సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం నుంచి జిల్లాల పర్యటనలను ప్రారంభించనున్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల అమలు తీరు, పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ఆయన జిల్లాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం సిద్దిపేట, మధ్యాహ్నం కామారెడ్డి జిల్లాల్లో, సోమవారం వరంగల్ జిల్లాలో సీఎం పర్యటిస్తారు.
సిద్దిపేట జిల్లాలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం పర్యటన కొనసాగనుంది. అక్కడ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు. 21న వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతోపాటు వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.
22న భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్త గ్రామమైన వాసాలమర్రిని సీఎం సందర్శించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. గ్రామంలో దాదాపు 3 వేల మందికి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడంతోపాటు గ్రామ సర్పంచ్ ఇంటిని సందర్శించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారు. త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ సీఎం పర్యటనలు ఖరారు కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment