సాక్షి, హైదరాబాద్: ప్రజలందరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తి మేల్కొలిపేలా అంగరంగ వైభవంగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 15 రోజుల ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 16న రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’నిర్వహించాలని, ఎక్కడివాళ్లక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు 21న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయితీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, అన్ని రకాల స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్వాతంత్య్ర పోరాట వీరులకు ఈ సమావేశాల్లో ఘన నివాళులు అర్పించాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’కార్యక్రమంపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కె. కేశవరావు నేతృత్వంలోని ఉత్సవ కమిటీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు మొదలు ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువత యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాలల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఇంటింటికీ ఉచితంగా జాతీయ జెండాలు...
ఈ నెల 15న ఇంటింటిపై జాతీయ జెండాను ఎగరేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రాష్ట్రంలోని మొత్తం ఒక కోటీ 20 లక్షల గృహాలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెల 9 నుంచి మున్సిపాలిటీలు, పంచాయతీల ఆధ్వర్యంలో జెండాల పంపిణీ చేపట్టాలన్నారు.
8న ఘనంగా ఉత్సవాల ప్రారంభం
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఆగస్టు 8న వజ్రోత్సవ ప్రారంభ సమారోహాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్మీ, పోలీస్ బ్యాండుతో రాష్ట్రీయ సెల్యూట్, జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం స్వాగతోపన్యాసంతోపాటు, సభాధ్యక్షుడి తొలిపలుకులు, సీఎం కేసీఆర్ వజ్రోత్సవ వేడుకల ప్రత్యేక సందేశ ప్రసగం, వందన సమర్పణ ఉండనుంది.
సీఎం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..
► బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు సహా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక అలంకరించడంతోపాటు ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రతిష్టాత్మక భవనాలపై జాతీయ జెండాలు ఎగరేయాలి.
► ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వక్తృత్వ, వ్యాస రచన, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించాలి.
► ప్రతిరోజూ ప్రార్ధన సమయంలో విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి.
► రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ‘గాంధీ’సినిమాను ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు ప్రతిరోజూ ప్రదర్శించాలి.
► స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలను, ముషాయిరాలు చేపట్టాలి.
► ప్రముఖ గాయకులు, సంగీత విధ్వాంసులతో సంగీత విభావరి.
► సమాజంలో నిరాదరణకు గురైన వర్గాలను గుర్తించి ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు.
► జిల్లాకో ఉత్తమ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, పాఠశాల, రైతు, డాక్టర్, ఇంజనీర్, పోలీస్ తదితర ఉద్యోగులు, కళాకారుడు, గాయకుడు, కవిని గుర్తించి సత్కరించాలి.
► రవీంద్ర భారతిలో 15 రోజులపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి.
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా నిర్వహించే రోజువారీ కార్యక్రమాలు..
► ఈ నెల 8: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవం
► ఈ నెల 9న: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ మొదలు
► 10: వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు
► 11: యువత, క్రీడాకారులు, ఇతరులతో ఫ్రీడం 2కే రన్
► 12: రాఖీ సందర్భంగా వివిధ మీడియాల సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి
► 13: వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
► 14: సాంస్కృతిక సారథి కళాకారులతో నియాజకవర్గ కేంద్రాల్లో జానపద కార్యక్రమాలు. ట్యాంక్‌బండ్ సహా రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా వెలుగులు
► 15: స్వాతంత్య్ర వేడుకలు
► 16: ఏకకాలంలో తెలంగాణవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాలు
► 17: రక్తదాన శిబిరాలు
► 18: గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ‘ఫ్రీడం కప్’పేరుతో ఆటల పోటీలు
► 19: దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో ఖైదీలకు పండ్లు, మిఠాయిల పంపిణీ
► 20: దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని చాటేలా ముగ్గుల పోటీలు
► 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు
► 22: ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు
16న ఏకకాలంలో ‘జనగణమన’ ఎక్కడివాళ్లు అక్కడే పాల్గొందాం: కేసీఆర్
Published Wed, Aug 3 2022 3:26 AM | Last Updated on Wed, Aug 3 2022 3:06 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment