కొండపోచమ్మ కాల్వలకు వర్షం దెబ్బ  | Kondapochamma Sagar Project Damaged Due To Heavy Rain | Sakshi
Sakshi News home page

కొండపోచమ్మ కాల్వలకు వర్షం దెబ్బ 

Published Sat, Jun 13 2020 2:10 AM | Last Updated on Sat, Jun 13 2020 2:10 AM

Kondapochamma Sagar Project Damaged Due To Heavy Rain - Sakshi

వర్షానికి దెబ్బతిన్న కొండపోచమ్మసాగర్‌ కాల్వ

గజ్వేల్‌: కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ కాల్వలకు వర్షం దెబ్బ తగిలింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల కాల్వల సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతిన్నది. మట్టి కుంగిపోయి లీకేజీలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నది. గోదావరి జలాలు మల్లన్నసాగర్‌ సర్జిపూల్‌ నుంచి తుక్కాపూర్‌ గ్రావిటీ కెనాల్‌ ద్వారా 24 కిలోమీటర్లు ప్రయాణం చేసి గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్ద నిర్మించిన హెడ్‌రెగ్యులేటరీ వద్దకు చేరుకుంటాయి. ఇక్కడి గేట్లు ఎత్తిన తర్వాత కాల్వల ద్వారా అక్కారం పంపుహౌజ్‌ వైపు మరో 6 కిలోమీటర్లు తరలివెళ్తాయి. అక్కడి నుంచి మరో 6.5 కిలోమీటర్ల మేర మర్కూక్‌–2 పంపుహౌజ్‌కు, ఆ తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి చేరుతాయి. మల్లన్నసాగర్‌ సర్జిపూల్‌ నుంచి కొడకండ్ల వరకు ఉన్న ఈ కాల్వ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు.

ఇది నాగార్జునసాగర్‌ కాల్వల సామర్థ్యం కంటే కూడా పెద్దది. ఇంతటి కీలకమైన కాల్వ వర్షాలకు దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా గజ్వేల్‌ మండలం కొడకండ్ల హెడ్‌ రెగ్యులేటరీ వద్ద సిమెంట్‌ లైనింగ్, మెట్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల మట్టి కుంగిపోయి సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతినడంతో లీకేజీలు ఏర్పడే ప్రమాదం నెలకొన్నది. మర్కూక్‌ సమీపంలోనూ కాల్వ సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతిన్నది. దీంతో కాల్వ నాణ్యత ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై నీటిపారుదల శాఖ ఈఈ బద్రీనారాయణ వివరణ కోరగా, భారీ వర్షాల కారణంగానే నీటి ప్రవాహం పెరిగి కాల్వ దెబ్బతిన్న మాట వాస్తవమేనని తెలిపారు. అయితే నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే మరమ్మతు చేయిస్తున్నామని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement