సాక్షి, హైదరాబాద్: రెండో వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి మధ్యంతర భృతిని ప్రకటించా లని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమి టీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి వి.మమత తదితరు లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో కేసీఆర్‌ను కలిశారు.
పీఆర్‌సీ ఏర్పాటు, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటన ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా న్యాయం జరిగేలా చూడాలని ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కోరారు. అలాగే సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగుల చందాతో కూడిన ట్రస్టును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
తాము సమర్పించిన వినతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, రెండు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని మామిళ్ల రాజేందర్ ‘సాక్షి’కి వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో టీజీఓల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, టీఎన్‌జీఓల యూనియన్ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణగౌడ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment