సాక్షి, హైదరాబాద్: ‘విశ్వమానవుడు అని ప్రపంచం కీర్తిస్తున్న జాతిపిత మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యలు వింటున్నాం. దురదృష్టకరమైన సంఘటనలు చూస్తున్నాం. ఇది ఏమాత్రం మంచిదికాదు. కోటానుకోట్ల మంది గాంధీజీ ఫొటోను నెత్తిన పెట్టుకొని ఊరేగిన దేశం ఇది. ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను తానే మలినం చేసుకోదు. అలాంటి వెకిలి, మకిలి ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా ఏకీకృతంగా, ఏకోన్ముఖంగా, ఏకకంఠంతో ఖండించాలి. మహాత్ముని కీర్తి మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ప్రయత్నించాలి. మహాత్ముడు ఎన్నటికీ మహాత్ముడిగానే ఉంటడు. చిల్లరమల్లర శక్తులు చేసే ప్రయత్నాలు ఏనాటికీ నెరవేరవు. ఆకలి, పేదరికం ఉన్నంత వరకు ఆక్రందనలు, అలజడులు ఉంటాయి’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. జాతీయ జెండాను ఎగరేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిఒక్కరూ ఖండించాలని, కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
త్యాగధనులకు నివాళులు...
నేను గాంధేయవాదిని అని గర్వంగా చెప్పుకొనే వాళ్లు కోటాను కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. చౌటుప్పల్ దగ్గర ఓ అధికారి మహాత్మునికి గుడి కట్టించాడు. ఇండియా నుంచి వచ్చామని చెబితే విదేశీయులు గాంధీ దేశం నుంచా? అని అడిగినప్పుడు గర్వపడ్డ చరిత్ర మనది. అలాంటి మహాత్మునికి ఏమాత్రం కళంకం వచ్చినా సహించరాదు. 1947 ఆగస్టు 15 నుంచి 1975 మే 16 వరకు ఎన్నో ప్రయాసాలకు ఓర్చి 584 సంస్థానాలను, స్వతంత్ర దేశాలను విలీనం చేస్తే ప్రస్తుత భారతదేశం రూపుదాల్చింది. ఈ కూర్పు కోసం ఎందరో మహానుభావులు, ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని చూశాం. ఎంతమందిమైనా చస్తం కాని మా స్వేచ్ఛ వాయువులు పీల్చేంత వరకు జెండా దించబోమని అనేక మంది భరతమాత బిడ్డలు, భగత్‌సింగ్ లాంటి త్యాగధనులు అసువులు బాసారు. వారందరికీ తెలంగాణ తరఫున నివాళులు.
అభివృద్ధిని ద్విగుణీకృతం చేసే దిశగా...
కొన్ని ప్రతికూల శక్తులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని చూసి బాధ పడాల్సిన అవసరం లేదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి తరిమికొట్టిన గడ్డ మనది. ప్రశాంత, సస్యశ్యామల భారతదేశాన్ని చీల్చడానికి జరుగుతున్న చిల్లరమల్లర ప్రయత్నాలను ఏకకంఠంతో ఖండించాలి. స్వాతంత్య్ర స్ఫూర్తిని, జరుగుతున్న అభివృద్ధిని ద్విగుణీకృతం చేసే దిశగా ముందుకు పోవాలె. తెలంగాణ నుంచి అవసరమైతే జాతీయ స్థాయిలో వెళ్లి పనిచేయడానికి సమాయత్తం కావాలె. ఉప్పు సత్యాగ్రహంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి వాళ్లు చాలా మంది పాల్గొన్నారు. ఆ స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలి.
సిపాయిల తిరుగుబాటు విఫలమైనా పోరు ఆగలేదు
భారత స్వాతంత్య్రం సుమారు ఒకటిన్నర శతాబ్దంపాటు కొనసాగిన పోరాటం. విప్లవ శక్తులు విజయం సాధించిన వేళ కూడా వాళ్లతో రాజ్యానికి సహకరించే సగం మంది కలిసినప్పుడే విజయం సాధిస్తుంది. అట్లాగే సాయుధ బలగాలు పోరాటం, తిరుగుబాటు చేస్తే రాజ్యం పోవాలి. కానీ భారత స్వతంత్ర సమరంలోని 1857 సిపాయిల తిరుగుబాటు వంటి ఉజ్వల ఘట్టం తర్వాత కూడా ఆనాటి బ్రిటిష్ వలసరాజ్యం కూలిపోలేదు. మరింతగా ఉద్యమాన్ని అణచివేసింది. అయినా ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు విఫలమైందని ఎనాడూ నిరాశ చెందలెదు. వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకొని పోరాటాన్ని కొనసాగించారు. మహాత్మాగాంధీ నడుంకట్టడంతో దేశం ఆయన వెంట నడిచింది.
అద్భుతంగా వజ్రోత్సవ వేడుకలు జరగాలి
మహోజ్వలమైన స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి.. వాడవాడలా గ్రామగ్రామాన అద్భుతంగా జరగాలి. ఎన్ని త్యాగాలతో, పోరాటాలతో, వేదనలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం వచ్చిందో ప్రతిగడపకూ తెలిసేలా ఉత్సవాలు నిర్వహించాలి. కొత్త తరానికి స్వతంత్ర భారత పోరాటాల గురించి తెలియజేయాలి. గాంధీజీ సినిమాను 560 స్క్రీన్‌లలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు చూపించేలా ఏర్పాట్లు చేశాం. ఎక్కడివారు అక్కడే ఉండి సామూహిక జాతీయ గీతాలాపనను రాష్ట్రమంతా ఏకకాలంలో నిర్వహిస్తాం.
పేదరికాన్ని నిర్మూలిస్తేనే శాంతి..
దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తేనే సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం లభిస్తుంది. ప్రజల ఆపేక్షలు అనుకున్న స్థాయిలో నెరవేరలేదు. దళిత సమాజం మాకు జరగవలసినంత జరగలేదని ఆక్రోశిస్తుంది. ఇంకా కొన్ని అల్పాదాయ వర్గాలు, పేదలు అసంతృప్తితో ఉన్నారు. సాయుధ పోరాటాలు వచ్చినయ్. స్వాతంత్ర్యం రాకముందే 1940లో తెలంగాణ గడ్డ మీద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జాగీర్దారీ వ్యతిరేక పోరాటం జరిగింది. అది కొంత చైతన్యాన్ని తెచ్చింది.
ఆ తర్వాత నక్సలిజంతోపాటు అనేక పోరాటాలు వచ్చాయి. వాటన్నింటినీ అధిగమించాలంటే సంకుచిత భావాలను పక్కనబెట్టి విశాల దృక్పథంతో ఆర్తులు, అన్నార్థులు, పేదలందరి సౌభాగ్యం కోసం కంకణబద్ధులై సాగాలి. ఈ దేశం నాదనే అభిప్రాయం ప్రతిఒక్కరిలో కలగాలి. తెలంగాణ వచ్చాక పునర్నిర్మాణంలో ఎంతగానో కష్టపడుతున్నాం. ఎనిమిదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నో సాధించాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఫరిడవిల్లుతున్నాయి. 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం.
విశ్వమానవుడు మహాత్మా గాంధీ..
భారతదేశ స్వతంత్ర సముపార్జన సారథే కాదు.. యావత్ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు మన మహాత్మాగాంధీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా భారత పర్యటనలో భాగంగా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ‘గాంధీజీ ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’ం అని ఆయన పేర్కొనడంతో అప్పుడు ఎంపీగా ఉన్న ఎంతో గర్వపడ్డాను. అలాగే ఐన్‌స్టీన్, నెల్సన్ మండేలా గాంధీజీ వ్యక్తిత్వాన్ని ఎంతగానో కొనియాడారు. అటువంటి జాతికి వారసులం మనందరం.
యువతకు స్వాతంత్ర్యం విలువ తెలపాలి
క్విట్ ఇండియా సంస్మరణ సందర్భంగా కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరంలో భాగంగా డూ ఆర్ డై నినాదంతో 1942 ఆగస్టు 8న గాంధీజీ ప్రారంభించిన క్విట్ ఇండియా మహోద్యమాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నాటి మహనీయులకు నివాళులరి్పంచారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంతటి విలువైనవో నేటి యువత తెలుసుకోవాలి్సన అవసరం ఉందన్నారు.
అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు..
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వతంత్ర వజ్రోత్సవ కార్యకలాపాలు సోమవారం హెచ్‌ఐసీసీలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా కళాకారులు నిర్వహించిన నృత్య, సంగీత ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఆసక్తిగా తిలకించి కళాకారులను అభినందించారు. లేజర్ షోలు, ఫ్యూజన్ డ్యాన్స్‌లు సభికుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ కార్యక్రమాలకు ముందు పోలీసులు గౌరవ వందనంతో ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు. గాంధీ విగ్రహానికి, భరతమాత చిత్రపటానికి కేసీఆర్ పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలకు చెందిన 2,500 మందికిపైగా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారు: జీవన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment