సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల కిందట ఉద్యమ పార్టీగా అవతరించి.. రాష్ట్ర సాధన తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితికి కొత్త శక్తినిచ్చే దిశగా పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పావులు కదుపుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవడం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కదలికలు పెరగడంతో కేసీఆర్ అప్రమత్తమైనట్లు ఆయన వ్యూహాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ఏకతాటిపై నడిపించడం, పార్టీ యంత్రాంగం- ప్రభుత్వం నడుమ సమన్వయాన్ని సాధించడం లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం కాగా, రాబోయే రోజుల్లో దాని ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి అన్ని ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన టీఆర్‌ఎస్‌కు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న ప్రతికూలతను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికలకు తానే స్వయంగా సార«థ్యం వహిస్తున్నారు. త్వరలో జరిగే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాన్ని ఇప్పటికే ఖరారు చేసిన కేసీఆర్ పార్టీ యంత్రాంగం సన్నద్ధత మొదలుకుని అభ్యర్థి ఎంపిక వంటి అంశాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచార వ్యూహం క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమవుతూ మార్గనిర్దేశనం చేస్తున్నారు.
నెల రోజులుగా దూకుడు..
ముఖ్యమంత్రిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు బాధ్యతలు చేపడుతున్నారంటూ ఈ ఏడాది ఆరంభంలో విస్తృత ప్రచారం జరగ్గా, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు చేశారు. దీంతో పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ వర్గాల్లోనూ ముఖ్యమంత్రి మార్పు అంశం చర్చనీయాంశమైంది. దీంతో ఫిబ్రవరి మొదటివారంలో ఆకస్మికంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ మంత్రులను కూడా ఈ భేటీకి ఆహ్వానించారు. ‘మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి’ని అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పి ఊహాగానాలకు తెర దించారు.
పార్టీ యంత్రాంగంలో కదలిక తెచ్చేలా సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, ఏప్రిల్ 27న ప్లీనరీ సమావేశం... తదితరాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు కేవలం నెలన్నర వ్యవధిలో పూర్తి చేయాల్సిందిగా గడువు నిర్దేశించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని గత నెల 10న హాలియాలో జరిగిన భారీ బహిరంగ సభలోనూ కేసీఆర్ పాల్గొన్నారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో సుమారు ఏడాదికాలంగా పార్టీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం ప్రకటించిన సంస్థాగత షెడ్యూలుతో క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది.
ఎన్నికల వ్యూహం అమలుపై ప్రత్యేక శ్రద్ధ
దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నిక, త్వరలో జరిగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పార్టీ వ్యూహం, ప్రణాళిక అమలును కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ ఎన్నికలో అసంతృప్తి తలెత్తకుండా అభ్యర్థి ఎంపికలో సీల్డ్ కవర్ విధానాన్ని అమలు చేశారు. ఎన్నికల వ్యూహరచనలో తనదైన శైలిని ప్రదర్శించే కేసీఆర్ పట్టభద్రుల ఎన్నికలోనూ విపక్షాలను ఒత్తిడిలోకి నెట్టేలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ, వాటి అమలుకు సారథ్యం వహిస్తున్నారు. ‘నల్లగొండ- ఖమ్మం- వరంగల్’ పట్టభద్రుల కోటా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలోకి దింపారు.
పల్లాకు ముందుగానే గ్రీన్‌సిగ్నల్ లభించడంతో ఓటరు నమోదుతో పాటే సుమారు ఐదు నెలలుగా ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలుపొందని ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ స్థానంలో టీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదనే ప్రచారం సాగుతున్న వేళ చివరి నిముషంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణీదేవిని పార్టీ అభ్యర్థిగా తెర మీదకు తెచ్చారు. పొరుగు జిల్లాలకు చెందిన మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించి, రెండు నియోజకవర్గాల పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమవుతూ ఎన్నికల వ్యూహం అమలుపై మార్గనిర్దేశనం చేస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికపై ఓవైపు కసరత్తు చేస్తూనే... మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేయడంపై దృష్టి సారించారు. పైస్థాయిలో ఖరారు చేసిన వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో యధాతథంగా అమలు చేసే విషయంలో కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
బీజేపీపై ఎదురుదాడి
రాష్ట్రంలో విస్తరణ వ్యూహాన్ని అమలు చేస్తున్న బీజేపీతోపాటు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కదలికలు కూడా పెరగడాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్‌గా పరిగణిస్తున్నారు. రెండు జాతీయ పార్టీల దూకుడుకు ఇప్పటి నుంచే అడ్డుకట్ట వేయడంతో పాటు, 2023 అసెంబ్లీ ఎన్నికలకు పారీయంత్రాంగాన్ని సన్నద్దం చేసే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా ఎదురుదాడి వ్యూహాన్ని ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్ అనుసరిస్తోంది. కేటీఆర్, మంత్రులు, ఇతర నేతలు ‘బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అసత్య ప్రచారాలు’ చేస్తోందని ఎదురుదాడి చేస్తున్నారు.
మీడియా చర్చలకు పార్టీ నేతలు దూరంగా ఉండాలనే ఆదేశాలను ఉపసంహరించుకున్న టీఆర్‌ఎస్ ఇకపై రెండు జాతీయ పార్టీలు.. ప్రత్యేకించి బీజేపీ విధానాలను టీవీ డిబేట్లలో ఎండగట్టాలని నిర్ణయించింది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ కేంద్రంలో బీజేపీ వైఖరిని తూర్పారబట్టాలని, గణాంకాలతో సహా నిలదీయాలని పార్టీ నేతలకు సీఎం సంకేతాలు ఇచ్చారు. నాయకులు నిరంతరం క్షేత్రస్థాయిలోనే ఉంటూ పార్టీ యంత్రాంగంతో మమేకమయ్యేలా చేయడం, పాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం లక్ష్యంగా కేసీఆర్ తన వ్యూహానికి పదును పెడుతున్నట్లు సమాచారం.
నెల రోజులుగా సీఎం కేసీఆర్ బిజీబిజీ
Published Tue, Mar 2 2021 2:08 AM | Last Updated on Tue, Mar 2 2021 8:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment