇంగ్లిష్‌లో చెబుతున్నారనే భావనతో గ్రామీణ నిరక్షరాస్యులు ఫోన్ కట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎవరికి చేసినా ఇదే సమస్య వస్తోందంటూ కొందరు మొబైల్ షాప్‌లకు కూడా వెళ్లాల్సి వస్తోంది. మొత్తంమీద కోవిడ్‌పై చైతన్యపర్చడంలో తప్పేమీ లేదని, కానీ ఇంగ్లిష్ వల్లే ఇబ్బందులొస్తున్నాయనే భావన వ్యక్తమవుతోంది. కాలర్‌ట్యూన్‌ను మాతృభాషలో ఇస్తే అందరికీ అర్థమవుతుందని, తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని చర్చ ఇంగ్లిష్‌లో ఇవ్వడం వల్ల జరిగే ఉపయోగ మేంటన్న జరుగుతోంది. మాతృభాషలో ఇచ్చినా రోజుకు రెండు లేదా మూడు సార్లు కోవిడ్ వైరస్ గురించి చెపితే బాగుంటుం దని, ప్రతిసారీ ఫోన్ చేయగానే దగ్గు వినిపించడం కూడా మానసికంగా ఇబ్బందేనని ప్రజలంటున్నారు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తెలుగులో కాలర్ ట్యూన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఫోన్ చేయగానే దగ్గుతున్న శబ్దం..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్... ఇప్పుడు సెల్ ఫోన్లకు తాకిందా?. అదేంటి సెల్ ఫోన్లకు కరోనా వైరస్ అనుకుంటున్నారా?. ఈ వైరస్ గురించి, నివారణ చర్యలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ అడుగు ముందుకు వేసింది. మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా ...దగ్గుతున్న శబ్దం.. ఆ తర్వాత దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేతులు శుభ్రం చేసుకోవడం, జన సమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండటం వంటి సూచనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం 30 సెకన్ల నిడివి గల ఓ ఆడియో క్లిప్‌ను రూపొందించింది. (కరోనా భయం వీడి.. మానవత్వం చాటారు) మీరు ఎవరికి ఫోన్ చేసినా ముందుగా దగ్గు, ఆ తర్వాత జాగ్రత్తలు పాటించడనే సందేశాన్ని వినిపిస్తోంది. ఏ మొబైల్ వినియోగదారుడైనా ఈ సందేశం వినకుండా తప్పించుకునే వీలు లేకుండా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా అన్ని ఫోన్లకూ ఒకే కాలర్ ట్యూన్ వచ్చిన దాఖలాలు లేవు. దీంతో పలువురు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొందరికి ఫోన్ చేస్తే మాత్రం మాములుగానే రింగ్ సౌండ్ వినిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. (కరోనా జయించాడు.. రికార్డు సాధించాడు!) రోజుకు ఓ 20 ఫోన్ కాల్స్ చేస్తే... ప్రతిసారి ఈ కాలర్ ట్యూన్‌ను వినాల్సిందేనా అని పలువురు వాపోతున్నారు. మరోవైపు కరోనా ట్యూన్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అంతేకాకుండా కరోనా సందేశం వినిపించకుండా ...ఏం చేయాలనే దానిపై సుచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు కొందరు. అయితే కరోనా ట్యూన్ తమ ప్రాణానికి వచ్చిందిరా బాబు అంటూ కొంతమంది విసుక్కుంటున్నారు కూడా. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 45 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. (వాటి కారణంగానే కోవిడ్ వ్యాప్తి!) -
ఎయిర్టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియోకు పోటీగా భారతీ ఎయిర్టెల్ మరో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. 219 రూపాయలతో ఎయిర్టెల్ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.4జీబీ 3జీ లేదా 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. అంటే మొత్తంగా 39.2జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. డేటాతో పాటు ‘హలో ట్యూన్’ ప్రయోజనాలను, కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్రయోజనాలు, ఇతర ఆపరేటర్లు రూ.199 ప్లాన్‌పైనే అందిస్తున్నాయి. కేవలం ఒక్క ప్రయోజనాన్నే ఎయిర్టెల్ అదనంగా ఆఫర్ చేస్తోంది. అది అపరిమిత ‘హలో ట్యూన్’. యూజర్లు తమ నెంబర్‌కు ఉచితంగా ఎయిర్టెల్ ట్యూన్‌ను యూజర్లు సెట్ చేసుకోవచ్చు. ఎప్పడికప్పుడు తమ నెంబర్లకు కాలర్ ట్యూన్స్‌ను సెట్ చేసుకునే సబ్స్క్రైబర్లను టార్గెట్‌గా చేసుకుని ఎయిర్టెల్ ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో కూడా తన సర్వీసులు లాంచ్ చేసినప్పటి నుంచి ‘హలో ట్యూన్’ సర్వీసులను అందిస్తోంది. ఎయిర్టెల్ కూడా రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 39.2జీబీ డేటా ఆఫర్చేస్తున్నప్పటికీ, హలో ట్యూన్ సర్వీసులను ఆఫర్ చేయడం లేదు. ఎయిర్టెల్ ఇటీవలే తన రూ.549, రూ.799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను సమీక్షించింది. సమీక్షించిన రూ.549 ప్రీపెయిడ్ ప్లాన్‌పై రోజుకు 3.5జీబీ డేటాను ఆఫర్ చేస్తుండగా.. రూ.799 ప్లాన్‌పై రోజుకు 4జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. కేవలం రూ.49తో కూడా ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్టెల్ తీసుకొచ్చింది.