సాక్షి, హైదరాబాద్ : కరోనాపై అవగాహన కోసం కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి టెలికాం సంస్థ విధిగా వినిపిస్తోన్న కాలర్ ట్యూన్ మరోసారి మారింది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలైన సందర్భంగా శనివారం ఉదయం నుంచి కోవిడ్ కాలర్ ట్యూన్లలో మార్పు మొదలైంది. మనదేశంలో రూపొందించిన వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని, కోవిడ్ వైరస్‌ను ఎదుర్కొనే శక్తిని మీకు అందిస్తుందని, అత్యవసర సమయాల్లో కోవిడ్ కాల్ సెంటర్లను సంప్రదించాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కోవిడ్ వ్యాధి లక్షణాలు, లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరుతూ కేంద్రం ఆదేశాల మేరకు అన్ని టెలికాం సంస్థలు గతేడాది మార్చి నాలుగోవారం నుంచి కరోనా –లాక్‌డౌన్ నిబంధనలతో కాలర్ ట్యూన్‌ను వినిపిస్తున్నాయి. తరువాత లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేశాక ఈ కాలర్ ట్యూన్ మారింది. భౌతికదూరం, శానిటైజర్, మాస్కు ధరించాలని, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన నెంబర్లతో కాలర్‌టోన్లలో మార్పులు జరిగాయి. తాజాగా వాక్సినేషన్ ప్రక్రియ మొదలవడంతో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment