Telangana CM KCR Inspects Gandhi Hospital First Time - Sakshi
Sakshi News home page

గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు కేసీఆర్‌ భరోసా

Published Thu, May 20 2021 1:34 AM | Last Updated on Thu, May 20 2021 7:32 AM

CM KCR Gandhi Hospital Visit For The First Time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆరోగ్యం ఎలా ఉంది?.. వైద్యులు బాగా చూస్తున్నారా?.. వేళకు మందులిస్తున్నారా?.. భోజనం బాగుందా?..’ అంటూ గాంధీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితుల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో తొలిసారి బుధవారం ఆయన గాంధీ జనరల్‌ ఆస్పత్రిని సందర్శించారు. నేరుగా ఐసీయూలోకి వెళ్లి ఆక్సిజన్, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులను పరామర్శించారు.

పీపీఈ కిట్లు, చేతులకు గ్లౌవ్స్‌ లేకుండా కోవిడ్‌ వార్డును సందర్శించి బాధితులతో మాట్లాడారు. ‘మీది ఏ ఊరు?.. ఏం పేరు?.. వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. నేను కూడా ఇప్పటికే కోవిడ్‌ బారిన పడ్డాను. హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నాను. మీరు కూడా కోలుకుంటారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి.. అన్ని విధాలుగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ అని రోగుల బంధువులకు భరోసా ఇచ్చారు. రోగులు, వారికి సహాయకులుగా వచ్చిన వారు చెప్పింది ఓపికగా విని, తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 

ప్రతిపాదనలు సిద్ధం చేయండి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గాంధీలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. నిమిషానికి 2,000 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్లాంటు మొత్తం కలియతిరిగి పనితీరు, ఉత్పత్తి, ఆక్సిజన్‌ నాణ్యతపై డాక్టర్‌ రాజారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాంధీలో వైద్యసేవలు అందిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ శానిటేషన్‌ సిబ్బంది, స్టాఫ్‌ నర్సులు, జూనియర్‌ వైద్యులతో మాట్లాడారు.

కరోనా సమయంలో ప్రాణాలు తెగించి వైద్య సేవలు అందిస్తుండటం అభినందనీయమని కొనియాడారు. ఇదే సమయంలో కొంత మంది ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు, జూనియర్‌ డాక్టర్లు సమస్యలతో కూడిన వినతీపత్రం సీఎంకు అందించేందుకు యత్నించగా.. ‘మీ సమస్య నా దృష్టిలో ఉంది. త్వరలోనే మీతో మాట్లాడుతా. అన్ని సమస్యలు పరిష్కరిస్తా’ అని హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేసి పంపాలని అక్కడే ఉన్న డీఎంఈ రమేష్‌రెడ్డిని ఆదేశించారు. 

వైద్య సిబ్బందికి భరోసా
‘క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి బ్రహ్మండంగా సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను ఇలాగే కొనసాగించాలి. మీకు ఏదైనా సమస్య ఉన్నా.. అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి, మీకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది’ అంటూ ఔట్‌ సోర్సింగ్‌ వైద్య సిబ్బందికి భరోసా ఇచ్చారు. సుమారు గంటపాటు ఆస్పత్రిలో ఉన్నారు. సీఎం రాకతో ఉదయం 10 గంటలకే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాంధీకి చేరుకుని, ఆస్పత్రిలోని వార్డులు సహా పరిసర ప్రాంతాలను రసాయణాలతో శానిటైజ్‌ చేశారు.

సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న రోగుల సహాయకులను బయటికి పంపారు. గాంధీ ఆస్పత్రి సందర్శనలో సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, సీఎం కార్యదర్శి, కోవిడ్‌ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్‌డీ గంగాధర్, డీహెచ్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్‌రెడ్డి, పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఉన్నారు. 

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆనందం..
‘2007 నుంచి ఆస్పత్రిలో 220 మందిమి ఔట్‌ సోర్సింగ్‌ విభాగంలో పని చేస్తున్నం. ఎబోలా, స్వైన్‌ఫ్లూ వచ్చినప్పుడే కాకుండా ప్రస్తుతం కోవిడ్‌ వార్డుల్లోనూ విధులు నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో భాగంగా మా ప్రాణాలే కాకుండా.. మా కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నాం. మా ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేసి ఆదుకోండి’ అని స్టాఫ్ట్‌ నర్సులు సీఎం కేసీఆర్‌తో మొరపెట్టుకున్నారు. దీనికి ఆయన సుముఖతను వ్యక్తం చేయడమే కాకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తామెంతో ఎంతో సంతోషిస్తామని  స్పష్టం చేశారు. 

సీఎం రాక గర్వకారణం....
సీఎం కేసీఆర్‌ గాంధీ ఆస్పత్రికి రావడం గర్వకారణంగా భావిస్తున్నాం. ఐసీయూ సహా మరో మూడు వార్డులు సందర్శించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ జిల్లాల రోగులతో స్వయంగా మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వెంటిలేటర్‌పై ఉన్నవారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపారు. వారి సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. –  డాక్టర్‌ రాజారావు, సూపరింటిండెంట్, గాంధీ

రోగులకు ధైర్యం...
‘మీది ఏ ఊరు?.. ఏం పేరు?. నేను కూడా కోవిడ్‌ బారిన పడ్డా. హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నా. మీరు కూడా కోలుకుంటరు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి.. ప్రభుత్వం అన్ని విధాలా మీకు అండగా ఉంటుంది.’

ఔట్‌సోర్సింగ్‌ నర్సులకు హామీ...
‘కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది సేవలు అందిస్తుండటం అభినందనీయం. క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి బ్రహ్మాండంగా సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను ఇలాగే కొనసాగించాలి. మీకు ఏదైనా సమస్య ఉన్నా.. అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి, మీకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది’ 



రేపు వరంగల్‌ ఎంజీఎంకు సీఎం
సీఎం కేసీఆర్‌ శుక్రవారం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడనున్నారు. 


చదవండి: యథావిధిగా ఆంక్షలు.. అదనపు సడలింపులు లేనట్టే 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement