సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటి కోరకు దాదాపు 120 నుంచి 130 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై త్వరలో విధానపర నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఇకపై హైదరాబాద్ లో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్ ఆదేశించారు.
ఆదివారం ప్రగతి భవన్ ఆర్టీసిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినా వెనకడుగువేయకుండా ఆర్టీసి ని తిరిగి బతికించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తున్నది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భధ్రతనిస్తున్నది. ఇటీవల విద్యుత్ శాఖలో ప్రయివేటు భాగస్వామ్యం పెంచాలని ఎవరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. పైగా వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యలరైజ్ చేసింది. ఆధారపడిన కుటుంబాలను కాపాడింది. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ సహా, ప్రభుత్వ రంగం సంస్థలను ప్రయివేటు పరం చేసుకుంటూ వస్తున్నది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెకకకు పోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటుంది.
నేనుంత కాలం ఆర్టీసీని బతికించుకుంటా
అందులో భాగంగా ఆర్టీసీ సంస్థను బతికించుకోని తిరిగి గాడిన పెట్టేదాక నీను నిద్రపోను. నేనుంత కాలం ఆర్టీసీని బతికించుకుంటా. ఆర్టీసీ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కటుంబాలు పెద్ద సంఖ్యలో వున్నాయి. దాంతో పాటు పేదలకు ఆర్టీసీ అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ. ఈ కారణాల చేత ప్రభుత్వం లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసిని కాపాడుకోవాలనుకుంటున్నది. ప్రభుత్వం ఆర్టీసి కి ఆర్ధికంగా అండగా నిలుస్తుంది. ఆర్టీసి కార్మికులకు ఇప్పటకే పెండింగులో వున్న రెండు నెల్ల జీతాలను తక్షణమే చెల్లించాలి .అందుకు తక్షణమే ఆర్ధికశాఖ 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలి..’’ అని సిఎం స్పష్టం చేశారు.
లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు
కరోనా భయంతో కొంత, వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగిపోయిన కారణం చేత, కొన్ని నెలలుగా ఆర్టీసీలో ఆక్యేపెన్సీ రేషియో తగ్గిపోయిందని తద్వారా ఆర్టీసీ తిరిగి నష్టాల బాటపట్టిందని అధికారులు సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ కు వివరించారు. కాగా, కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్టీసీకి తిరిగి కోరోనా ముందటి పరిస్థితిని తీసుకురాగలమో అధికారులు విశ్లేషించుకోవాలని సిఎం ఆదేశించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని ఈ సందర్బంగా సీఎం తెలిపారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవల తో లాభాలను గడిస్తుందనిఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్సెల్ ట్రాన్స్ పోర్టు చేసిన రికార్డును ఆర్టీసీ సొంతం చేసుకోవడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడను అధికారులను అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసీకి అధనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని, అందుకు ఆర్టీసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులు, సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
‘‘కరోనా అనంతర పరిస్థితులనుంచి వొక్కొక్క వ్యవస్థ గాడిన పడుతున్నది. ప్రజలు బైటికొస్తున్నరు. హోటల్లు దాబాలు తదితర ప్రజావసరాల రంగాలు తిరిగి కోలుకుంటున్నవి. జన సంచారం క్రమ క్రమంగా పుంజుకుంటున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆర్టీసిని తిరిగి ఆదరించాలంటే ఎటువంటి విధానాలను అవలంభించాల్నో లోతుగా చర్చించండి.’’ అని సీఎం అధికారులను ఆదేశించారు. హైద్రాబాద్ సిటీలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైద్రాబాద్కు జిల్లాల నుంచి వచ్చి పోయే ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుదుందని, అందుకోసం హైద్రాబాలో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సిఎం తెలిపారు.
ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్.. సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్., సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు ,ఆర్టీసి ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.