లాక్‌డౌన్‌ పెట్టం‌: సీఎం కేసీఆర్‌ | CM KCR Gives Clarity On Telangana Lockdown In Assembly Session | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ పెట్టం‌: సీఎం కేసీఆర్‌

Published Sat, Mar 27 2021 1:09 AM | Last Updated on Sat, Mar 27 2021 8:14 AM

CM KCR Gives Clarity On Telangana Lockdown In Assembly Session  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘విద్యా సంస్థలను తాత్కాలికంగానే మూసివేశాం. అది కూడా కరోనా వ్యాప్తి పట్ల ముందు జాగ్రత్త చర్యగా చేపట్టాం. తొందరపడి ఆగమాగమై లాక్‌డౌన్‌ పెట్టం. నోమోర్‌ లాక్‌డౌన్‌. పరిశ్రమల మూసివేత ఉండదు. అంత గాభరాపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా దెబ్బతిన్నం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబడదు. ఎవరూ బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. కరోనాను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నం..’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మాస్కులు, భౌతిక దూరంతో కరోనా ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందన్నారు. మూఢాలు ఉండి ప్రస్తుతానికి పెళ్లిళ్లు జరగడం లేదని, ఇతర ఫంక్షన్లలో కూడా గ్యాదరింగ్స్, సామూహిక ఊరేగింపు లు తగ్గించుకుంటే మంచిదని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ 2021–22 సమావేశాల చివరిరోజు శుక్ర వారం ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ, శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. కేసీఆర్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటోంది 
బడ్జెట్‌ సమావేశాలు మొదలైననాటి నుంచి రొడ్డకొట్టుడు, పాడిందే పాట తప్ప విపక్షాల నుంచి నిర్మాణాత్మకమైన సూచన, గుణాత్మకమైన గొప్ప సలహా రాలేదు. భట్టి విక్రమార్క చాలా ప్రయత్నం చేశారు. తలసరి ఆదాయాల కథ పెద్దగా చెప్పారు. అది వారి ఆర్థిక పరిజ్ఞానానికి పరాకాష్ట. విస్తృత ఆర్థిక విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. మనం కేంద్రాన్ని అనుసరించక తప్పదు. ఉమ్మడి జాబితా పేరుకే. రాష్ట్రాల హక్కులు, బాధ్యతలను కేంద్రం హరిస్తోంది. ప్రజాస్వామ్యం పరిణతి చెందిన కొద్దీ రాష్ట్రాలకు అధికారాలు బదిలీ కావాలి. అలాకాకుండా రాష్ట్రాల అధికారాలను లాక్కుంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభు త్వాలు సమాన పాత్ర పోషించాయి. 

రిజర్వేషన్లు మన చేతుల్లో లేకుండా పోయాయి 
(12% ముస్లిం)రిజర్వేషన్ల గురించి మజ్లిస్‌ ఎమ్మెల్యే మౌజం ఖాన్‌ నన్ను కలిసి అడిగారు. రిజర్వేషన్ల అం శం మన చేతిలో లేకుండా పోయింది. పక్కన ఉన్న తమిళనాడులో 69% కోటా అమలవుతోంది. 50 శాతానికి మించొద్దని సుప్రీంకోర్టు అంటోంది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజన జనాభా, మరి కొన్ని రాష్ట్రాల్లో బీసీల జనాభా ఎక్కువగా ఉంటుంది. మొత్తం దేశానికి 50శాతం రిజర్వేషన్ల పరిమితి విధించడం సరికాదని చెప్పినం. రిజర్వేషన్లను రాష్ట్రాలకు వదిలేయాలని కోరాం. ఇప్పుడీ అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఓల్డ్‌ సిటీలో మెట్రో రైలు పూర్తి చేస్తామన్న హామీని తప్పకుండా నెరవేరుస్తాం. మక్కా మసీదు, షాహీ మసీదుల్లోని ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే అంశాన్ని సానుభూతితో పరిశీలిస్తాం. 

వ్యవసాయాన్ని పండుగ చేశాం 
గతంలో తెలంగాణలో యాసంగి సీజన్‌ పంటలు ఎన్నడూ 20లక్షల ఎకరాలు దాటలే. ఇప్పుడు 65 లక్షల ఎకరాలకు పైన సాగవుతోంది. ఇది వృద్ధి కాదా? ఆరేళ్లలో ఇంత పెద్దమార్పు తెచ్చినం. చెరువులన్నీ నిండి ఉన్నయి. రైతులను ఆదుకోవడానికి గోదావరి జలాలను వాగుల్లోకి కూడా విడుదల చేస్తున్నం. ఇంకా మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం 16, 17లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును యాడ్‌ చేసుకుంటూ పొతామని ఇరిగేషన్‌ అధికారులు చెప్తున్నారు. కచ్చితంగా తెలంగాణలో వ్యవసాయాన్ని ఇప్పటికే పండుగ చేశాం. రైతుల్లో ధీమా, ఆత్మవిశ్వాసం వచ్చింది. కోటి ఎకరాల మాగాణ నేను కన్న కల.. ఇప్పుడు కోటీ 25లక్షల ఎకరాలకు పోతున్నది. కరోనా వచ్చినా రాష్ట్ర జీఎస్డీపీ 1.3 శాతం ఉందంటే ప్రధాన కారణం అభివృద్ధి అయిన వ్యవసాయమే. 

అప్పుల్లో 25వ స్థానంలో ఉన్నం 
రాష్ట్రంలో అప్పులు పరిమితికి మించి పెరగలేదు. అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కింద 25వ స్థానంలో ఉంది. మన మీద చాలా ఘనత వహించిన రాజస్థాన్, ఎంపీ, యూపీ, పంజాబ్, హర్యానా ఉన్నాయి. వారు జీఎస్డీపీ మైనస్‌లో ఉన్నరు. తెలంగాణ ప్లస్‌లో ఉంది. కేంద్ర ఎకనామిక్‌ సర్వే నివేదిక ప్రకారం.. ఇండియాలో కరోనాను తట్టుకుని, తక్కువ అప్పులు చేసి, పటిష్ట ఆర్థిక క్రమశిక్షణ పాటించిన రెండు మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆర్బీఐ వార్షిక నివేదికలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి. అప్పుల్లో జీఎస్డీపీ విలువలో 33.10 శాతంతో యూపీ, 34 శాతంతో రాజస్థాన్‌. 38.7శాతంతో పంజాబ్‌ ఉంటే మనం 22.8 శాతంతో 25వ స్థానంలో ఉన్నం. కాపిటల్‌ ఖర్చులో అయితే అన్ని రాష్ట్రాల్లో మనం అగ్రస్థానంలో ఉన్నం. ఉమ్మడి ఏపీ నాడు పదేళ్లలో తెలంగాణలో పెట్టిన క్యాపిటల్‌ ఖర్చు రూ.54 వేల కోట్లే. గత ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.2,34,153 కోట్లు. తద్వారా జీఎస్డీపీ పెరుగుతోంది. 

వేతనంతోపాటు ప్రొబేషన్‌ పెంపు 
పంచాయతీ కార్యదర్శులను టెన్షన్‌లో పెట్టకపోతే పనిచేయరు. పటిష్టమైన చట్టం తెచ్చి మీరు చేయకపోతే ఉద్యోగం పోతదని చెప్పినం. ఇప్పుడు పచ్చదనం కనిపిస్తున్నది. వారికి వచ్చే నెల నుంచే రెగ్యులర్‌ పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చేలా పూర్తి వేతనం ఇస్తాం. అయితే ప్రొబేషన్‌ పీరియడ్‌ను మూడేళ్ల నుంచి నాలుగేళ్లు చేస్తాం. త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు కూడా పెంచుతాం. ఇండియాలో నంబర్‌ వన్‌ వేతనాలు ఇచ్చే రాష్ట్రం మనదే. 

నోటరీలకు, సాదా బైనామాలకు ఓ అవకాశం 
తెలంగాణ భూభాగం 2.77 కోట్ల ఎకరాలుంటే 1.53 కోట్ల ఎకరాలు ధరణిలోకి వచ్చాయి. 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులను 95 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించాం. త్వరలో పూర్తిగా భూముల సర్వే చేసి దానికి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన కోఆర్డినేట్స్‌ ఇస్తాం. ఇక ముందు సరిహద్దులను ఎవరూ మార్చలేరు. ఇంకా మిగిలిన సాదాబైనామాలను పరిష్కరించేందుకు ఓ అవకాశం కల్పిస్తాం. అసైన్డ్‌ ల్యాండ్స్‌పై సంపూర్ణ హక్కులు కల్పించేందుకు అవసరమైతే చట్ట సవరణ చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములు అమ్ముకోవడానికి అవకాశమిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. 

ఒక బొట్టు నీళ్లు కూడా వదలం 
తెలంగాణ నీళ్ల విషయంలో కేసీఆర్‌కు మించిన యావ ఎవరికీ ఉండదు. ప్రాణం పోయినా సరే రాజీపడే సమస్య లేదు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా సేఫ్‌ అయింది. రాయలసీమ లిఫ్టుపై ఇప్పటికే స్టేలు ఉన్నాయి. కేంద్రానికి ఫిర్యాదు చేశాం. అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం. ఆర్డీఎస్‌లో కూడా ఏపీవాళ్లు చిలిపి పనులు చేస్తున్నరు. తెలంగాణ తన హక్కులను వదులుకోదు. ఒక్క బొట్టు నీళ్లు కూడా వదలం. 

భట్టి తీరుపై సీఎం పిట్ట కథ! 
‘‘కరోనాతో ప్రపంచం తలకిందులైంది. దేశం కూడా మైనస్‌ 3.8 శాతం జీడీపీతో సతమతం అవుతోంది. మన రాష్ట్రం కూడా రూ.లక్ష కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా దెబ్బతిన్నది. అయినా గట్టిగా ఎదుర్కొన్నం. ‘ఒక ఊర్లో ఒకాయన పాము కరిచి చనిపోయాడు. అందరూ వచ్చి చూసి ఏమైందని అడుగుతూ, అయ్యో అనుకుంట పోతున్నరు. భట్టి విక్రమార్క లాంటి మిత్రుడు కూడా వచ్చిండు. ఏమైంది ఎట్ల చనిపోయిండని అడిగిండు. పాము కరిచింది అన్నరు. యాడ కరిచింది అంటే.. కనుబొమ్మ దగ్గర కరిచిందని చెప్పిన్రు. అప్పుడా మిత్రుడు.. ‘ఇంకా నయం.. కొంత కిందికి కరిస్తే కన్నుపోయేది అన్నడట’. చెట్టంత మనిషే పోయాక కన్ను ఉంటే ఏంది పోతే ఏంది? భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఏవేవో అసంబద్ధమైన లెక్కలు చెప్తున్నరు.’’  

కరోనాతో నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయాం
57 ఏళ్లకు వృద్ధాప్య పెన్షన్ల వయో పరిమితి తగ్గింపు ఉత్తర్వులను అతి త్వరలో జారీ చేస్తాం. కరోనా వల్ల నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయినం. నిరుద్యోగులెవరూ, వారిని ఎలా గుర్తించాలి. ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారోననే ఆలోచన చేస్తుండగా కరోనా వచ్చింది. నిరుద్యోగ భృతి కూడా తప్పకుండా అమలు చేస్తాం. హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలను తప్పకుండా పెంచుతాం.

త్వరలో ధూల్‌పేటలో పర్యటిస్తా 
నియోజకవర్గాలకు పనులు, నిధుల కేటాయింపుల్లో అధికార, విపక్షం అనే వివక్ష చూపం. రాబోయే ఏడెనిమిది నెలల్లో 141 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ వెజ్, నాన్‌వెజ్‌ మార్కెట్లు ఏర్పాటు చేస్తాం. ధూల్‌పేటలో కమ్యూనిటీ హాల్‌ కట్టాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అడిగారు. కడ్తామని హామీ ఇచ్చిన. నేను కూడా ధూల్‌పేట సందర్శనకు వస్తానని చెప్పిన. సీఎస్, నగర మంత్రులు, అధికారులను తీసుకెళ్తా. అక్కడి యువత తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా ఉపాధి కల్పిస్తాం. 

పోడుకు శాశ్వత పరిష్కారం 
ఎస్సీ సబ్‌ ప్లాన్‌కి అదనంగా రూ.1,000 కోట్లను సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ కింద పెట్టినం. నియోజకవర్గానికి రూ.10 కోట్లు, రూ.15 కోట్లు ఇచ్చి 4 , 10, 20 కుటుంబాలు బాగుపడేలా చూద్దాం. ఏ పార్టీ అనే తేడా లేకుండా దళిత ఎమ్మెల్యేలను పిలుచుకుని మాట్లాడుతాం. ప్రజాదర్బార్‌ పెట్టి పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement