సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో పేదల ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఇంకా మనకు కనబడుతున్నాయి. బడుగు వర్గాల ప్రజల ఆక్రోశం ఇంకా వినిపిస్తూనే ఉంది. అనేక వర్గాల ప్రజల్లో తమకు స్వాతంత్య్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదన్న ఆవేదన ఉంది. వీటన్నింటినీ విస్మరించి దేశాన్ని ఒక ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుశ్చితమైన కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనం కళ్లారా చూస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘ఇవన్నీ చూస్తూ మౌనం వహించడం కరెక్ట్ కాదు.. అర్థమైన తర్వాత కూడా అర్ధం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు..’ అని ఆయన పేర్కొన్నారు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్నైతే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో.. ఆ సమాజం గొప్పగా పురోగమిస్తుందని స్పష్టం చేశారు.
అద్భుతమైన ప్రకృతి, ఖనిజ సంపదలు, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి యువశక్తి, మానవ సంపత్తి కలిగి ఉన్న మన దేశం పురోగమించాల్సినంతగా పురోగమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకు, యువకులకు, తెలియనివారికి విస్తృతంగా తెలియపర్చాలన్న సదుద్దేశంతో 15 రోజుల పాటు ఈ విధంగా కార్యక్రమాలు పెట్టుకున్నామని తెలిపారు.
కరోనా లాంటి విష వాయువులు వస్తూపోతూ ఉంటాయి
‘సంవత్సర కాలంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నప్పటికీ..ఈ ముగింపు ఉత్సవాలను 15 ఆగస్టుకు ముందు, తర్వాత కూడా జరపాలనుకుని, చాలా గొప్పగా జరుపుకున్నాం. ఈ ప్రయత్నమంతా ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కరోనా మహమ్మారి లాంటి కొన్ని విష వాయువులు (దేశంలోని వర్తమాన రాజకీయాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ) వస్తూ పోతూ ఉంటాయి. స్వాతంత్య్రపు ఉజ్వలత్వం, 75 ఏళ్లుగా జరుగుతున్న విషయాలను మరొక్కమారు సింహావలోకనం చేసుకుని, ముందుకు పురోగమించాల్సిన పద్ధతుల గురించి ఆలోచించాల్సిన అవసరం యువకులకు, మేధావులకు, ఆలోచనపరులకు, ప్రజలందరికీ ఉంది..’ అని సీఎం అన్నారు
మహాత్ముడి గురించి ఈ తరం పిల్లలకు తెలియాలి
‘విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని, ఆహింసా వాదాన్ని, ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించవచ్చని ప్రపంచ మానవాళికి సందేశం ఇచ్చిన మహాత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని. అలాంటి దేశంలో మహాత్మాగాంధీ గురించి, ఆయన ఆచరణ గురించి, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పోషించిన ఉజ్వలమైన పాత్రగురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం ఊరికే రాలేదు. ఎన్నో త్యాగాలు, ప్రాణ, ఆస్తి త్యాగాలు, ఎన్నో బలిదానాలు జరిగితే వచ్చింది. స్వేచ్ఛా భారతంలో మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నం. ఎందరో మహానీయులు త్యాగాలు చేశారు. మనందరి పక్షాన వారందరికీ శిరస్సు వంచి జోహార్లు, ఘనమైన నివాళి అర్పిస్తున్నా.
స్ఫూర్తి రగిల్చేలా..చర్చ చెలరేగేలా..
ఆ స్ఫూర్తితో ఈ దేశాన్ని కులం.. మతం.. జాతి అనే భేదం లేకుండా, పేద.. ధనిక తేడా లేకుండా అందరినీ కలుపుకొని ఒక ఉజ్వలమైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరం బిడ్డలుగా మనందరిపైనా ఉంది. అటువంటి స్ఫూర్తి రగిల్చేందుకే రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. చెట్లు నాటడం, ఆటలు, వ్యాసరచన పోటీలు..ఇలాంటివన్నీ ఎందుకు? ఏ సందర్భంలో జరుపుకుంటున్నాం? అని గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో చర్చ చెలరేగాలని, తద్వారా ప్రతి ఇంట్లో స్వాతంత్య్రం గురించి, ఆనాటి త్యాగాల గురించి స్ఫురణకు తెచ్చే సన్నివేశాలు రావాలని.. ఈ విధంగా 15 రోజుల పాటు కార్యక్రమాల్ని పెట్టుకున్నాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
కొందరు అల్పులు గాంధీ గురించి నీచంగా మాట్లాడుతున్నారు...
‘సామూహిక జాతీయ గీతాలపన, పిల్లలకు గాంధీ సినిమాను ప్రదర్శించడం నాకు అన్నింటి కంటే బాగా నచ్చిన రెండు ఉదాత్తమైన విషయాలు. సుమారు కోటి మంది ప్రజలు జాతీయ గీతాన్ని ఏకకాలంలో ఆలపించడం రాష్ట్రానికే గర్వకారణం. మన జాతీయ స్ఫూర్తికి, భావానికి అది అద్దం పట్టింది. మహాత్ముడు విశ్వమానవుడు. అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. ఆయన గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడవచ్చు. కానీ ఆయన అంతటి మహాత్ముడు మరో 1000 ఏళ్లలో ఈ నేల మీద జన్మించడని ఐక్యరాజ్య సమితి ఘంటాపథంగా చెప్పిన విషయం మనందరికీ తెలుసు. మనం ఏ దేశానికి వెళ్లినా గాంధీ పుట్టిన దేశం నుంచి వచ్చామని చాలా దేశాల ప్రజలు పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. అనేక దేశాలు గాంధీ లైబ్రరీలు నిర్వహించడం, ఆయన జీవిత విశేషాలు తెలియజేయడం, విగ్రహాలు ఏర్పాటు చేయడం మన దేశానికి గర్వకారణం.
గాంధీ మార్గంలో పురోగమించేందుకు ఆలోచన చేయాలి
గాంధీ సినిమాను 22 లక్షల మంది పిల్లలు చూశారంటే అందులో 10 శాతం మంది ఆయన్నుంచి స్ఫూర్తి పొందినా, ఈ దేశం బాగా పురోగమించడానికి వారి శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారని బలంగా నమ్ముతున్నా. భవిష్యత్తులో గాంధీ మార్గంలో దేశం ఏ విధంగా పురోగమించాలో మనమందరం ఆలోచన చేయాలి. గాంధీ బాటలోనే, ఆయన సూచించిన ఆహింసా సిద్ధాంతంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకుని మనం ఏ విధంగా పురోగమిస్తున్నామో మనందరికీ తెలుసు..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు కేశవరావు కమిటీ సభ్యులకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment