
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, పింఛన్ల పథకం కింద పాత లబ్ధిదారులందరికీ ఆ పథకాలు వర్తిస్తా యని వారు కొత్తగా రైతు భరోసా, చేయూత పథకాల కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతుభరో సా, పింఛన్లపై అనవసర అపోహలు వద్దని, కొత్తగా ఈ పథకాల కింద లబ్ధి పొందాలనుకునే వారు మా త్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని కోరారు. ప్రజాపాలనకు సంబంధించి అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయిలో కార్యక్రమం అమలవుతున్న తీరుపై శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రితో సమీక్షించారు. ప్రజాపాలన దరఖాస్తులను కొంతమంది విక్రయిస్తుండడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దరఖాస్తుల కొరత లేకుండా చూడండి
దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దరఖాస్తుల కొరత లేకుండా చూడాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటురానీయొద్దని అధికారులకు మరోసారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment