siddipeta district
-
ఫారెస్ట్రీ విద్యకు ఉజ్వల భవిష్యత్తు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ఫారెస్ట్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడ్డాయి. అటవీ శాఖలో ఉద్యోగాలకు ఇక్కడ ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారికి ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించడంతో ఇదివరకు ఇక్కడ చదువుకున్నవారు, ప్రస్తుతం కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడవులు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న క్రమంలో అటవీ నిర్వహణను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రత్యేక విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో అటవీ కళాశాల, పరిశోధన సంస్థను ప్రారంభించింది. తొలుత సొంత భవనం లేకపోవడంతో హైదరాబాద్‌లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో సంస్థను ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట జిల్లా ములుగు సమీపంలో 52 హెక్టార్ల విస్తీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించారు. 2019 నుంచి ములుగులోని నూతన భవనంలో తరగతులు ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు.. ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారికి అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎఫ్ఆర్ఓ (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్) ఉద్యోగానికి 50 శాతం, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) ఉద్యోగానికి 25 శాతం, ఫారెస్టర్స్ ఉద్యోగాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంతో ఈ కోర్సుకు మరింత డిమాండ్ పెరగనుంది. బీఎస్సీ ఫారెస్ట్రీ.. నాలుగేళ్ల కోర్సు ములుగు కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ నాలుగేళ్లు, ఎంఎస్సీ ఫారెస్ట్రీ రెండేళ్ల కోర్సులు కొనసాగుతున్నాయి. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు తొలి రెండు సంవత్సరాలు ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించారు. 2018 నుంచి ఎంసెట్ (బీపీసీ)లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లలో 97 మంది విద్యార్థులు నాలుగేళ్ల కోర్సును పూర్తి చేయగా మరో 214 మంది విద్యార్థులు ఈ కోర్సును అభ్యసిస్తున్నారు. 2020లో ఎంఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును ప్రారంభించారు. ఏఐఈఈఏ ఎంట్రెన్స్ ఉత్తీర్ణులు అయిన వారు ఎంఎస్సీ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంఎస్సీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ఈ సంవత్సరం విద్య పూర్తికానుంది. ఇందులో ఒక్కో సంవత్సరం 17 మందికి అడ్మిషన్ ఇస్తున్నారు, ఇప్పటి వరకు 34 మందికి ప్రవేశాలు కల్పించారు. -
నేటి నుంచి సీఎం జిల్లా పర్యటనలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం నుంచి జిల్లాల పర్యటనలను ప్రారంభించనున్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల అమలు తీరు, పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ఆయన జిల్లాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం సిద్దిపేట, మధ్యాహ్నం కామారెడ్డి జిల్లాల్లో, సోమవారం వరంగల్ జిల్లాలో సీఎం పర్యటిస్తారు. సిద్దిపేట జిల్లాలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం పర్యటన కొనసాగనుంది. అక్కడ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు. 21న వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతోపాటు వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. 22న భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్త గ్రామమైన వాసాలమర్రిని సీఎం సందర్శించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. గ్రామంలో దాదాపు 3 వేల మందికి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడంతోపాటు గ్రామ సర్పంచ్ ఇంటిని సందర్శించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారు. త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ సీఎం పర్యటనలు ఖరారు కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
సుజాతకు అఖండ మెజార్టీ ఖాయం
సాక్షి, దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికలో దివం గత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, క్రాంతి తదితరులు సుజాతను ఓదార్చారు.ప్రచారానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు జాడల్లో నడిచిన గొప్ప ప్రజా నాయకుడు రామలింగారెడ్డి అని చెప్పారు. ఆయన ఆశయాల సాధన కోసం సీఎం ఆ కుటుంబానికే టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. పేదల కష్టాలు తెలిసిన సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పారు. ‘సుజాత నాకు చెల్లెలాంటిది. ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. మా చెల్లెకు సీఎం కేసీఆర్ సందేశం ఇచ్చి.. టికెట్ ఖరారు చేశారని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం, విశ్వాసం నింపేందుకు వచ్చామని తెలిపారు. సుజాతకు తాను, ఎంపీ ప్రభాకర్ ఎడమ, కుడి భుజాలమని, అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తామన్నారు. దుబ్బాక దశ, దిశను మార్చిన గొప్ప నాయకుడు రామలింగారెడ్డి అని కితాబిచ్చారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సుజాతకు తాము వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. రఘునందన్‌కు హైకోర్టులో ఊరట సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండల పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనపై అరెస్టులాంటి బలవంత చర్యలేవీ చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటీ చేయబోతున్నారని, ఈ నేపథ్యంలో ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు. -
కొండపోచమ్మ కాల్వలకు వర్షం దెబ్బ
గజ్వేల్: కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ కాల్వలకు వర్షం దెబ్బ తగిలింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల కాల్వల సిమెంట్ లైనింగ్ దెబ్బతిన్నది. మట్టి కుంగిపోయి లీకేజీలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నది. గోదావరి జలాలు మల్లన్నసాగర్ సర్జిపూల్ నుంచి తుక్కాపూర్ గ్రావిటీ కెనాల్ ద్వారా 24 కిలోమీటర్లు ప్రయాణం చేసి గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద నిర్మించిన హెడ్‌రెగ్యులేటరీ వద్దకు చేరుకుంటాయి. ఇక్కడి గేట్లు ఎత్తిన తర్వాత కాల్వల ద్వారా అక్కారం పంపుహౌజ్ వైపు మరో 6 కిలోమీటర్లు తరలివెళ్తాయి. అక్కడి నుంచి మరో 6.5 కిలోమీటర్ల మేర మర్కూక్–2 పంపుహౌజ్‌కు, ఆ తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి చేరుతాయి. మల్లన్నసాగర్ సర్జిపూల్ నుంచి కొడకండ్ల వరకు ఉన్న ఈ కాల్వ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు. ఇది నాగార్జునసాగర్ కాల్వల సామర్థ్యం కంటే కూడా పెద్దది. ఇంతటి కీలకమైన కాల్వ వర్షాలకు దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా గజ్వేల్ మండలం కొడకండ్ల హెడ్ రెగ్యులేటరీ వద్ద సిమెంట్ లైనింగ్, మెట్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల మట్టి కుంగిపోయి సిమెంట్ లైనింగ్ దెబ్బతినడంతో లీకేజీలు ఏర్పడే ప్రమాదం నెలకొన్నది. మర్కూక్ సమీపంలోనూ కాల్వ సిమెంట్ లైనింగ్ దెబ్బతిన్నది. దీంతో కాల్వ నాణ్యత ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై నీటిపారుదల శాఖ ఈఈ బద్రీనారాయణ వివరణ కోరగా, భారీ వర్షాల కారణంగానే నీటి ప్రవాహం పెరిగి కాల్వ దెబ్బతిన్న మాట వాస్తవమేనని తెలిపారు. అయితే నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే మరమ్మతు చేయిస్తున్నామని స్పష్టం చేశారు. -
‘సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలి’
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఈ నెల 29 (శుక్రవారం)న కొండ పోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం జరగనుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లపై మంత్రి హరీశ్‌రావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు సమయాత్తం కావాలని జిల్లా అధికారిక వర్గాలకు దిశానిర్దేశం చేశారు. కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేయాలన్నారు. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ పోచమ్మ రిజర్వాయరును ప్రారంభోత్సవం చేసుకుంటున్న జిల్లా అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. (గోదావరి నదిలో దూకి ఆటో డ్రైవర్ ఆత్మహత్య) సీఎం కేసీఆర్ ఆలోచన అమలుకు రిజర్వాయర్ల జిల్లా వెనుక అధికారుల కృషి చాలా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతి శాఖ నిద్ర లేని రాత్రులతో అహర్నిశలు కృషి చేసి అన్నీ రంగాల్లో సిద్ధిపేట జిల్లాను తొలి స్థానంలో నిలబెట్టారని అధికారుల పని తీరును కొనియాడారు. జిల్లాలో ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కార్యక్రమాలు చాలా చేశామని, ఎప్పుడూ, ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు రాకుండా ప్రశంసలు పొందామన్నారు. ఈ నెల 29న జరిగే కార్యక్రమాన్ని కూడా జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకూ సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాలు, శాఖల వారీగా జిల్లా అధికారులకు నిర్వాహక బాధ్యతలను అప్పగిస్తూ చేపట్టాల్సిన విధులను మంత్రి హరీశ్ రావు వివరించారు. (‘మే 29 రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నేరవేరే రోజు’) -
70 మంది విద్యార్థులకు అస్వస్థత
సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో 70 మంది విద్యార్థులు చర్మ సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు. ముఖాలపై ఎర్రటి పొక్కులతో చర్మం పొలుసుబారడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా 70 మంది పిల్లలు అస్వస్థతకు గురైనప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు చూడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మిణుగురు పురుగులు కుట్టడంవల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. నారాయణరావుపేట జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మిస్తున్ననేపథ్యంలో స్కూల్‌ను తాత్కా లికంగా సిద్దిపేట శివారులోని ఎల్లంకి కళాశాల లోకి మార్చారు. 5వ తరగతి నుంచి 9వ తరగతివరకు 327 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నారు. పాఠశాలలో పైఅంతస్తులోని డార్మిటరీ హాల్లో విద్యార్థులు నిద్రించేందుకు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా కొందరు విద్యార్థుల మొఖాలపై ఎర్రటి పొక్కులు ఏర్పడ్డాయి. బుధవారం పాఠశాలలో మొత్తంగా 70 మందికిపైగా పొలుసుబారిన చర్మంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ముఖాలపై చర్మం పొలుసుబారడం తగ్గకపోవడంతో పిల్లల అస్వస్థతకు గల కారణంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య పరీక్షలు చేయిస్తున్నాం.. మిణుగురు పురుగులతో విద్యార్థులకు చర్మం పొలుసుబారిపోవడంతో వెంటనే వైద్యులకు చూపించాం. పిల్లలు డారి్మటరీ రూంలోని తెరలను తొలగించడంతో పురుగులు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో మెష్‌లు ఏర్పాటు చేసేలా చూసుకుంటాం. –మహబూబ్ అలీ, ప్రిన్సిపాల్ -
దసరాకు సిద్దిపేట జిల్లా షురూ
సిద్దిపేట తాత్కలిక కలెక్టరేట్‌గా ఎల్లంకి కళాశాల భవనాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: దసరా పండుగ నుంచి సిద్దిపేట జిల్లాకు రాజముద్ర పడనుందని, అధికారికంగా జిల్లా ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా కేంద్రం లాంఛనంగా ప్రారంభమవుతుందని రాష్ర్ట నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట తాత్కాలిక కలెక్టరేట్ కోసం ఎంపిక చేసిన పట్టణ శివారులోని ఎల్లంకి కళాశాలను బుధవారం మంత్రి పరిశీలించారు. రాష్ర్టంలో సిద్దిపేట ఎంతో ఖ్యాతి గడిచిందని, జిల్లా కేంద్రంగా మారనున్న సిద్దిపేట కలెక్టరేట్‌కు కావాల్సిన భవన సముదాయాలు ఎల్లంకి కళాశాలలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. కలెక్టరేట్ కానున్న దృష్ట్యా కళాశాలలోని ప్రతి భవనాన్ని మంత్రి పరిశీలించారు. పార్కింగ్‌కు అనువైన మైదానం, మౌలిక వసతులను ఆరా తీశారు. ఆయన వెంట ఓఎస్డీ బాల్‌రాజు, తహసీల్దార్ శ్రీనివాస్, పట్టణానికి చెందిన కౌన్సిలర్లు, మచ్చవేణుగోపారెడ్డి, చిప్ప ప్రభాకర్, గ్యాదరి రవి, సాకి అనంద్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
చేర్యాల బంద్ సక్సెస్
సిద్దిపేట జిల్లాలో కలపాలని ఆందోళన మూడు గంటల పాటు భారీ ధర్నా, రాస్తారోకో ఎమ్మెల్యే ప్రతిపాదనలపై తీవ్ర ఆగ్రహం చేర్యాల: చేర్యాల ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాలో కలపాలని కోరుతూ చేర్యాల పరిరక్షణ సమితి, చాంబర్ ఆఫ్ కామర్స్, అఖిలపక్ష నాయకులు మంగళవారం చేపట్టిన చేర్యాల బంద్ విజయవంతమైంది. మండల కేంద్రంలోని దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను స్వచ్ఛందంగా మూసి వేశారు. అఖిలపక్ష నాయకులు కొత్త బస్టాండ్ నుంచి గాంధీ చౌరస్తా మీదుగా సినిమా టాకీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంగడి బజారు వద్ద మూడు గంటల పాటు ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక ఎస్సై లక్ష్మణ్‌రావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను బలవంతంగా తొలగించారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి తహసీల్దార్ విజయ్‌సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఏన్నో ఏళ్లుగా చేర్యాల ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాలో కలపాలని మండల వాసులు కోరుకుంటున్నారని, తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇక్కడి ప్రజల మనోభావాలు గుర్తించకుండా జనగామ జిల్లాలో కలపాలంటూ ప్రతిపాదనలు ఇవ్వడం సరైంది కాదని విమర్శించారు. తన నిర్ణయాన్ని తక్షణమే మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో నాయకులు పందిళ్ల నర్సయ్య, ఉడుముల భాస్కర్‌రెడ్డి, పబ్బోజు విజేందర్, పుర్మ వెంకట్‌రెడ్డి, మహాదేవుని శ్రీనివాస్, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, అందె అశోక్, కందుకూరి సిద్దిలింగం, తడ్క లింగమూర్తి, వైస్‌ఎంపీపీ బత్తిని జ్యోతిశ్రీనివాస్, సర్పంచులు ముస్త్యాల అరుణ, పెడతల ఎల్లారెడ్డి, సూటిపల్లి బుచ్చిరెడ్డి, వంగ రాణి, ఎంపీటీసీలు కొమ్ము నర్సింగరావు, బందెల మహిపాల్‌రెడ్డి, బొమ్మగోని రవిచందర్, ఆత్కూరి కనకలక్ష్మి, జయరాములు తదితరులు పాల్గొన్నారు.